Macherla Niyojakavargam Review: రివ్యూ: మాచర్ల నియోజకవర్గం

నితిన్‌ నటించిన ‘మాచర్ల నియోజక వర్గం’ ఎలా ఉందంటే

Updated : 07 Dec 2022 20:56 IST

Macherla Niyojakavargam Review చిత్రం: మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం; న‌టీన‌టులు: నితిన్‌, కృతి శెట్టి, కేథ‌రిన్‌, స‌ముద్ర ఖ‌ని, శుభ‌లేఖ సుధాక‌ర్‌, వెన్నెల కిషోర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, రాజేంద్ర ప్రసాద్‌, బ్రహ్మాజీ, ఇంద్రజ, శ్యామ‌ల త‌దిత‌రులు; సంగీతం: మ‌హ‌తి స్వర సాగ‌ర్‌; మాట‌లు: మామిడాల తిరుప‌తి; ఛాయాగ్రహ‌ణం: ప్రసాద్ మూరెళ్ల; ద‌ర్శక‌త్వం: ఎం.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి; నిర్మాత‌లు: సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి; విడుద‌ల తేదీ: 12-08-2022

గ‌తవారం విడుద‌లైన ‘బింబిసార’‌, ‘సీతారామం’ చిత్రాలు తెలుగు చిత్రసీమ‌కు నూత‌నోత్తేజాన్ని అందించాయి. వ‌రుస ప‌రాజ‌యాల‌కు చెక్ పెడుతూ.. ప్రేక్షకుల్ని థియేట‌ర్లకు క్యూ క‌ట్టేలా చేశాయి. ఇప్పుడీ విజ‌యోత్సాహంలోనే స్వాతంత్ర్య దినోత్సవ సంబ‌రాల‌కు సిద్ధమైంది చిత్ర ప‌రిశ్రమ‌. ఇందులో భాగంగా ఈవారం వినోదాలు పంచేందుకు తొలుత ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు క‌థానాయ‌కుడు నితిన్‌. చాలా కాలం త‌ర్వాత ఆయ‌న నుంచి వచ్చిన పూర్తి స్థాయి మాస్ చిత్రమిది. కొత్త ద‌ర్శకుడు ఎం.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి తెర‌కెక్కించారు. అదిరిపోయే ఫైట్స్‌, చ‌క్కటి మాస్ ఎలిమెంట్స్‌తో ప్రచార చిత్రాలు ఆస‌క్తిక‌రంగా ఉండ‌టంతో సినిమాపై అంచ‌నాలు ఏర్పడ్డాయి. మ‌రి ఈ సినిమా క‌థేంటి?  నితిన్ యాక్షన్ హంగామా ప్రేక్షకుల్ని ఏ మేర మెప్పించింది?

క‌థేంటంటే: గుంటూరు జిల్లా.. ఆ జిల్లాలోని మాచ‌ర్ల నియోజ‌క‌వర్గానికి ఓ నెత్తుటి చ‌రిత్ర ఉంది. అది రాజ‌ప్ప (స‌ముద్ర ఖ‌ని) లిఖించిన నెత్తుటి చ‌రిత్ర‌. మాచ‌ర్లలో 30 ఏళ్లుగా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నీయ‌కుండా చూస్తూ.. ఏక‌గ్రీవ ఎమ్మెల్యేగా ఎన్నిక‌వుతూ ఆ ప్రాంతాన్ని, అక్కడ ప్రజ‌ల్ని త‌న గుప్పిట్లో పెట్టుకుని రాక్షస పాల‌న కొన‌సాగిస్తుంటాడు. ఒకవేళ ఏ ప్రభుత్వ అధికారైనా అతడికి ఎదురెళ్లి ఆ నియోజ‌క‌వర్గంలో ఎన్నికలు నిర్వహించాల‌ని ప్రయ‌త్నిస్తే ఆ అధికారిని, పోటీగా నిల్చొన్న అభ్యర్థిని మ‌ట్టు పెట్టేదాక వ‌దిలిపెట్టడు రాజ‌ప్ప‌. అందుకే ఆయ‌న‌కు భ‌య‌ప‌డి ఇటు ప్రభుత్వం, అటు ప్రజ‌లు ఎన్నికల గురించి ఆలోచించ‌డ‌మే మానేస్తారు. అలాంటి రాక్షస రాజ్యంలోకి సిద్ధార్థ్ రెడ్డి (నితిన్) క‌లెక్టర్‌గా ఎంట్రీ ఇస్తాడు. వాస్తవానికి అత‌డు గుంటూరు జిల్లా క‌లెక్టర్‌గా పోస్టింగ్ అందుకోవ‌డానికి ముందే ప్రేమించిన అమ్మాయి స్వాతి (కృతి శెట్టి) కోసం రాజ‌ప్ప కొడుకు వీర (స‌ముద్రఖ‌ని)తో త‌ల‌ప‌డ‌తాడు. ఇక క‌లెక్టర్‌గా ఛార్జ్ తీసుకున్నాక, మాచ‌ర్లలో ఎన్నికలు జ‌రిపించ‌డమే ల‌క్ష్యంగా పెట్టుకుంటాడు. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది?  సిద్ధార్థ్ రెడ్డి ల‌క్ష్యానికి రాజ‌ప్ప నుంచి ఎలాంటి స‌వాళ్లెదుర‌య్యాయి? అతడికి స్వాతి కుటుంబానికి ఉన్న విరోధం ఏంటి? రాజ‌ప్పకు పోటీగా నిల‌బ‌డ్డ రాఘ‌వ‌య్య (శుభ‌లేఖ సుధాక‌ర్‌) క‌థేంటి? రాజ‌ప్ప వ‌ల్ల అత‌డి కుటుంబానికి జ‌రిగిన అన్యాయం ఏంటి? ఈ క‌థ‌లో కేథ‌రిన్‌, ముర‌ళీ శ‌ర్మ‌, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్‌ల పాత్రలేంటి? అన్నది తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే: ఓ చిన్న క‌థ‌.. రెండు పాటలు.. నాలుగు ఫైట్లు.. ఓ ఐటెం సాంగ్‌.. ఇలా కొన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగులు అద్దేసి ఓ బొమ్మను ప్రేక్షకులపైకి వ‌దిలేస్తే చూసే రోజులు కావివి. ఈ త‌ర‌హా పాత చింత‌కాయ ప‌చ్చడి క‌థ‌ల‌కు ఎప్పుడో కాలం చెల్లిపోయింది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప్రేక్షకుల్ని రెండున్నర గంట‌లు థియేట‌ర్లలో కూర్చోబెట్టాలంటే క‌థ‌లో ఎంతో బ‌లం ఉంటే త‌ప్ప సాధ్యమ‌య్యే ప‌రిస్థితులు లేవు. ఇలాంటి వాతావ‌ర‌ణంలోనూ అడ‌పాద‌డ‌పా కొంద‌రు హీరోలు రొటీన్ మాస్ క‌థ‌లతో ప్రయోగాలు చేసి బాక్సాఫీస్ ముందు చ‌తిక‌ల ప‌డుతున్నారు. మాచ‌ర్ల కూడా ఈ త‌ర‌హా ప్రయ‌త్నమే. 30 ఏళ్లుగా ఎన్నిక‌లు జ‌ర‌గ‌ని ఓ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ్యాంగ‌బద్ధంగా ఎన్నిక‌లు నిర్వహించేందుకు ఒక యువ క‌లెక్టర్ ఏం చేశాడు? ఈ క్రమంలో అత‌డికి ఎదురైన స‌వాళ్లేంటి? అన్నది క్లుప్తంగా ఈ చిత్ర క‌థ‌. దీనికి ఓ రొటీన్ ల‌వ్ ట్రాక్‌.. కొన్ని ఫ్యామిలీ ఎమోష‌న్స్ జోడించి ఎలాంటి మ‌లుపులు లేకుండా చాలా సాదాసీదాగా న‌డిపించేశాడు ద‌ర్శకుడు. నితిన్ ప‌రిచ‌య స‌న్నివేశాల్ని చూసిన‌ప్పుడే సినిమా ఎలా ఉండ‌బోతుంద‌నేది ప్రేక్షకులు ఓ అంచ‌నాకు వ‌చ్చేస్తారు. త‌న‌ గ‌ర్ల్ ఫ్రెండ్‌ను టీజ్ చేశార‌ని హీరో రౌడీ గ్యాంగ్‌ను చిత‌క్కొట్టడం, ఆ వెంట‌నే ఓ పాట‌తో సినిమా చాలా చ‌ప్పగా మొద‌ల‌వుతుంది. సిద్ధార్థ్‌ తొలి చూపులోనే స్వాతిని ఇష్టప‌డ‌టం.. ప్రేమ పేరుతో ఆమె చుట్టూ తిర‌గ‌డం.. ఆమె కోసం విల‌న్లతో చేసే రొటీన్ ఫైట్లతో ప్రథమార్ధమంతా భారంగా న‌డుస్తుంది. మ‌ధ్యలో ఇగో గురునాథంగా వెన్నెల కిషోర్ చేసే అల్లరి కొన్నిసార్లు న‌వ్వులు పూయిస్తే.. ఇంకొన్ని సార్లు విసుగు పుట్టిస్తుంది. దీనికి తోడు కేథ‌రిన్ పాత్ర క‌థ‌కు స్పీడ్ బ్రేక‌ర్‌లా అడ్డు త‌గులుతుంటుంది. విరామానికి ముందు స్వాతి కోసం సిద్ధు మాచ‌ర్లలో అడుగుపెట్టడం.. ఆమెను కాపాడే క్రమంలో రాజ‌ప్ప కొడుకుతో త‌ల‌ప‌డ‌టం.. అదే స‌మ‌యంలో గుంటూరు జిల్లాకు త‌న‌ని క‌లెక్టర్‌గా అపాయింట్ చేసిన‌ట్లు తెలియ‌జేయ‌డంతో క‌థ‌కు ఒక్కసారిగా ఊపొస్తుంది.

ద్వితీయార్ధంలో క‌థంతా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల చుట్టూనే తిరుగుతుంది. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక జ‌రిపించేందుకు సిద్ధార్థ్ చేసే ప్రయ‌త్నాలు.. దాన్ని అడ్డుకునేందుకు రాజ‌ప్ప వేసే ఎత్తుగ‌డ‌లు..  ఈ క్రమంలో వ‌చ్చే వ‌రుస ఫైట్లు.. మ‌ధ్య మ‌ధ్యలో వ‌చ్చిపోయే పాట‌లతో సినిమా అలా అలా సాగిపోతున్నట్లుగా ఉంటుంది. ఒక‌ర‌కంగా ద్వితీయార్ధంలో క‌థ కంటే యాక్షన్ హంగామానే ఎక్కువ క‌నిపిస్తుంది. సిద్ధార్థ్, రాజ‌ప్ప ఇంటికి వెళ్లి అత‌డి గ్యాంగ్‌కు వార్నింగ్ ఇచ్చే స‌న్నివేశంలో ‘విక్రమ్’ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్‌ను వాడుకోవ‌డం బాగుంది. జాత‌ర నేప‌థ్యంలో వ‌చ్చే ‘రా రా రెడ్డి పాట’‌, ఆ త‌ర్వాత వ‌చ్చే ఫైట్ సీక్వెన్స్ ప్రేక్షకుల్లో కాస్త ఊపు తీసుకొస్తాయి. క్లైమాక్స్ తీర్చిదిద్దిన విధానం పర్వాలేద‌నిపిస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: క‌లెక్టర్ సిద్ధార్థ్ రెడ్డి పాత్రలో నితిన్ చ‌క్కగా ఒదిగిపోయారు. కాస్త క్లాస్ ట‌చ్ ఇస్తూనే.. మాస్ అవ‌తారంలో ఆయ‌న పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ప్రీరిలీజ్ ఫంక్షన్లో చెప్పిన‌ట్లుగానే సినిమాలో ఆయ‌న చేసిన ఫైట్లు ప్రత్యేక ఆక‌ర్షణ‌గా నిలిచాయి. అయితే ద్వితీయార్ధంలో ఫైట్లే క‌థ‌ని పూర్తిగా డామినేట్ చేసేశాయి. కేథ‌రిన్‌, కృతి శెట్టి పాత్రల‌కు క‌థ‌లో స‌రైన ప్రాధాన్యం లేదు. అస‌లు కేథ‌రిన్ పాత్ర అన‌వ‌స‌రం అనిపిస్తుంది. సినిమాలో రాజ‌ప్పగా.. వీర‌గా స‌ముద్ర ఖ‌ని ద్విపాత్రాభిన‌యం చేశారు.  ముఖ్యంగా రాజ‌ప్ప పాత్రలో ఆయ‌న పండించిన విల‌నిజం చ‌క్కగా ఉంది. ద‌ర్శకుడు మ‌రీ రొటీన్ క‌థ ఎంచుకొని దాన్ని అంతే రొటీన్‌గా తీసి ప్రేక్షకుల స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టాడు. మ‌హ‌తి స్వర సాగ‌ర్ అందించిన నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. రెండు పాట‌లు మిన‌హా మిగ‌తావి గుర్తుంచుకునేలా లేవు. ముర‌ళీ శ‌ర్మ‌, రాజేంద్ర ప్రసాద్‌, ఇంద్రజ‌, శుభ‌లేఖ సుధాక‌ర్ పాత్రలు ప‌రిధి మేర‌కు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క పాత్రకు స‌రైన ముగింపు లేదు. ప్రసాద్ మూరెళ్ల ఛాయాగ్రహ‌ణం బాగుంది. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి.

బ‌లాలు:
+ నితిన్ న‌ట‌న‌
+ స‌ముద్రఖ‌ని విల‌నిజం
పోరాట ఘ‌ట్టాలు

బ‌ల‌హీన‌త‌లు:
-
రొటీన్ క‌థ‌
ఊహ‌ల‌కు త‌గ్గట్లుగా సాగే క‌థ‌నం

చివ‌రిగా: రొటీన్ క‌థ‌.. రొటీన్ ట్రీట్‌మెంట్‌.. ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని