Nithya Menen: ‘నిత్యామేనన్‌కు తమిళ హీరో వేధింపులు’ స్పందించిన నటి!

Nithya Menen: తమిళ హీరో వేధించాడంటూ నిత్యామేనన్‌ అన్న మాటలు సామాజిక మధ్యమాల్లో వైరల్‌ అవుతుండటంతో ఆమె స్పందించారు.

Published : 26 Sep 2023 19:56 IST

హైదరాబాద్‌: తెలుగు, మలయాళ, తమిళ చిత్ర పరిశ్రమల్లో నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది నిత్యామేనన్‌ (Nithya Menen). సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించడమే కాకుండా, ప్రాధాన్యమున్న పాత్రలను మాత్రమే ఆమె చేస్తుంది. త్వరలో ‘కుమారి శ్రీమతి’ (Kumari Srimathi) వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతోంది. ఓ ఇంటర్వ్యూలో నిత్యా మేనన్‌ మాట్లాడుతూ.. ‘షూటింగ్‌ సమయంలో ఒక తమిళ్‌ హీరో తెగ వేధించాడు. తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా’ అని చెప్పినట్లు ఓ ట్వీట్ ట్రెండ్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు అందరూ ‘ఎవరా తమిళ హీరో’ అంటూ తెగ వెతకడం మొదలు పెట్టేశారు.

ఇదే విషయమై ఓ విలేకరి నిత్యామేనన్‌ను సంప్రదించగా, సదరు వార్తలను ఆమె ఖండించారు. తానెప్పుడూ అలా అనలేదని అన్నారు. ‘ఓ మై గుడ్‌నెస్‌’ అంటూ సమాధానం ఇచ్చారు. ‘మీరు చెప్పిన సమాధానంతో ట్వీట్‌ చేయవచ్చా’ అనగా, ఆమె అందుకు సమ్మతించారు.

షారుక్‌ ‘డంకీ’కి పోటీగా ప్రభాస్‌ ‘సలార్‌’.. మీమ్స్‌ మామూలుగా లేవు!

ఇక నిత్యామేనన్‌ తాజా చిత్రాల విషయానికొస్తే ఆమె కీలక పాత్రలో గోమఠేష్‌ ఉపాధ్యాయ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌ వెబ్‌సిరీస్‌ ‘కుమారి శ్రీమతి’ (Kumari Srimathi). గౌతమి, తిరువీర్‌, నిరుపమ్‌, తాళ్లూరి రామేశ్వరి, ప్రణీత పట్నాయక్‌, ప్రేమ్‌ సాగర్‌, నరేష్‌, మురళీమోహన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా సెప్టెంబరు 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. దీంతో పాటు ‘కోలాంబి’ అనే మలయాళ చిత్రంతో పాటు, ధనుష్‌ 50వ చిత్రంలోనూ నిత్యామేనన్‌ నటిస్తోంది. మరోవైపు డిస్నీ హాట్‌స్టార్‌ వేదికగా ‘మాస్టర్‌ పీస్‌’ అనే వెబ్‌సిరీస్‌లోనూ కీలక పాత్ర పోషిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని