Karthikeya 2: సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాలంటే భయమేసేది: నిఖిల్‌

తాను గతంలో నటించిన ‘కార్తికేయ’ సీక్వెల్‌ గురించి అభిమానులంతా కామెంట్ల రూపంలో అడిగేవారిని, అందుకే సోషల్‌ మీడియా ఏ పోస్ట్‌ పెట్టాలన్నా భయమేసిందని నిఖిల్‌ అన్నారు. ఆ సీక్వెల్‌ సినిమా (కార్తికేయ 2) ట్రైలర్‌ విడుదల వేడుకలో ఆయన మాట్లాడారు.

Published : 25 Jun 2022 01:33 IST

హైదరాబాద్‌: తాను గతంలో నటించిన ‘కార్తికేయ’ సీక్వెల్‌ గురించి అభిమానులంతా కామెంట్ల రూపంలో తరచూ అడిగే వారిని, అందుకే సోషల్‌ మీడియాలో ఏ పోస్ట్‌ పెట్టాలన్నా భయమేసేదని నిఖిల్‌ (Nikhil Siddharth) అన్నారు. కార్తికేయ 2 (Karthikeya) ట్రైలర్‌ విడుదల వేడుకలో ఆయన మాట్లాడారు. తొలి భాగం తెరకెక్కించిన చందూ మొండేటినే ఈ సినిమాకీ దర్శకత్వం వహించారు. అనుపమ కథానాయికగా నటించిన ఈ సినిమా జులై 22న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం నగరంలోని ఏఎంబీ సినిమాస్‌ స్క్రీన్‌- 3లో ట్రైలర్‌ ఆవిష్కరణతోపాటు ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసింది. దర్శకనిర్మాతలు, అనుపమ, శ్రీనివాస్‌ రెడ్డి, వైవా హర్ష పాల్గొన్నారు.

వేడుకనుద్దేశించి నిఖిల్‌ మాట్లాడుతూ.. ‘‘గత మూడేళ్ల నుంచి సోషల్‌ మీడియాలో నేను పోస్ట్‌ పెట్టినా చాలామంది ‘కార్తికేయ’ సీక్వెల్‌ గురించే అడిగేవారు. దాంతో ఫొటోలు, వీడియోలు షేర్‌ చేయాలంటే మళ్లీ అదే ప్రశ్న అడుగుతారేమోనని నాకు భయమేసేది. అలా వచ్చిన కామెంట్లన్నీ దర్శకుడు చందూకి పంపించేవాడ్ని. అలా ఆయన మంచి కథ రాశారు. నిర్మాతలు అభిషేక్‌ అగర్వాల్‌, టీజీ విశ్వప్రసాద్‌ ముందుకు తీసుకెళ్లారు. వివేక్‌ కూచిభొట్ల ఈ చిత్రానికి వెన్నెముకలా నిలిచారు. మూడేళ్ల నుంచి మేం ఎంత కష్టపడ్డామో ఇప్పుడు మీరు చూశారు (ట్రైలర్‌). ఇది మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా’’ అని నిఖిల్‌ పేర్కొన్నారు. అనంతరం, విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

* ‘కార్తికేయ’ను తెరకెక్కించే సమయంలోనే సీక్వెల్‌ చేయాలనుకున్నారా?

చందూ: ముందుగా అనుకోలేదండీ. ఆ సినిమా విడుదలైన రెండేళ్లకు ద్వారకా గురించి చదవడం ప్రారంభించా. ఈ కాన్సెప్ట్‌ను తెరకెక్కిస్తే బాగుంటుందని నిఖిల్‌కు నా అభిప్రాయం చెప్పా. తను ఓకే అన్నాడు. మా నిర్మాతలు, నటుల వల్ల చిత్రీకరణ సాఫీగా సాగింది.

* ఈ సీక్వెల్‌లో నటించాలనుకున్నప్పుడు మీ ఫీలింగ్‌ ఏంటి?

నిఖిల్‌: ఒక్కో నటుడికి ఒక్కో పాత్ర తమ కెరీర్‌లో ది బెస్ట్‌గా నిలుస్తుంటుంది. అలానే నాకు ఈ ‘కార్తికేయ’. అలాంటి సినిమా కొనసాగింపులో నటించాల్సి వస్తే అంతకు మించిన ఆనందం ఏముంటుంది.

* ‘కార్తికేయ’ హీరోయిన్‌ స్వాతి ‘కార్తికేయ 2’లో కనిపిస్తారా?

నిఖిల్‌: అది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

* మిమ్మల్ని ఈ సినిమాలో నటించేలా చేసిన అంశమేంటి?

అనుపమ: చందూ దర్శకత్వంలో గతంలో నేను ‘ప్రేమమ్‌’ చిత్రంలో నటించా. తన ప్రతిభ ఎలాంటిదో నాకు తెలుసు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ అందరికీ ఈ కథ కనెక్ట్‌ అవుతుంది. నేను నటించినందుకు కారణం స్టోరీనే.

* ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనే ఆలోచన ఎప్పటిది?

విశ్వప్రసాద్‌: కథ విన్నప్పుడే ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించాలనుకున్నాం. అనుకున్నట్టుగానే తెరకెక్కించాం.

నిఖిల్‌: పాన్‌ ఇండియా అనడంకంటే ఇది మల్టీ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌ అంటే బావుంటుందేమో. భారతీయులంతా గర్వించే సినిమా తీయాలనుకున్నాం. ఇందులో హీరో నేను కాదు కృష్ణ భగవానుడు.

* ట్రైలర్‌లో విభిన్న నేపథ్యాల సన్నివేశాలు కనిపించాయి. అసలు ఈ సినిమా ఏ జానర్‌లో ఉంటుంది?

చందూ: ఇదొక వినోదాత్మకమైన అడ్వెంచర్‌ కథ.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని