పవన్‌ చుట్టూ తెలియని శక్తేదో ఉంది: నిధి 

‘ప్రముఖ కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’ అంటోంది ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌.

Published : 31 Mar 2021 09:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పవన్‌ కల్యాణ్‌ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’ అంటోంది ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌. ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో పవన్‌ సరసన నటిస్తోంది ఈ భామ. ఈ చిత్రంలోని తన పాత్ర, పవన్‌ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిందిలా.. ‘నేను పవన్‌ కల్యాణ్‌కి పెద్ద అభిమానిని. ఆయన చిత్రాలు చూస్తూ పెరిగాను. ఎప్పటికైనా ఆయనతో కలిసి పనిచేయాలనే కల ‘హరిహర’తో నిజమైంది. పవన్‌ అద్భుతమైన నటుడు. అలాంటి నటుడితో కలిసి పని చేస్తుండటం గొప్ప అనుభూతినిస్తోంది. ఆయన చుట్టూ తెలియని ఏదో శక్తి దాగి ఉంది. అందుకే పవన్‌ సెట్‌లో అడుగుపెట్టగానే అక్కడున్న వారంతా చేస్తోన్న పనిని ఆపేసి ఆయన్నే చూస్తుంటారు. పవన్‌ గురించి చెప్పాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. ఏదైనా సన్నివేశం రిహార్సల్స్‌ చేయాల్సివస్తే అదొక బాధ్యతగా కాకుండా చాలా ఆనందంగా చేస్తుంటారు. ఈ చిత్రంలో భాగస్వామిని కావడం వల్ల ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.

ఇందులో నా పాత్ర అసాధారణమైంది. పీరియాడికల్‌ డ్రామా నేపథ్యం కావడంతో రాజసం ఉట్టిపడే వస్త్రాల్లోనే కనిపిస్తాను తప్ప మునపటిలా జీన్స్‌ల్లో కనిపించను. నా పాత్రను వెండితెరపై చూసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. గత చిత్రాల్లోని పాత్రలకు మేకప్‌ వేసేందుకు 20 నిమిషాల సమయం పడితే ఈ సినిమాలోని పాత్ర కోసం 90 నిమిషాలు పడుతోంది’ అని తెలియజేసింది. ఈ క్రేజీ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తుండగా.. ఎ.ఎం. రత్నం సమర్పిస్తున్నారు. దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌గ్లింప్స్‌ సినిమాపై అంచనాలు పెంచుతోంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని