
Cinema News: సిలకా... రామసిలకా...
అవికాగోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అచ్యుత రామారావు, పి.రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ‘సిలకా... సిలకా... రామా సిలకా... ఏదో ఉందే మెలికా’ అంటూ సాగే ఈ సినిమాలోని ప్రత్యేక గీతాన్ని శనివారం విడుదల చేశారు. సురేష్ బొబ్బిలి స్వరకల్పనలోని ఈ గీతాన్ని కాసర్ల శ్యామ్ రచించగా, రేవంత్ ఆలపించారు. నిర్మాతల్లో ఒకరైన అచ్యుత రామారావు మాట్లాడుతూ ‘‘సరికొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిది. డిగ్రీలు చదివినా, పీజీలు చదివినా టెన్త్ క్లాస్ రోజులు ప్రత్యేకమైనవి. టెన్త్ క్లాస్ రోజులు, ఆ జ్ఞాపకాలు జీవితంపై ఎలా ప్రభావితం చూపిస్తాయో దర్శకుడు ఆసక్తికరంగా తెరపై ఆవిష్కరించారు. ఇదొక మంచి కామెడీ చిత్రంగా ప్రేక్షకుల మనసుల్ని గెలుస్తుంది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘అందరికీ కనెక్ట్ అయ్యే కథ ఇది. సిలకా.. పాటని 150 మంది జూనియర్ ఆర్టిస్టులు, 30 మంది డ్యాన్సర్ల నేపథ్యంలో తెరకెక్కించాం. శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వం ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దర్శకుడిగా ఇది నా తొలి చిత్రమైనా, ఛాయాగ్రాహకుడిగా 50వ చిత్రం. గణతంత్ర దినోత్సవం రోజున టీజర్‌ని విడుదల చేస్తాం’’ అన్నారు. శ్రీనివాసరెడ్డి, వెన్నెల రామారావు, అర్చన, హిమజ, శివబాలాజీ, మధుమిత, సత్యం రాజేష్, భానుశ్రీ తదితరులు నటించారు.