Varun Sandesh: నటుడిగా కొత్త తలుపులు తెరుచుకున్నాయి

నా వ్యక్తిత్వానికి పూర్తి భిన్నమైన పాత్రతో రూపొందిన చిత్రమే ‘నింద’ అన్నారు కథానాయకుడు వరుణ్‌ సందేశ్‌. ‘హ్యాపీడేస్‌’తో ప్రయాణం మొదలుపెట్టిన ఈయన... ప్రేమకథలతోనే ఎక్కువగా సందడి చేశారు.

Published : 19 Jun 2024 01:42 IST

నా వ్యక్తిత్వానికి పూర్తి భిన్నమైన పాత్రతో రూపొందిన చిత్రమే ‘నింద’ అన్నారు కథానాయకుడు వరుణ్‌ సందేశ్‌. ‘హ్యాపీడేస్‌’తో ప్రయాణం మొదలుపెట్టిన ఈయన... ప్రేమకథలతోనే ఎక్కువగా సందడి చేశారు. ఇప్పుడు కొత్త దారుల్లో ప్రయాణం చేస్తున్నారు. అందులో భాగంగా చేసిన సినిమానే ‘నింద’. రాజేశ్‌ జగన్నాథం దర్శకనిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా వరుణ్‌ సందేశ్‌ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘వరుణ్‌ సందేశ్‌ అంటే...  తనతో ఇలాంటి కథలే తీయాలని ముందే ఓ నిర్ణయానికొచ్చేవారు దర్శకనిర్మాతలు. అందుకు తగ్గట్టే ప్రేక్షకులు కూడా అమ్మాయిల వెంట తిరిగే ఓ లవర్‌బాయ్‌గానే ఊహించుకుని నా సినిమాకి వచ్చేవారు. ఎప్పుడూ అదే రకమైన పాత్రలు, కథల్లో నటిస్తూ నాకే అసంతృప్తిగా అనిపించేది. కొన్ని కథలేమో చెప్పినప్పుడు ఒకలాగా, తీరా తెరపైకి వచ్చినప్పుడు మరోలా అనిపించేవి.  ఓ సినిమా చేస్తున్నప్పుడే ‘అసలు నేనేం చేస్తున్నాను?’ అని ప్రశ్నించుకుని, ఆ తర్వాత అమెరికా వెళ్లి ఏడాదిన్నర విరామం తీసుకుని తిరిగి వచ్చా. ఆ సమయంలోనే రాజేశ్‌ జగన్నాథం ‘నింద’ కథని చెప్పారు. నా గత సినిమాల ఛాయలు ఏమాత్రం కనిపించని ఈ కథ విన్న వెంటనే తెలియని ఉత్సాహం కలిగింది. స్వతహాగా నేను ఇష్టపడే కథలు ఈ తరహావే. కానీ ఎవ్వరూ చెప్పేవారు కాదు. ఇన్నాళ్లకు నాకు నచ్చిన ఓ కథ దొరికిందనే అనుభూతి కలిగింది’’. 

  • ‘‘సస్పెన్స్, థ్రిల్లింగ్‌ అంశాలతో కూడిన కథే ఇది. ఈ తరహా కథలతో ఇదివరకూ సినిమాలు వచ్చాయి. కానీ ఇందులో స్క్రీన్‌ప్లేనే చాలా కొత్తగా ఉంటుంది. అదే నాకు బాగా నచ్చింది. దర్శకుడు స్క్రిప్ట్‌లో చివరి పది పేజీల్ని తీసేసి, ప్రతి నటుడికీ ముందే ఇచ్చి చదివించారు. ప్రతి ఒక్కరూ చివర్లో ఏం జరుగుతుంది, ఇందులో నిందితుడు ఎవరనే ఓ ఉత్కంఠతో సెట్స్‌కి వచ్చారు. క్లైమాక్స్‌ని ఎవ్వరికీ చెప్పకుండా దర్శకుడు ఈ సినిమాని చిత్రీకరించారు. ఆ నిర్ణయం ప్రతి ఒక్కరూ సహజంగా నటించడానికి దోహదం చేసింది. శారీరకంగా కంటే, మానసికంగా ఈ పాత్ర కోసం కసరత్తులు చేసి నటించా. కళ్లతోనే భావాలు పలికించే పాత్ర అది.  జాతీయ మానవ హక్కుల కమిషన్‌తో సంబంధమున్న వివేక్‌ అనే యువకుడిగా నేను కనిపిస్తా. నాలో కనిపించే చిన్న పిల్లాడిని పూర్తిగా  పక్కనపెట్టి, నాకు సంబంధం లేని ఓ కొత్త రకమైన పాత్రలోకి వెళ్లి నటించా. దర్శకనిర్మాత రాజేశ్‌ జగన్నాథం అమెరికాలో సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి, ఓ తపనతో ఈ సినిమా చేశారు’’.
  • ‘‘నేను ఎంచుకుంటున్న కథలు సరైనవి కాదనుకున్నానే తప్ప... నేను ఎంచుకున్న ఈ రంగం సరైంది కాదనే అభిప్రాయం నాకెప్పుడూ కలగలేదు. నాకు తెలిసింది సినిమానే. చిన్న వయసులోనే కెరీర్‌ని ఆరంభించా. నా ఆలోచనల్లో ఇప్పుడు పరిణతి పెరిగింది. నా గురించి బయట రకరకాల అభిప్రాయాలు వినిపించేవి. కానీ బిగ్‌బాస్‌ షోకి వెళ్లాక వ్యక్తిగా నేనేమిటో అందరికీ అర్థమయ్యా. అది చాలా మేలు చేసింది. ‘మైఖేల్‌’ సినిమాలో తొలిసారి ప్రతినాయక ఛాయలున్న పాత్ర చేశా. అది నాకు బాగా కిక్‌నిచ్చింది. ఆ సినిమాతోనే నటుడిగా నాకు కొత్త తలుపులు తెరుచుకున్నాయి.  ఈమధ్య భిన్న నేపథ్యాలతోకూడిన కథలు వస్తున్నాయి. త్వరలోనే ఎవ్వరూ ఊహించని ఓ కొత్త రకమైన గెటప్‌తో మరో సినిమా చేస్తున్నా. దాంతో పాటు ‘కానిస్టేబుల్‌’ అనే మరో సినిమా చేస్తున్నా’’.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని