Published : 09 Jan 2021 16:01 IST

సంక్రాంతి ‘సినీ ట్రైలర్ల’ హంగామా!

సంక్రాంతి పండగ వాతావరణం ఇప్పటికే మొదలైంది. దాంతోపాటే కొత్త సినిమాల సందడి షురూ కానుంది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఇప్పటికే థియేటర్‌లో బొమ్మ పడి తొమ్మిది నెలల పైమాటే. కరోనా కాస్త కంట్రోల్‌ కావడంతో ఇప్పుడిప్పుడే అన్ని వ్యవస్థలతో పాటు సినిమా రంగం కూడా ట్రాక్‌లోకి వచ్చింది. మరి ఈ సంక్రాంతికి అభిమానులకు వినోదం పంచడానికి కొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రాల ట్రైలర్లు యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అవేంటో ఒకసారి చూద్దామా!

యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘రెడ్‌’

గతేడాది ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ హిట్‌తో మంచి జోరుమీదున్న రామ్‌ ‘రెడ్‌’ అంటూ యాక్షన్‌ చూపించబోతున్నారు. ఇటీవల విడుదలైన చిత్ర ట్రైలర్‌ చూస్తుంటే ప్రేక్షకులను మునివేళ్లపై కూర్చోబెట్టే విధంగా కనిపిస్తోంది. తమిళంలో బంపర్‌హిట్‌ అయిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘తడమ్‌’కు రీమేక్‌గా వస్తున్న ‘రెడ్‌’కు కిషోర్‌ తిరుమల దర్శకుడు. ఇందులోని ఢించక్‌.. ఢించక్‌ అంటూ సాగే ఐటమ్‌ సాంగ్‌ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. హీరో రామ్‌ తొలిసారి ఈ చిత్రంలో ద్విపాత్రభినయం చేయడం విశేషం. జనవరి 14న థియేటర్లను చేరనున్న ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

కిరాక్‌ పుట్టిస్తున్న ‘క్రాక్‌’

వెంకీమామ వాయిస్‌ ఓవర్‌తో మొదలయ్యే ‘క్రాక్‌’ ట్రైలర్‌ ఆద్యంతం హైవోల్టేజ్‌తో అలరిస్తోంది. రవితేజ నుంచి అభిమానులు ఎలాంటి సినిమా ఆశిస్తారో ఆ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు దర్శకుడు గోపిచంద్‌ మలినేని. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘డాన్‌శీను’, ‘బలుపు’ చిత్రాలు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి పక్కా మాస్‌ కథతో ఈ కాంబో వస్తోంది. నూతన సంవత్సర కానుకగా విడుదలైన ‘క్రాక్‌’ ట్రైలర్‌ యూట్యూబ్‌లో కిర్రాక్‌ పుట్టిస్తోంది. ముందుగా అనుకున్న తేదీ జనవరి 14న కాకుండా జనవరి 9న ‘క్రాక్‌’ పోతురాజు వీరశంకర్‌ గన్‌ బుల్లెట్‌ థియేటర్లను తాకనుంది. 

 

అల్లుడు అదుర్స్‌ అంటున్న బెల్లంకొండ శ్రీనివాస్‌

యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ ఈ సంక్రాంతికి తనదైన శైలిలో వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యారు. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అల్లుడు అదుర్స్‌’. నభా నటేశ్‌ కథానాయిక. సోనూసూద్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 15న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌ చూస్తే, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తీర్చిద్దినట్లు అర్థమవుతోంది.

 

‘మాస్టర్‌’ మెరుపులు

తమిళంతో పాటు, తెలుగులోనూ మంచి మార్కెట్‌ను దక్కించుకున్న నటుడు విజయ్‌. ఆయన కథానాయకుడిగా లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వస్తున్న చిత్రం ‘మాస్టర్‌’. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఖైదీ’తో అందరి దృష్టి తనవైపు తిప్పుకున్న దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుంటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌, సాంగ్స్‌ యూట్యూబ్‌లో అలరిస్తున్నాయి. మాళవిక మోహన్‌, విజయ్‌ సేతుపతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచందర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

 

అన్నట్టు నీకు ‘మెయిల్‌’ ఐడీ ఉందా..?

ఒక పక్క సహాయ పాత్రలు పోషిస్తూనే, చిన్న సినిమాల్లో హీరోగా అలరిస్తున్నారు నటుడు ప్రియదర్శి. తాజాగా ఆయన ప్రధానపాత్రలో నటిస్తున్న ‘మెయిల్‌’ టీజర్‌ విడుదలయ్యింది. జనవరి 12న ఆహాలో విడుదలవునున్న ఈ సినిమా కథా నేపథ్యం ప్రేక్షకుల్లో ఉత్సుకత పెంచుతోంది. కంప్యూటర్లు గ్రామాలకు వచ్చిన తొలిరోజుల్లో పరిస్థితులు ఎలా ఉండేవో తెలుపుతూ హస్యభరితంగా సినిమా ఉండనున్నట్టు అర్థమవుతోంది. ఒక నెట్‌ సెంటర్‌ యజమానిగా, కుర్రాళ్లకు కంప్యూటర్‌ నేర్పే పాత్రలో ఒదిగిపోయాడు ప్రియదర్శి. స్వప్న సినిమా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఉదయ్‌ గుర్రాల దర్శకత్వం చేస్తున్నారు. సున్నితమైన కథాంశంతో తెరకెక్కిన ‘మెయిల్’ టీజర్‌ చూసేయండీ!

 

దూసుకుపోతున్న ‘జాంబిరెడ్డి’ ట్రైలర్‌

హాలీవుడ్‌కే పరిమితమైన జాంబీ జోనర్‌లో వస్తున్న తొలి తెలుగు చిత్రం ‘జాంబిరెడ్డి’. ఇటీవల ప్రభాస్‌ విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ‘‘ప్రతి సంక్రాంతికి అల్లుళ్లు వస్తారు, ఈ సంక్రాంతికి జాంబీలు వస్తాండాయ్‌రో’’ అంటూ కామెడీ టచ్‌తో ఉన్న మాటలు ఆసక్తి రేపుతున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కించినట్టు దర్శకుడు ప్రశాంత్‌వర్మ పేర్కొన్నారు. అలాగే సీమ ఫ్యాక్షనిజానికి, జాంబీలకు ముడిపెట్టి తీసిన ఈ చిత్ర ట్రైలర్‌ చూస్తుంటే ప్రేక్షకులకు నవ్వుల విందే అన్నట్టుగా ఉంది. తేజా సజ్జా, ఆనందిని, దక్షా నాగర్కర్‌, గెటప్‌శ్రీను ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రం సంకాంత్రికి థియేటర్లో అలరించనుంది. విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని