Tollywood: శుభకృతంగా ప్రకటించారు

కొత్త సినిమాకి సంబంధించిన సంగతుల్ని ప్రకటించడానికి ఉగాదికి మించిన మంచి రోజు ఇంకేం ఉంటుంది? అందుకే పలు చిత్రబృందాలు కొత్త సినిమాల ప్రకటనల్ని, ఆయా సినిమాల

Updated : 03 Apr 2022 08:01 IST

కొత్త సినిమాకి సంబంధించిన సంగతుల్ని ప్రకటించడానికి ఉగాదికి మించిన మంచి రోజు ఇంకేం ఉంటుంది? అందుకే పలు చిత్రబృందాలు కొత్త సినిమాల ప్రకటనల్ని, ఆయా సినిమాల పేర్లని ఉగాది సందర్భంగా శనివారం ప్రకటించాయి. ఆ విషయాలివీ..


సుందరం పంచకట్టు పాట

నాని కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘అంటే...సుందరానికీ!’. నజ్రియా ఫహాద్‌ కథా  నాయిక. వివేక్‌ ఆత్రేయ  దర్శకుడు. నవీన్‌ యెర్నేని, రవి శంకర్‌.వై నిర్మాతలు. ఈ సినిమాలోని తొలి పాట ‘పంచకట్టు...’ని ఈ నెల 6న విడుదల చేయనున్నట్టు సినీ వర్గాలు ప్రకటించాయి. జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ  సినిమాకి సంగీతం: వివేక్‌ సాగర్‌, ఛాయాగ్రహణం: నికేత్‌ బొమ్మి.


నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ...

ఉదయ్‌ శంకర్‌ కథానాయకుడిగా శ్రీరామ్‌ ఆర్ట్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. జెన్నీఫర్‌ ఇమ్మానుయేల్‌  కథానాయిక. మదునందన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. కమర్షియల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి గురుపవన్‌ దర్శకుడు. అట్లూరి నారాయణరావు నిర్మాత. ఉగాది    సందర్భంగా ఈ సినిమా పేరుని ప్రకటించింది చిత్రబృందం. ‘నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ...’ అనే పేరుని ఖరారు చేసినట్టు వెల్లడించింది. సుమన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సన, కల్యాణ్‌ తదితరులు నటిస్తున్నారు.


‘రాజమండ్రి రోజ్‌ మిల్క్‌’

ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి ఇంట్రూప్‌ నిర్మాణ సంస్థ రూపొందిస్తున్న చిత్రం ‘రాజమండ్రి రోజ్‌ మిల్క్‌’. జై జాస్తి, అవంతిక ప్రధాన పాత్రధారులు. నాని బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. డి.సురేష్‌బాబు, ప్రదీప్‌ ఉప్పలపాటి నిర్మాతలు. రాజమండ్రిలో చిత్రీకరణ మొదలు పెట్టినట్టు శనివారం వెల్లడించారు దర్శకుడు. ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రమిది. కాలేజీ రోజుల్లోని మరపురాని సంఘటనల్ని గుర్తు చేస్తుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, ప్రీతినిగమ్‌, వెంకటేష్‌ గణేష్‌, హేమంత్‌ మధుమణి, ధరహాస్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్‌ వర్గీస్‌ సంగీతం అందిస్తున్నారు.


‘ఆన్‌ ది వే’

క్రైమ్‌ కామెడీ కథతో రూపొందుతున్న చిత్రం ‘ఆన్‌ ది వే’. ఆనంద్‌వర్ధన్‌, దివి, అర్జున్‌, స్నేహల్‌, సునీల్‌, హర్షవర్ధన్‌, రాఘవ, మహబూబ్‌ భాష ప్రధాన పాత్రలు పోషించారు. హరి పెయ్యల దర్శకుడు. ఎ.శివహరీష్‌, ఎ.జయంత్‌రెడ్డి నిర్మాతలు. ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ లోగోని శనివారం కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ విడుదల చేశారు. పోస్టర్‌, టైటిల్‌ ఆసక్తికరంగా ఉన్నాయనీ, చిత్రం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు.


‘శాసనసభ’

ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్‌ భకుని జంటగా నటిస్తున్న చిత్రం ‘శాసనసభ’. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా... పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రమిది. తులసీరామ్‌ సప్పాని, షణ్ముగం సప్పాని నిర్మిస్తున్నారు. వేణు మడికంటి దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం ఈ సినిమా  పోస్టర్‌ని విడుదల చేశారు. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో సాగే చిత్రమని, తెలుగుతోపాటు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నామని సినీ వర్గాలు తెలిపాయి.


కొత్త దర్శకుడితో

వైవిధ్యమైన కథల్ని ఎంపిక చేసుకుంటున్న నాగశౌర్య కథానాయకుడిగా  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై ఓ చిత్రం రూపొందనుంది. పవన్‌ బాసంశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. ఇంకా పేరు ఖరారు చేయని ఈ సినిమాలో నాగశౌర్య లుక్‌ కొత్తగా ఉంటుందని సినీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు