Cinema News: జూన్‌... టకటకా

కొన్ని నెలలుగా తెలుగు చిత్రసీమలో విడుదల ఊసులే వినిపించాయి. కాలేజీ విద్యార్థులు బ్యాక్‌లాగ్స్‌తో సతమతమైనట్టే... కరోనా దెబ్బకు తెలుగు చిత్రసీమలోనూ పలు  సినిమాలు పేరుకుపోయిన విషయం తెలిసిందే. ఏళ్లుగా సెట్స్‌పైనే మగ్గిన పలు చిత్రాలు ఈ ఏడాది ఆరంభం నుంచే విడుదల కోసం పోటీ పోడ్డాయి. ఎట్టకేలకి అగ్ర తారలు నటించిన పలు సినిమాలు ఒకొక్కటిగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఆగస్టు వరకూ వస్తూనే ఉంటాయి.

Updated : 30 May 2022 07:04 IST

ఇది ఆరంభ సమయం మిత్రమా!

పెరగనున్న కొత్త సినిమాల జోరు

కొన్ని నెలలుగా తెలుగు చిత్రసీమలో విడుదల ఊసులే వినిపించాయి. కాలేజీ విద్యార్థులు బ్యాక్‌లాగ్స్‌తో సతమతమైనట్టే... కరోనా దెబ్బకు తెలుగు చిత్రసీమలోనూ పలు  సినిమాలు పేరుకుపోయిన విషయం తెలిసిందే. ఏళ్లుగా సెట్స్‌పైనే మగ్గిన పలు చిత్రాలు ఈ ఏడాది ఆరంభం నుంచే విడుదల కోసం పోటీ పోడ్డాయి. ఎట్టకేలకి అగ్ర తారలు నటించిన పలు సినిమాలు ఒకొక్కటిగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఆగస్టు వరకూ వస్తూనే ఉంటాయి. అయితే ఈలోపు కొత్త సినిమాల జోరు షురూ అవుతోంది. పలువురు అగ్ర తారలు జూన్‌ నెలలోనే కొత్త సినిమాలకి క్లాప్‌ కొట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటిదాకా ఆయా కలయికల గురించే మాట్లాడుకున్న అభిమానులు... ఇకపై వాటి కథలు, నేపథ్యాలతోపాటు కొత్త జోడీల వివరాలు, ఇతరత్రా కొత్త సంగతులూ చెప్పుకొనే అవకాశం లభించనుంది.

జూన్‌, జులై... కొత్త విద్యాసంవత్సరం మొదలయ్యే నెలలు. కొత్త తరగతులు, పుస్తకాలు, ఆశలు, లక్ష్యాలతో విద్యార్థులు స్కూళ్లు కాలేజీలకి పరుగులు పెట్టే సమయం. అదే తరహాలోనే మన కథానాయకులూ ఈ నెల నుంచి కొత్త సినీ అధ్యాయాల్ని మొదలు పెట్టనున్నారు. విజయోత్సాహంతో  కొంతమంది... పలు సినిమాలతో బిజీగా గడుపుతూనే, మరో సినిమా కోసం కొద్దిమంది కొత్త సెట్స్‌పైకి రానున్నారు. మహేష్‌బాబు, పవన్‌కల్యాణ్‌, ఎన్టీఆర్‌, నాగచైతన్య, వరుణ్‌తేజ్‌ తదితర కథానాయకుల సినిమాలు ఈ నెలలోనే మొదలు కానున్నాయి. ప్రభాస్‌, రామ్‌ల చిత్రాలూ క్లాప్‌ కొట్టుకొనే  అవకాశాలు కనిపిస్తున్నాయి.

* ‘సర్కారు వారి పాట’తో  ప్రేక్షకుల ముందుకొచ్చిన మహేష్‌ ఇప్పటికే రెండు కొత్త ప్రాజెక్టులకి పచ్చజెండా ఊపిన సంగతి  తెలిసిందే. అందులో ఒకటి త్రివిక్రమ్‌ దర్శకత్వంలో. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత ఆ ఇద్దరి  కలయికలో రానున్న సినిమా ఇది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి జూన్‌ నెలలోనే క్లాప్‌ కొడతారు. ఇప్పటికే త్రివిక్రమ్‌ స్క్రిప్ట్‌ని పక్కా చేసేశారు.

‘భీమ్లానాయక్‌’ సినిమాతో సందడి చేసిన పవన్‌   కల్యాణ్‌... ‘హరి హర వీర మల్లు’తో బిజీగా గడుపుతున్నారు. దాంతోపాటుగా మరికొన్ని చిత్రాలు ఉన్నప్పటికీ..కొత్తగా ఇంకో కథకి పచ్చజెండా ఊపారు. తమిళంలో విజయవంతమైన ‘వినోదాయ సిద్ధం’ రీమేక్‌లో నటించనున్నారు. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ ప్రాజెక్టు జూన్‌లోనే షురూ కానున్నట్టు సమాచారం. ఇందులో సాయి తేజ్‌ నటిస్తారు.

* ఎన్టీఆర్‌ - కొరటాల శివ చిత్రానికీ రంగం సిద్ధమైంది. ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకమైన వీడియో విడుదలైన సంగతి తెలిసిందే. జూన్‌ నెలలోనే పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నాయి సినీ వర్గాలు. కథానాయిక ఎంపికను పూర్తి చేయాల్సి ఉంది.
* ప్రభాస్‌ - మారుతి కలయికలో సినిమా పట్టాలెక్కేందుకూ సమయం దగ్గర పడింది. అన్నీ కుదిరితే ఈ నెలలోనే దీనికి కొబ్బరి కాయ కొట్టేయాలని యోచిస్తున్నారు.

యువ.. నవ

‘ఎఫ్‌3’తో సందడి చేస్తున్న వరుణ్‌తేజ్‌ తదుపరి ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. జూన్‌ నెలాఖరులో దీన్ని ప్రారంభించనున్నారు. యాక్షన్‌ ప్రధానంగా సాగే కథతో రూపొందుతున్నట్టు సమాచారం. ‘థ్యాంక్‌ యూ’తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నాగచైతన్య కోసం పలువురు దర్శకులు కథల్ని సిద్ధం చేశారు. అందులో తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు, తెలుగు దర్శకుడు పరశురామ్‌ ఉన్నారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించనున్న సినిమాని వచ్చే నెలలోనే షురూ చేయనున్నారు. రామ్‌ ‘ది వారియర్‌’ని ఇటీవలే పూర్తి చేశారు. ఇకపై ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్న సినిమాతో బిజీ కానున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఆ సినిమా జూన్‌లోనే మొదలు కానున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా రానున్న రెండు నెలలు ఒక పక్క విడుదలలతోనూ... మరోపక్క ముహూర్తాలతోనూ చిత్రసీమని కళకళలాడించే సూచనలు కనిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని