Karthikeya 2 Review: రివ్యూ: కార్తికేయ-2

నిఖిల్‌ నటించిన ‘కార్తికేయ-2’ ఎలా ఉందంటే..?

Updated : 13 Aug 2022 13:34 IST

Karthikeya 2 Review చిత్రం: కార్తికేయ-2; నటీనటులు: నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస‌రెడ్డి, ప్రవీణ్‌, ఆదిత్యా మేన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌, తదితరులు; సంగీతం: కాలభైరవ; ఛాయాగ్రహ‌ణం: కార్తీక్ ఘట్టమనేని; క‌ళ‌: సాహి సురేష్; నిర్మాణ సంస్థ‌: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌; నిర్మాత‌లు: టి.జి.విశ్వ ప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌; క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వం: చందు మెుండేటి; విడుద‌ల తేదీ‌: 13-08-2022

ఈవారం ఆమిర్‌ఖాన్ ‘లాల్‌సింగ్ చ‌డ్డా’తో క‌లిపి వ‌రుస‌గా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వాటిలో చివ‌రిది ‘కార్తికేయ‌2’. విజ‌య‌వంత‌మైన ‘కార్తికేయ‌’కు కొన‌సాగింపు కావ‌డంతో ఆరంభం నుంచే ఈ సినిమా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. ప్రచార చిత్రాలు కూడా అందుకు దీటుగా ఉండ‌టం మ‌రింత‌గా క‌లిసొచ్చింది. ప‌లు అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా ఎలా ఉందంటే..?

క‌థేంటంటే: కార్తికేయ (నిఖిల్‌) (Nikhil) ఓ వైద్యుడు. ప్రశ్నల‌కు స‌మాధానం వెత‌క‌డం అంటే ఇష్టం. ప్రతి స‌మ‌స్యకీ ఓ స‌మాధానం ఉంటుంద‌ని, త‌న ద‌గ్గరికి రానంత‌ వ‌ర‌కే ఏదైనా స‌మ‌స్య అనీ.. వ‌స్తే మాత్రం దానికి స‌మాధానం దొర‌కాల్సిందేనని అంటాడు. అందుకోసం ఎంత‌దూర‌మైనా ప్రయాణించే వ్యక్తిత్వం అతడిది. మొక్కు తీర్చడం కోస‌మ‌ని అమ్మతో క‌లిసి ద్వార‌క వెళ‌తాడు. అనుకోకుండా అక్కడ ఓ ఆర్కియాల‌జిస్ట్ హ‌త్యకు గురికావ‌డం, దాని వెన‌క కార‌ణాల్ని వెతుకుతూ కార్తికేయ చేసే సాహ‌సోపేత‌మైన ప్రయాణ‌మే అస‌లు క‌థ‌. ముగ్ధ (అనుప‌మ ప‌ర‌మేశ్వర‌న్‌) ఎవ‌రు? కార్తికేయ ప్రయాణానికీ, శ్రీకృష్ణత‌త్వానికీ సంబంధ‌మేమిట‌నేది తెర‌పైనే చూడాలి.

ఎలా ఉందంటే: విజ‌య‌వంత‌మైన ‘కార్తికేయ’(Karthikeya)కు కొన‌సాగింపుగా రూపొందిన చిత్రమిది. అయితే క‌థానాయ‌కుడి పాత్ర, అత‌డి వ్యక్తిత్వం మిన‌హా.. తొలి భాగం క‌థ‌కీ, దీనికీ సంబంధ‌మేమీ ఉండ‌దు. ఈసారి శ్రీకృష్ణుడి చ‌రిత్ర చుట్టూ క‌థ‌ను అల్లాడు ద‌ర్శకుడు. దైవం, మాన‌వత్వం వంటి విష‌యాలను చెబుతూనే క‌థానాయ‌కుడి సాహ‌స ప్రయాణాన్ని ఆస‌క్తిక‌రంగా ఆవిష్కరించ‌డంలో చిత్రబృందం స‌ఫ‌ల‌మైంది. క‌థానాయ‌కుడు ద్వార‌క వెళ్లిన‌ప్పట్నుంచీ క‌థ‌లో వేగం పుంజుకుంటుంది. అప్పటివ‌ర‌కు భిన్న పాత్రల్ని, క‌థ‌లో పార్శ్వాల్ని పరిచ‌యం చేశాడు ద‌ర్శకుడు. హ‌త్యకు గురైన ఆర్కియాలజిస్ట్, ఆయ‌న చేసిన ప‌రిశోధ‌న‌ల ఆధారంగా సమాధానాల్ని వెతుక్కుంటూ క‌థానాయ‌కుడు వెళ్లే క్రమం ఆక‌ట్టుకుంటుంది. ఆ క్రమంలో ఎదుర‌య్యే స‌వాళ్లు, చోటు చేసుకునే అనూహ్య మ‌లుపులు ర‌క్తి క‌ట్టిస్తాయి. ద్వితీయార్ధం నుంచి క‌థ మ‌రింత బిగితో సాగుతుంది. మ‌ధుర గోవ‌ర్ధన‌గిరిలో గుహ, అక్కడ ల‌భించిన ఆధారంతో ఆ ప్రయాణం మ‌రో చోటుకి కొన‌సాగ‌డం, అభీరా తెగ‌తో క‌లిసి ప్రయాణం చేయడం, ప్రీ క్లైమాక్స్ స‌న్నివేశాలు.. ఇలా ద్వితీయార్ధం అంతా కూడా ప్రేక్షకుల్ని క‌థ‌లో లీనం చేస్తుంది. అక్కడ‌క్కడా సినిమాటిక్ స్వేచ్ఛతో క‌థ‌నాన్ని న‌డిపించినా..   వాణిజ్యాంశాల పేరుతో పాట‌లు, కామెడీ వంటి హంగుల్ని జోడించ‌కుండా తెలివిగా చివ‌రి వ‌ర‌కూ ఉత్కంఠ కొన‌సాగేలా చేశాడు ద‌ర్శకుడు. కొన‌సాగింపు చిత్రం కాబ‌ట్టి తొలి భాగానికి దీటుగా ఉండేలా.. ఆ అంచనాల‌కు త‌గ్గట్టుగా ఉండేలా విస్తృతమైన ప‌రిధి ఉన్న క‌థ‌ని ఎంచుకోవ‌డం క‌లిసొచ్చింది. క‌థా నేప‌థ్యం, దానికి త‌గ్గ సాంకేతిక హంగులు కూడా చ‌క్కగా జోడించడం వల్ల క‌థ ఓ కొత్తద‌నాన్ని పంచుతుంది. ప‌తాక స‌న్నివేశాలు మ‌రో క‌థకి ఆరంభాన్ని సూచిస్తాయి.

ఎవ‌రెలా చేశారంటే: నిఖిల్ తొలి సినిమాలో మెడికోగా ఎంత గాఢ‌త‌ కలిగిన పాత్రలో ఒదిగిపోయాడో.. ఈ సినిమాలోనూ అంతే. వైద్యుడిగా.. ప్రశ్న చుట్టూ ప్రయాణం చేసే వ్యక్తిగా.. ఈ క‌థ‌ని త‌న భుజాల‌పైనే మోశాడు. అనుప‌మ ప‌ర‌మేశ్వర‌న్‌, అనుప‌మ్ ఖేర్‌, ఆదిత్య మేన‌న్ త‌దిత‌రుల పాత్రలు కూడా ప్రభావం చూపిస్తాయి. శ్రీనివాస్‌రెడ్డి, వైవా హ‌ర్ష అక్కడ‌క్కడా న‌వ్వించారు. తుల‌సి, ప్రవీణ్‌, స‌త్య చిన్న పాత్రల్లో క‌నిపిస్తారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. కార్తీక్ ఘట్టమ‌నేని కెమెరా ప‌నిత‌నం, కాల‌భైర‌వ సంగీతం చిత్రానికి ప్రాణం పోశాయి. క‌ళా విభాగం కూడా చ‌క్కటి ప‌నితీరుని క‌న‌బ‌రిచింది. ద‌ర్శకుడు చందు మొండేటికి ‘కార్తికేయ’ తొలి సినిమా. దాన్ని ఎంత శ్రద్ధగా, ప్రేమ‌తో తీశారో ఈ సినిమాపై కూడా అంతే జాగ్రత్తలు తీసుకున్నట్టు స్పష్టమ‌వుతుంది. నిర్మాణం బాగుంది.

బ‌లాలు
+ క‌థా నేప‌థ్యం
+ క‌థ‌నం
+ నిఖిల్ న‌ట‌న

బ‌ల‌హీన‌త‌లు
- ఆరంభంలో కొన్ని స‌న్నివేశాలు
- సినిమాటిక్‌గా అనిపించే కొన్ని భాగాలు

చివ‌రిగా: కార్తికేయ 2.. అలరించే మ‌రో కొత్త ప్రయాణం

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని