Niharika: వరుణ్‌ తేజ్‌ - లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం.. నిహారిక ఏమన్నారంటే..?

వరుణ్‌ తేజ్‌  (Varun Tej)- లావణ్య త్రిపాఠి (Lavanya Tripati) వివాహం చేసుకోనున్నారంటూ సోమవారం సాయంత్రం నుంచి నెట్టింట ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై తాజాగా నిహారిక స్పందించారు.

Updated : 17 May 2023 16:05 IST

హైదరాబాద్‌: తన తదుపరి ప్రాజెక్ట్‌ ‘డెడ్‌ పిక్సెల్స్‌’ (Dead Pixels) ప్రమోషన్స్‌లో గత కొన్నిరోజుల నుంచి బిజీగా పాల్గొంటున్నారు నటి నిహారిక (Niharika). తాజాగా ఆమె ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో సరదాగా ముచ్చటించారు. ఇందులో భాగంగా తన సోదరుడు, నటుడు వరుణ్‌ తేజ్‌ (Varun Tej) వివాహం గురించి జరుగుతోన్న ప్రచారంపై ఆమె స్పందించారు. ‘వరుణ్‌ తేజ్‌ - లావణ్య త్రిపాఠి వివాహం చేసుకుంటున్నారని, వచ్చే నెలలో వారిద్దరికీ నిశ్చితార్థం జరగనుందని వార్తలు వస్తున్నాయి. అందులో నిజమెంత..?’ అని విలేకరి ప్రశ్నించగా.. దీనిపై స్పందించేందుకు నిహారిక అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఇప్పుడు దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు. కేవలం ‘డెడ్‌ పిక్సెల్స్‌’ గురించే చర్చించాలనుకుంటున్నా’’ అని బదులిచ్చారు. దీంతో వరుణ్ - లావణ్యల పెళ్లి వార్తలు ఎంతవరకూ నిజం? అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

ఇక, మరో ఇంటర్వ్యూలో ఆన్‌లైన్‌ నెగెటివిటీపై నిహారిక స్పందించారు. ‘‘మన చుట్టూ ఎంతోమంది మూర్ఖులు ఉంటారు. అటెన్షన్‌ కోసం మరీ మూర్ఖంగా మారుతున్నారు. అలాంటి వాళ్లను పట్టించుకోకుండా ఉండటమే మంచిది. నటిగా అడుగుపెట్టిన కొత్తలో ఓ ఫంక్షన్‌లో కాలు మీద కాలు వేసుకుని కూర్చొన్నాను. నా డ్రెస్‌ ఇబ్బందిగా ఉండటం వల్లే నేను అలా కూర్చొవాల్సి వచ్చింది. అప్పుడు నా పక్క సీట్‌లో పెద్ద వ్యక్తి ఎవరో ఉన్నారు. దాన్ని చూసి కొంతమంది నెటిజన్లు నాపై విమర్శలు చేశారు. వాళ్ల మాటలకు అప్పట్లో బాధపడ్డాను కాబట్టే ఇప్పుడు వాటిని పట్టించుకోవడం మానేశా’’ అని ఆమె వివరించారు. అనంతరం ఉపాసన గురించి మాట్లాడుతూ.. ‘‘ఆమె చాలా సింపుల్‌గా ఉంటుంది. ఏ విషయంలోనూ గొప్పలకు పోదు. ఇక, సుస్మిత అక్క పర్సనల్‌ లైఫ్‌, వర్క్‌ లైఫ్‌ను చక్కగా బ్యాలెన్స్‌ చేస్తుంది’’ అని నిహారిక బదులిచ్చారు.

‘మిస్టర్‌’, ‘అంతరిక్షం’ సినిమాల కోసం లావణ్య  - వరుణ్‌ తేజ్‌ కలిసి వర్క్‌ చేశారు. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ ఇప్పటికే పలుమార్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారంటూ సోమవారం నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది. జూన్‌లో నిశ్చితార్థం ఉండనుందని ఆయా వార్తల్లోని సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని