Virupaksha Review: రివ్యూ: విరూపాక్ష‌

సాయిధరమ్‌ తేజ్‌ (Saidharam Tej) నటించిన విరూపాక్ష (Virupaksha Review) సినిమా ఎలా ఉందంటే..?

Updated : 21 Apr 2023 13:02 IST

Virupaksha Review.. చిత్రం: విరూపాక్ష‌; నటీనటులు: సాయిధరమ్ తేజ్, సంయుక్త, ర‌వికృష్ణ‌, సోనియా సింగ్‌, అజ‌య్‌, బ్ర‌హ్మాజీ, సాయిచంద్‌, సునీల్‌, రాజీవ్ క‌న‌కాల, శ్యామ‌ల త‌దిత‌రులు; స్క్రీన్ ప్లే: సుకుమార్‌, ఛాయాగ్ర‌హ‌ణం: శ్యామ్ ద‌త్ సైనుద్దీన్‌, సంగీతం: బి.అజ‌నీష్ లోక్‌నాథ్‌; ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: శ్రీనాగేంద్ర తంగ‌ల, స‌మ‌ర్ప‌ణ‌: బాపినీడు; నిర్మాత‌: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌; సంస్థ‌:  శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్; ద‌ర్శ‌క‌త్వం: కార్తీక్ వ‌ర్మ దండు; విడుద‌ల‌: 21/04/2023

తెలుగులో రూపుదిద్దుకున్న మ‌రో పాన్ ఇండియా సినిమాగా విడుద‌ల‌కి ముందే ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించిన చిత్రం.. ‘విరూపాక్ష‌’ (Virupaksha). అన్ని భాష‌ల్లోనూ ఒకేసారి విడుద‌ల కాక‌పోయినా.. మంచి ప్ర‌చారాన్ని మాత్రం సొంతం చేసుకొంది. సాయిధ‌ర‌మ్ తేజ్ (Saidharam Tej) ప్ర‌మాదం నుంచి కోలుకున్నాక చేసిన సినిమా ఇది. అగ్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ స్క్రీన్‌ప్లే స‌మ‌కూర్చగా.. ఆయ‌న శిష్యుడు కార్తీక్ వ‌ర్మ దీన్ని తెర‌కెక్కించారు. ప్ర‌చార చిత్రాల‌తో ఆస‌క్తిని రేకెత్తించిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం (Virupaksha Review).

క‌థేంటంటే: రుద్ర‌వ‌నం అనే ఊరి చుట్టూ సాగే క‌థ ఇది. చేత‌బ‌డి చేస్తూ చిన్న పిల్ల‌ల మ‌ర‌ణానికి కార‌ణ‌మ‌వుతున్నారంటూ ఆ ఊరికి వ‌చ్చిన ఓ జంట‌ని స‌జీవ ద‌హ‌నం చేస్తారు గ్రామ‌స్థులు. వారు మంట‌ల్లో కాలిపోతూ పుష్క‌ర కాలం త‌ర్వాత ఈ ఊరు వ‌ల్ల‌కాడు అయిపోతుంద‌ని శపిస్తారు. అందుకు త‌గ్గ‌ట్టే స‌రిగ్గా ప‌న్నెండేళ్ల త‌ర్వాత ఆ ఊళ్లో వ‌రుసగా మ‌ర‌ణాలు సంభ‌విస్తాయి. దాంతో గ్రామాన్ని అష్ట‌దిగ్బంధ‌నం చేయాల‌ని తీర్మానిస్తారు పెద్ద‌లు. కొన్ని రోజుల‌పాటు అక్కడి జ‌నాలు బ‌య‌టికి వెళ్ల‌డానికి కానీ.. కొత్త‌వాళ్లు ఊళ్లోకి రావ‌డానికి కానీ అవ‌కాశం లేకుండా చేస్తారు. అయినా స‌రే మ‌ర‌ణాలు మాత్రం ఆగ‌వు. త‌న త‌ల్లితో క‌లిసి బంధువుల ఇంటికి వ‌చ్చిన సూర్య (సాయిధ‌ర‌మ్ తేజ్‌) (Saidharam Tej) తిరిగి వెళ్లే అవ‌కాశం ఉన్నా.. తాను మ‌న‌సుప‌డిన నందిని (సంయుక్త‌) (Samyuktha) ప్రాణాల్ని కాపాడ‌టం కోసం మ‌ళ్లీ ఊళ్లోకి తిరిగొస్తాడు. ఈ చావుల వెన‌కున్న ర‌హ‌స్యాల్ని ఛేదించ‌డానికి న‌డుం బిగిస్తాడు. మ‌రి సూర్య త‌ను అనుకున్నది చేశాడా? ఈ వ‌రుస చావుల వెన‌క ఎవ‌రున్నార‌నేది మిగ‌తా క‌థ. (Virupaksha Review).

ఎలా ఉందంటే: 1979లో మొద‌లై 90 ద‌శ‌కం నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. మిస్టిక్ థ్రిల్ల‌ర్‌గా ప్ర‌చార‌మైన ఈ సినిమా.. తాంత్రిక శ‌క్తులు, ఆత్మ‌లు అంటూ చాలాచోట్ల భ‌య‌పెడుతూనే థ్రిల్‌కి గురిచేస్తుంది. ఊరి శివార్లలో పాడుబ‌డిన ఓ ఇల్లు.. అక్క‌డ దాగిన ర‌హ‌స్యం అంటూ ద‌ర్శ‌కుడు స‌గ‌టు థ్రిల్ల‌ర్ సినిమాల‌కి త‌గిన సెటప్‌నే ఎంచుకున్న‌ప్ప‌టికీ  గత చిత్రాల‌కి భిన్నంగా ఓ కొత్త నేప‌థ్యంతో కూడిన క‌థ‌ని రాసుకున్నాడు. ఆ క‌థ‌కి అంతే బ‌ల‌మైన స్క్రీన్‌ప్లే తోడ‌వడంతో సినిమా అడుగ‌డుగునా ఆస‌క్తిని రేకెత్తిస్తూ సాగుతుంది. దంప‌తుల తాంత్రిక పూజ‌ల‌తో క‌థ మొద‌ల‌వుతుంది. క‌థానాయ‌కుడు రుద్ర‌వ‌నంలోకి అడుగుపెట్ట‌డం నుంచి ప్రేమ‌క‌థ‌తో సినిమా మొద‌లైనా.. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో మ‌ర‌ణాల నుంచే ఆస‌క్తి మొద‌ల‌వుతుంది. ప్ర‌తి మ‌ర‌ణం వెన‌క ఓ అంతుచిక్క‌ని కార‌ణం. ఆ మ‌ర‌ణాలు సంభ‌వించే విధానం కూడా ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురిచేస్తాయి. అస‌లు ఎవ‌రు కార‌ణ‌మో తెలుసుకోవాల‌నే ఆసక్తి రేకెత్తించ‌డంలో ద‌ర్శ‌కుడు స‌ఫ‌ల‌మ‌య్యాడు. రైల్వే స్టేష‌న్ ద‌గ్గ‌ర స‌న్నివేశాలు, క‌థానాయ‌కుడి సోద‌రి ఆత్మ‌హ‌త్య నేప‌థ్యంలోని స‌న్నివేశాల్ని డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. ప్ర‌థ‌మార్ధం వర‌కూ వ‌రుస‌గా నాలుగు మ‌ర‌ణాలు చోటు చేసుకోవ‌డం.. సినిమాలో కీలక‌మైన మ‌రో పాత్ర మ‌ర‌ణం నేప‌థ్యంతో విరామ స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు. ద్వితీయార్ధంలోనే అస‌లు క‌థంతా. నాయ‌కానాయిక‌ల పాత్ర‌లకి కూడా ద్వితీయార్ధంలోనే ప్రాధాన్యం ల‌భించింది. ర‌హ‌స్యాన్ని ఛేదించే క్ర‌మంలో కథానాయకుడికి అడుగ‌డుగునా స‌వాళ్లు ఎదుర‌వుతుంటాయి. వాటిని అధిగ‌మిస్తూ ముందుకెళ్లే క్ర‌మంలో ర‌హ‌స్యాలు ఒకొక్క‌టిగా వెలుగులోకి రావ‌డంతో సినిమా ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. భైర‌వ ఎక్క‌డున్నాడో క‌నిపెట్టే క్ర‌మం.. అస‌లు ఊరి జ‌నాల ప్రాణాల‌న్నీ ఎవ‌రి గుప్పిట్లో ఉన్నాయో తెలియ‌డం వంటి స‌న్నివేశాలు సినిమాకి కీల‌కం. ద‌ర్శ‌కుడికి సాంకేతిక బృందాలు చ‌క్కటి స‌హ‌కారం అందించాయి. అక్క‌డ‌క్క‌డా సాగ‌దీత‌గా అనిపించినా మొత్తంగా సినిమా ప్రేక్ష‌కుల‌కి ఓ మంచి థ్రిల్ల‌ర్‌ని చూసిన అనుభూతి క‌లుగుతుంది. (Virupaksha Review).

ఎవ‌రెలా చేశారంటే: సాయిధ‌ర‌మ్ తేజ్ క‌నిపించిన విధానం బాగుంది. ప్ర‌థ‌మార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధంలోనే ఆయ‌న పాత్ర‌కి ప్రాధాన్యం ద‌క్కింది. వీరోచిత విన్యాసాలు చేయ‌క‌పోయినా.. ర‌హ‌స్యాన్ని ఛేదించేందుకు ధైర్యంగా ముందుకెళ్లే యువ‌కుడిగా చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించాడు. ఆయ‌న పాత్ర‌, న‌ట‌న‌లో సహ‌జ‌త్వం క‌నిపిస్తుంది. యాక్ష‌న్ స‌న్నివేశాల్లోనూ ఆయ‌న ప‌నితీరు మెప్పిస్తుంది. సంయుక్త న‌ట‌న‌లో మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించే చిత్ర‌మిది. ప్ర‌థ‌మార్ధంలో ఎంత అందంగా క‌నిపిస్తుందో.. ద్వితీయార్ధంలో అంత‌గా థ్రిల్‌కి గురిచేస్తుంది. ప్రతి దశలో ఓ కొత్త పాత్ర క‌థ‌లోకి వ‌స్తూ ప్ర‌భావం చూపించ‌డం ఈ సినిమా ప్ర‌త్యేక‌త‌. అజ‌య్‌, రాజీవ్ క‌న‌కాల‌, బ్ర‌హ్మాజీ, సాయిచంద్‌, సునీల్, శ్యామ‌ల త‌దిత‌రుల పాత్ర‌ల‌కి మంచి ప్రాధాన్యం ద‌క్కింది. సునీల్ పాత్ర‌లో ప్రతినాయక ఛాయ‌లు క‌నిపించినా ఆ పాత్రని పూర్తిస్థాయిలో తీర్చిదిద్ద‌లేదు. ర‌వికృష్ణ‌, సోనియా సింగ్‌... ఇలా మ‌రికొంద‌రు పోషించిన‌వి చిన్న పాత్ర‌లే అయినా అవి సినిమాపై బల‌మైన ప్ర‌భావాన్ని చూపించాయి. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది.  శ్యామ్ ద‌త్ కెమెరా అద్భుత‌మే చేసింది. రాత్రిళ్లు సాగే స‌న్నివేశాల్ని, రుద్ర‌వ‌నాన్ని ఆయ‌న చూపించిన విధానం చాలా బాగుంది. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ శ్రీనాగేంద్ర ప‌నిత‌నం మ‌రో ఎత్తు. ఆయ‌న త‌న క‌ళా ప్ర‌తిభ‌తో రుద్ర‌వ‌నంకి ప్రాణం పోశారు. అజ‌నీష్ లోక్‌నాథ్ సంగీతం చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లం. పాట‌ల కంటే కూడా నేప‌థ్య సంగీతంపై ఆయ‌న బ‌ల‌మైన ప్ర‌భావం చూపించారు. రాసుకున్న క‌థ‌, ఆ క‌థ‌పై అంతే ప‌ట్టుని ప్ర‌దర్శిస్తూ తెర‌పైకి తీసుకొచ్చిన విధానం ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌కి అద్దం ప‌డుతుంది. సుకుమార్ స్క్రీన్‌ప్లే సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కూ  క‌థ‌లో మ‌లుపులు ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, ఇత‌ర సాంకేతికత విష‌యంలో రాజీ ప‌డ‌కుండా సినిమాని తీర్చిదిద్దారు. (Virupaksha Review) 

బ‌లాలు

+ థ్రిల్‌కు గురి చేసే క‌థ‌, క‌థ‌నాలు; + బ‌ల‌మైన పాత్ర‌లు; + కెమెరా, సంగీతం

బ‌ల‌హీన‌త‌లు

- ద్వితీయార్థంలో కొన్ని స‌న్నివేశాలు

చివ‌ర‌గా: థ్రిల్లింగ్‌ ‘విరూపాక్ష’.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని