Anushka Sharma: పన్ను వివాదంలో లభించని ఊరట.. అనుష్క శర్మ పిటిషన్‌ కొట్టివేత

స్టేజ్‌ షో వీడియోల కాపీరైట్‌తో అనుష్క శర్మ (Anushka Sharma) ఆదాయం పొందుతున్నారని, దానికి ఆమె సేల్స్‌ ట్యాక్స్‌ చెల్లించాలని నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులపై ఆమె బాంబే హైకోర్టుకు వెళ్లగా.. అక్కడ నటికి నిరాశే ఎదురైంది.

Published : 30 Mar 2023 16:29 IST

ముంబయి: విక్రయ పన్ను వివాదంలో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ సతీమణి, ప్రముఖ నటి అనుష్క శర్మ (Anushka Sharma)కు బాంబే హైకోర్టులో ఊరట లభించలేదు. ఈ వ్యవహారంలో ఆమె వేసిన పిటిషన్లను బాంబే హైకోర్టు కొట్టివేసింది. పన్ను నోటీసులపై అప్పీల్‌ చేసుకునేందుకు తనకు ప్రత్యామ్నాయ అవకాశం ఉందని, దాన్ని వినియోగించుకోవాలని న్యాయస్థానం సూచించింది. (Anushka Sharma Tax Issue)

అసలేంటీ వివాదం..

2012-16 మధ్య ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన బకాయి పడిన అమ్మకపు పన్ను చెల్లించాలంటూ సేల్స్‌ ట్యాక్స్‌ (Sales Tax) డిప్యటీ కమిషనర్‌ పంపిన నోటీసులను సవాల్‌ చేస్తూ అనుష్క శర్మ (Anushka Sharma) బాంబే హైకోర్టును ఆశ్రయించారు. వివిధ సందర్భాల్లో నిర్మాతలు, ఈవెంట్‌ ఆర్గనైజర్లతో చేసుకున్న ఒప్పందం మేరకు కొన్ని అవార్డు కార్యక్రమాల్లోనూ ప్రదర్శనలను ఇస్తానని, అలాగని నిర్మాతలకు విధిస్తున్న శ్లాబులో పన్ను చెల్లించాలంటే ఎలాగని ఆమె ప్రశ్నించారు. వివిధ కార్యక్రమాల్లో నటించినంత మాత్రాన ఆ వీడియోల కాపీరైట్స్‌ తనకు రావని, కాపీరైట్స్‌ అన్నీ నిర్మాతకే ఉంటాయని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. సినిమాల్లో గానీ, ఇతర కార్యక్రమాల్లో గానీ ఎవరైనా నటిస్తే వాళ్లు నటులు మాత్రమే అవుతారని, నిర్మాతలు కాబోరని ఆమె తెలిపారు. నటులకు వర్తించే శ్లాబులోనే పన్ను వేయాలని ఆమె పిటిషన్‌లో కోరారు.

అయితే నటి వివరణను సేల్స్‌ ట్యాక్స్ (Sales Tax) విభాగం ఖండించింది. తన వీడియోల కాపీరైట్స్‌కు అనుష్క (Anushka Sharma)నే తొలి యజమాని అని, నిర్మాతలు, ఈవెంట్‌ ఆర్గనైజర్ల నుంచి కొంత మొత్తం తీసుకుని ఆ కాపీరైట్‌ను ఆమె వారికి బదిలీ చేశారని తెలిపింది. చట్ట ప్రకారం ఇది విక్రయం కిందకే వస్తున్నందున..  పన్నులు చెల్లించాల్సిన బాధ్యత ఆమెదేనని పేర్కొంటూ బుధవారం కోర్టుకు అఫిడవిట్‌ సమర్పించింది.

కోర్టు ఏం చెప్పిందంటే..

ఈ పిటిషన్లపై బాంబే హైకోర్టు (Bombay High Court) గురువారం విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలను సమీక్షించిన అనంతరం.. అనుష్క పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు డివిజన్‌ బెంచ్‌ ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘మహారాష్ట్ర వ్యాల్యూ యాడెట్‌ టాక్స్‌ (MVAT) చట్టం ప్రకారం.. పిటిషనర్‌(అనుష్క శర్మ)కు అందిన నోటీసులపై అప్పీల్‌ చేసుకునేందుకు ఆమె ప్రత్యామ్నాయ అవకాశముంది. అలాంటప్పుడు ఈ పిటిషన్లను మేం విచారించాల్సిన అవసరమేంటీ? నాలుగు వారాల్లోగా ఆమె డిప్యూట్‌ కమిషనర్‌ ఆఫ్‌ సేల్స్‌ ట్యాక్స్‌ (అప్పీల్స్‌) ముందు అప్పీల్‌ చేసుకోవాలి. పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలన్నింటిపై అప్పీలేట్‌ అథారిటీ సమగ్ర దర్యాప్తు జరిపి పరిష్కరిస్తుంది. ఇప్పుడు ఈ పిటిషన్లను మేం విచారిస్తే.. MVAT చట్టం కింద ఉన్న అన్ని సమస్యలు ఇక్కడకే వస్తాయి’’ అని కోర్టు తెలిపింది. MVAT చట్టం ప్రకారం.. ఒక వ్యక్తి తన నోటీసులపై అప్పీల్‌ చేయాలనుకుంటే.. సేల్స్‌ ట్యాక్స్‌ విభాగం విధించిన పన్ను మొత్తంలో 10శాతం డబ్బును డిపార్ట్‌మెంట్‌కు జమ చేయాల్సి ఉంటుంది.

2012-13, 2013-14, 2014-15, 2015-16 మదింపు సంవత్సరాలకు గానూ బకాయి ఉన్న పన్ను చెల్లించాలని సేల్స్‌ ట్యాక్స్ విభాగం నుంచి నటికి (Anushka Sharma) నోటీసులు అందాయి. 2012-13 మదింపు సంవత్సరానికి రూ.1.2కోట్లు, 2013-14 సంవత్సరానికి గానూ రూ. 1.6కోట్లు చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మిగతా రెండు సంవత్సరాలకు ఎంత బకాయి పడ్డారన్నది స్పష్టత లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని