
Nikhil: కెరీర్‌పై ఆందోళన వ్యక్తం చేసిన హీరో నిఖిల్
గట్టి నమ్మకంగా ఉన్నా కానీ..
హైదరాబాద్: కరోనా మహమ్మారి తన కెరీర్‌పై ఎంతో ప్రభావం చూపుతోందని హీరో నిఖిల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫేక్ సర్టిఫికెట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ‘అర్జున్ సురవరం’ విజయం సాధించిన తర్వాత నిఖిల్ వరుస పెట్టి సినిమాలు పట్టాలెక్కించేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ‘కార్తికేయ-2’, ‘18 పేజీస్’తోపాటు మరో రెండు ప్రాజెక్ట్‌లకు సంతకాలు చేశారు. ‘కార్తికేయ-2’, ‘18 పేజీస్’ల చిత్రీకరణ చివరిదశలో ఉన్నాయి.
ఇదిలా ఉండగా కరోనా మూడోదశతో ఇప్పటికే సినీ పరిశ్రమలో పరిస్థితులు అగమ్యగోచరంగా మారాయి. సంక్రాంతి రేసు నుంచి పలు భారీ చిత్రాలు వెనక్కి తగ్గాయి. ఆయా చిత్రాలు రానున్న వేసవిలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మరి కొంతమంది స్టార్‌హీరోల సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో యువ హీరోల సినిమాలు సిద్ధమైనప్పటికీ ఎప్పుడు రిలీజ్ చేయాలనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలోనే నటుడు నిఖిల్ కూడా తన తదుపరి సినిమాల రిలీజ్‌లపై ఆందోళన చెందుతున్నారు.
‘‘కరోనా మహమ్మారి కెరీర్‌పై ఇంతలా ప్రభావం చూపించడం చూస్తే నాకెంతో బాధగా ఉంది. ‘అర్జున్ సురవరం’ విజయం సాధించిన తర్వాత నేను నాలుగు సినిమాలకు సంతకం చేశాను. ఆ నాలుగు కూడా ఎంతో అద్భుతమైన స్క్రిప్ట్‌లు వాటి విజయంపై నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను. కానీ, ఇప్పుడు రిలీజ్ డేట్ల విషయంలో గందరగోళం నెలకొంది. ఈ సమస్యలన్నీ త్వరితగతిన తొలగిపోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. తద్వారా మా సినిమాలను సక్రమంగా విడుదల చేసుకోవచ్చు’’ అని గురువారం ఉదయం నిఖిల్ ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.