Updated : 21 Mar 2022 12:45 IST

Tollywood: కుదిరితే జంట.. కనులకే పంట

హీరోకి తగిన జోడీ.. కథలోని పాత్రకి తగిన కథానాయిక... నిర్మాతల మార్కెట్‌ లెక్కలకి తగ్గ హీరోయిన్‌... సినిమా షూటింగ్‌ జరిగే సమయానికి డేట్లు సర్దుబాటు చేసే నాయిక... ఇలా ఓ సినిమాకి కథానాయికని ఎంపిక చేయడం వెనక చాలా తతంగమే ఉంటుంది. అన్నీ కుదిరితేనే అనుకున్న జంట తెరపై మెరిసేది. కథ తర్వాత సింహభాగం కసరత్తులు జోడీ ఎంపికకి సంబంధించే జరుగుతుంటాయి. కొన్ని బృందాలు చాలా రోజులుగా వీరి ఎంపికపై దృష్టిపెట్టాయి. ఆ క్రమంలో పలు జోడీలు దాదాపుగా ఖరారైనట్టే అనే సంకేతాలు పరిశ్రమ నుంచి వస్తున్నాయి.

తెలుగులో ఈ మధ్య అనూహ్యంగా కొన్ని కలయికలు సెట్‌ అయ్యాయి. విజయ్‌ దేవరకొండ - శివ నిర్వాణ  కలయిక మినహా మిగతా వాటి గురించి పరిశ్రమలో పెద్దగా ప్రచారం జరగలేదు. కథ పక్కా కావడం, ఆ వెంటనే పచ్చజెండా ఊపడం, పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు ఊపందుకోవడం... ఇలా చకచకా జరిగిపోతున్నాయి. ఆ క్రమంలోనే కథానాయికల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. అందులో భాగంగానే కొన్ని కొత్త జంటలు తెరపైకి వస్తున్నాయి.
* విజయ్‌ దేవరకొండ - శివ నిర్వాణ కలయికలో సినిమా చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నదే. ‘లైగర్‌’ తర్వాత వెంటనే మరోసారి పూరితో కలిసి విజయ్‌ దేవరకొండ సినిమా చేసే అవకాశాలు కనిపించాయి. ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కడానికి ఇంకా సమయం ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో విజయ్‌ దేవరకొండ - శివ నిర్వాణ కలయికలో ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి   సన్నాహాలు ఊపందుకున్నాయి. ఇందులో నాయికగా కియారా
అడ్వాణీని  ఎంపిక చేసేందుకు చిత్రబృందం ఆమెని సంప్రదించింది. డేట్లు సర్దుబాటు కాలేదు. దాంతో సమంతని ఖాయం చేసినట్టు సమాచారం. అలా విజయ్‌ - సమంత జోడీ ‘మహానటి’ తర్వాత మరోసారి ఖాయమైంది.

* కృతిశెట్టి జోరుమీద ఉంది. పట్టాలెక్కే యువ కథానాయకుల కొత్త ప్రాజెక్టులన్నీ ఆమె చుట్టూనే తిరుగుతున్నాయి. శర్వానంద్‌ కథానాయకుడిగా కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం, పవన్‌కల్యాణ్‌ - సాయి తేజ్‌ కథానాయకులుగా తెరకెక్కుతున్న ‘వినోదాయ చిత్తం’ సినిమా కోసం కృతిశెట్టినే సంప్రదించారని, ఆమె దాదాపుగా ఖాయమైనట్టేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల ప్రచారంలోకొచ్చిన మరో జోడీ రామ్‌ పోతినేని - రష్మిక మందన్న. రామ్‌ పోతినేని కథా నాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దీనికోసం  రష్మిక మందన్న పేరు ఖాయమైనట్టు తెలుస్తోంది. ఆమెతో చిత్రబృందం సంప్రదింపులు జరుపుతోంది.
* పరిశ్రమలో ప్రచారంలో ఉంటూ, ప్రేక్షకులను ఊరిస్తున్న మరో జోడీ నితిన్‌ - శ్రీలీల. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కథానాయికగా శ్రీలీల   దాదాపుగా ఖాయమైనట్టు అని పరిశ్రమ వర్గాలు   చెబుతున్నాయి.

* ప్రచారంలో ఉన్న ఆ జోడీలు కుదిరాయంటే మాత్రం తెరపై కనులపండువ ఖాయం. కొత్త ప్రాజెక్టుల్లో అవకాశాలు అందుకోవడంలో నయా భామలు కృతిశెట్టి, శ్రీలీల జోరు   ప్రదర్శిస్తున్నారు.
* చిరంజీవి కథా  నాయకుడిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలోనూ రవితేజ - నివేథా పేతురాజ్‌ జోడీ సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌ - మారుతి కలయికలో సినిమాకి సంబందించీ మాళవిక మోహనన్‌, శ్రీలీల, కృతిశెట్టి తదితర భామల పేర్లు వినిపిస్తున్నాయి.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని