Newsense Review: రివ్యూ: ‘న్యూసెన్స్‌’ (వెబ్‌ సిరీస్).. నవదీప్‌, బిందు మాధవి నటన ఎలా ఉందంటే?

నవదీప్‌, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు శ్రీప్రవీణ్‌ కుమార్‌ తెరకెక్కించిన వెబ్‌ సిరీస్‌ ‘న్యూసెన్స్‌’. ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ సిరీస్‌ ఎలా ఉందంటే?

Updated : 16 May 2023 18:08 IST

వెబ్‌ సిరీస్‌: న్యూసెన్స్‌: సీజన్‌ 1; తారాగణం: నవదీప్‌, బిందు మాధవి, నందగోపాల్‌, మహిమా శ్రీనివాస్‌, షెల్లీ నబు కుమార్‌, చరణ్‌ కురగొండ, రమేశ్‌ కోనంభొట్ల, శ్వేతా చౌదరి తదిరులు; సంగీతం: సురేశ్‌ బొబ్బిలి; ఛాయాగ్రహణం: వేదరామన్‌ శంకరన్; అనంత్‌నాగ్‌ కావూరి, ప్రసన్న కుమార్‌; కూర్పు: శ్రీనివాస్‌ బైనబోయిన; కథ: ప్రియదర్శిని రామ్‌; మాటలు: జయసింహ నీలం; నిర్మాతలు: వివేక్‌ కూచిభొట్ల, టీజీ విశ్వప్రసాద్‌; దర్శకత్వం: శ్రీప్రవీణ్‌ కుమార్‌; ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: ఆహా.

సినీ నటులు నవదీప్‌ (navdeep), బిందు మాధవి (bindu madhavi) ప్రధాన పాత్రల్లో దర్శకుడు శ్రీప్రవీణ్‌ కుమార్‌ తెరకెక్కించిన వెబ్‌ సిరీస్‌.. ‘న్యూసెన్స్‌: సీజన్‌ 1’. మీడియా నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్‌ టీజర్‌, ట్రైలర్లు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి. అలా అంచనాల నడుమ ఓటీటీ ‘ఆహా’లో ఇటీవల విడుదలై సందడి చేస్తోన్న ఈ సిరీస్‌ కథా కమామిషు ఏంటో చూద్దాం (newsense web series review)..

ఇదీ కథ: మదనపల్లి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిందీ కథ. స్థానిక రిపోర్టర్‌ శివ (నవదీప్‌), ఇతర విలేకర్లు.. ఇటు అధికార పార్టీ నాయకులతో, ఇటు ప్రతిపక్ష నాయకులతో స్నేహపూర్వకంగా ఉంటారు. ఆమ్యామ్యాలకు అలవాటుపడతారు. మరోవైపు, తన వ్యవసాయ భూమిని ఫలానా వ్యక్తి కబ్జా చేశాడంటూ అదే గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు.. ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోతాడు. అక్కడ న్యాయం జరగదని భావిస్తాడు. దాంతో.. విలేకరులకు చెబితే వాళ్లు వార్త రాస్తారని, అది ప్రచురితమైతే తనకు ఏదో విధంగా న్యాయం జరుగుతుందని తెలుసుకుంటాడు. అలా తమను సంప్రదించిన వృద్ధుడికి ఆ జర్నలిస్టులు న్యాయం చేయగలిగారా? రాజకీయ నాయకుల అండ ఉన్న వారు తమ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్‌.ఐ.కు ఎందుకు భయపడాల్సి వచ్చింది? స్థానిక రిపోర్టర్‌గా ఉండే తన ప్రేయసి నీల (బిందు మాధవి)ని హైదరాబాద్‌లోని హెడ్‌ ఆఫీసుకి పంపిస్తానన్న శివ మాట నిలబెట్టుకున్నాడా? తదితర ప్రశ్నలకు సమాధానాన్ని తెరపై చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది (newsense review).

ఎలా ఉందంటే: మీడియా ఇతివృత్తంతో సినిమాలే చాలా తక్కువ సంఖ్యలో తెరకెక్కాయి. వెబ్‌ సిరీస్‌ విషయంలో అది ఇంకా తక్కువనే చెప్పాలి. సామాజిక అంశాల ప్రస్తావన, స్కామ్‌లు, ఇన్వెస్టిగేషన్‌ తదితర కోణాలుండడంతో ఆ సజ్జెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది. ఆ క్రమంలోనే 6 ఎపిసోడ్లతో కూడిన ఈ ‘న్యూసెన్స్‌: సీజన్‌ 1’ తీసుకొచ్చారు దర్శకుడు శ్రీప్రవీణ్‌ కుమార్‌. అయితే, ఇది ప్రస్తుతం కథ కాదు. పీరియాడికల్‌ కాన్సెప్ట్‌తో.. 90ల్లో విలేకర్లు, రాజకీయ నాయకుల మధ్య ఎలాంటి సత్సంబంధాలు ఉండేవన్న విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మదనపల్లి చుట్టూ ఆ స్టోరీ నడిపించారు. రిపోర్టర్‌ శివపై ఓ ముఠా దాడి చేసే సన్నివేశంతో సిరీస్‌ ప్రారంభంలోనే ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచిన దర్శకుడు దాన్ని ఆఖరి వరకు ఆ స్థాయి టెంపోను కొనసాగించలేకపోయారు. తెరపై కనిపించే ప్రతి పాత్ర బ్యాక్‌గ్రౌండ్‌ వివరిస్తూ సన్నివేశాలను సుదీర్ఘంగా తెరకెక్కించారు. హీరో ఇంట్రడక్షన్‌ సీన్‌ విషయంలో.. సామాన్యులకు అండగా నిలిచి వారికి న్యాయం చేసేందుకు శివ ఏదైనా సంచలన వార్త రాసుంటాడని, అందుకే అతడిపై దాడి జరిగిందనుకునే అవకాశం ఉంటుంది. ‘మన ఆలోచన కరెక్ట్‌ అవుతుంది’ అని అనుకుంటూ సిరీస్‌ను ఆసక్తిగా చూడడం ప్రారంభిస్తే ఆడియన్స్‌కు నిరాశే ఎదురవుతుంది. ఎందుకంటే.. ఊహించనిది అక్కడ జరుగుతుంది. అలా.. శివ, ఇతర విలేకరుల పాత్రల పరిచయం, భూ వివాదం ఎదుర్కొనే వృద్ధుడు ప్రెస్‌క్లబ్‌ చుట్టూ తిరగడాన్ని చూపిస్తూనే స్థానిక రాజకీయాలను తెరపైకి తీసుకొచ్చారు. ఆయా పొలిటికల్‌ సీన్లలో పెద్దగా సంఘర్షణ కనిపించదు.

నిరక్షరాస్యుడైన పెద్దాయన చెప్పులు అరిగేలా తిరుగుతుంటే లోలోపల న్యాయం చేయాలనున్నా పైకి మాత్రం శివ అందుకు భిన్నంగా ప్రవరిస్తాడు. సంబంధిత షాట్‌ గమనిస్తే.. తనకు ఆసక్తికర ఫ్లాష్‌బ్యాక్‌ ఉందని అర్థమవుతుంది. తల్లి సెంటిమెంట్‌ను ఎలివేట్‌ చేస్తూ శివ గతాన్ని చూపించిన తీరు మెప్పిస్తుంది. పలు సందర్భాల్లో తన తల్లికి జరిగిన అవమానం వల్లే తాను అలా ప్రవరిస్తున్నాడా?ఇంకేదైనా కారణం ఉందా? అనేదానికి సీజన్‌ 2లోనే సరైన సమాధానం దొరుకుతుందేమో. రాజకీయ నాయకుల నిర్లక్ష్యం వల్లే తన తాత చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేసినందుకు కోపోద్రిక్తుడైన ఓ వ్యక్తి బాలిక చేతిని కాలుస్తాడు. సంబంధిత ఘటన గురించి బాలిక వివరించగా శివ న్యాయం చేస్తాడనే ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ, దర్శకుడు ట్విస్ట్‌ ఇచ్చి.. మరోసారి అసలు శివ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోవాలనే ఉత్సుకత పెంచారు. సీరియస్‌ మూడ్‌లోనే తీసుకెళ్లకుండా అప్పుడప్పుడూ శివ- నీల మధ్య రొమాంటిక్‌ కోణాల్ని ఆవిష్కరించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. అయితే, మరో నాయికా పాత్రను జోడించి ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీగా చూపించే ప్రయత్నం చేశారు. పోలీసు అధికారి పాత్ర రాకతో సిరీస్‌ మరింత ఆసక్తికరంగా మారుతుంది. తన ఊరి నుంచి వేరే ఊరికి ఆ అధికారిని ట్రాన్స్‌ఫర్‌ చేయించే ప్రయత్నం చేయాలనుకున్న శివ గెలిచాడా? అప్పటి వరకు స్నేహంగా ఉన్న మీడియా మిత్రుడే నీలను ఎందుకు సమస్యల్లో చిక్కుకొనేలా చేశాడు? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పకుండా సీజన్‌ 1ని ముగించి.. సీజన్‌ 2 కోసం ఎదురుచూసేలా చేశారు (newsense web series review). 

ఎవరెలా చేశారంటే: రిపోర్టర్‌ శివ పాత్ర కోసం నవదీప్‌ పడిన శ్రమ తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న ఆ క్యారెక్టర్‌కు పూర్తి న్యాయం చేశాడు. చిత్తూరు యాసతో ఆకట్టుకుంటాడు. స్క్రీన్‌ స్పేస్‌ తక్కువే అయినా బిందు మాధవి తన నటనతో అలరిస్తుంది. ఇతరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సన్నివేశానికి తగ్గట్టు సురేశ్‌ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం బాగుంది. మదనపల్లి వాతావరణాన్ని చూపించడంలో సినిమాటోగ్రాఫర్లు మంచి మార్కులు కొట్టేశారు. పలు సీన్లను ఎడిట్‌ చేస్తే బాగుండేది. జయసింహ రాసిన ‘న్యూస్‌ రాసే వాడి చేతిలోనే చరిత్ర ఉంటుంది’లాంటి సంభాషణలు మెప్పిస్తాయి. ‘గాయం 2’, ‘కాళిచరణ్‌’ తదితర సినిమాను తెరకెక్కించిన శ్రీప్రవీణ్‌ కుమార్‌ ఈ సిరీస్‌తో తన దారి ప్రత్యేకమైందని నిరూపించారు (newsense web series review).

బలాలు

  • + నవదీప్‌ నటన  
  • + మీడియా బ్యాక్‌డ్రాప్

బలహీనతలు

  • - ప్రతి చిన్న పాత్రనూ హైలైట్‌ చేయడం
  • - స్లో స్క్రీన్‌ప్లే 

చివరిగా: ఈ ‘న్యూసెన్స్‌’ అప్పుడే పూర్తవలేదు. ఇంకా మిగిలే ఉంది!!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు