Nomads ఉన్నట్లు ప్రపంచానికే తెలీదు: పూరి

మనిషి సంచార జీవితం గడుపుతూ ఉంటే ఏ గొడవా ఉండేది కాదని.. వాళ్లు భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచించరని.. వాళ్ల సమస్యలు ఎవరికీ చెప్పుకోరని డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ అన్నారు. పూరి మ్యూజింగ్స్‌లో భాగంగా ఆయన ‘నొమాడిక్‌’(సంచార జీవనం)పై తన విశ్లేషణ ఇచ్చారు.

Updated : 12 Mar 2024 16:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనిషి సంచార జీవితం గడుపుతూ ఉంటే ఏ గొడవా ఉండేది కాదని.. వాళ్లు భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచించరని.. వాళ్ల సమస్యలు ఎవరికీ చెప్పుకోరని డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ అన్నారు. పూరి మ్యూజింగ్స్‌లో భాగంగా ఆయన ‘నొమాడిక్‌’(సంచార జీవనం)పై తన విశ్లేషణ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు ఆయన పంచుకున్నారు. అవేంటో ఆయన మాటల్లోనే చదివేయండి..

‘‘నొమాడిక్‌.. అంటే సంచార జీవనం. సంచార జీవనానికి నిర్ణీత నమూనా అంటూ ఉండదు. అది ఒక జీవన విధానం. రష్యా, మంగోలియా వంటి దేశాల్లో ఎంతోమంది సంచార జీవనం సాగించేవారు ఇంకా ఉన్నారు. వేటాడుకుంటూ వలసపోతూ ఉంటారు. కుక్కలు, గొర్రెలు, గాడిదలు, గుర్రాలు, ఒంటెలు, ఆవులు పెంచుకుంటారు. జంతువుల చర్మంతో బట్టలు తయారు చేసుకుంటారు. నొమాడ్స్‌ అంటే.. ఏదో జాతిప్రజల గురించి అనుకోవద్దు. నేను చెప్పేది మన గురించే. మనందరం అలా వచ్చినవాళ్లమే. ఆ జాతికి చెందినవాళ్లమే.. పదివేల సంవత్సరాల క్రితం వరకూ 99శాతం ప్రజలు ఇలాంటివారే. ఇప్పటికీ వలస జీవితాలు బతుకుతున్నవారున్నారు. వాళ్లకు భవిష్యత్తు గురించి ఆలోచన లేదు. ఇప్పటి కోసం.. ఈ రోజు గురించి మాత్రమే బతుకుతారు. మనుషులు ఈ సంచార జీవితం గడిపినన్ని రోజులు బాగే ఉండేది. ఆ విధానం ఆగిన తర్వాత కష్టాలు మొదలయ్యాయి. ప్రాంతాలు.. దేశాలు.. సరిహద్దులు.. ఖండాలు.. జాతులు.. యుద్ధాలు.. కథలు.. చరిత్రలు.. ఇతిహాసాలు.. పక్షులు జంతువుల్లా మనుషులు కూడా ఇప్పటికీ సంచార జీవనం గడుపుతూ ఉండి ఉంటే ఏ గొడవ ఉండేది కాదు.’’ అని పూరి అన్నారు.

‘‘పట్టణాల్లో పుట్టి, చదువుకొని సంచార జీవనం గడిపేవాళ్లూ ఉన్నారు. వాళ్లను ‘డిజిటల్‌ నొమాడ్స్‌’ అంటారు. వాళ్లు ఒకచోట ఉండరు. వాళ్లకు ప్రత్యేకంగా ఇల్లు ఉండదు. ప్రపంచమంతా తిరుగుతూ ఉంటారు. బతకడం కోసం ఆన్‌లైన్‌లో ఉద్యోగం చేస్తారు. బ్లాగ్స్‌ రాస్తారు.. ట్రావెల్‌ వీడియోలు చేస్తారు.. పుస్తకాలు అమ్ముతారు. ఆర్టికల్స్‌ రాస్తారు. అందులో కొంతమంది ఫొటోగ్రాఫర్లు కూడా ఉంటారు. ఇలా ఎన్నోరకాల పనులు చేస్తూ సంచార జీవితం గడుపుతున్నవారెంతో మంది ఉన్నారు. ఇండియాలోనూ సంచార జీవనం గడుపుతున్నవారున్నారు. ప్రపంచంలో ఇలాంటివి 300 జాతులున్నాయి. నొమాడ్స్‌లా బతుకుతున్న ఇన్ని కోట్లమంది ఎప్పుడైనా ఎక్కడైనా గొడవ చేశారా..? ధర్నా చేశారా..? యుద్ధం చేశారా..? వాళ్ల కష్టాలు ఎప్పుడైనా ఎవరికైనా చెప్పారా..? సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారా..? లేదు. అసలు వాళ్లు ఉన్నారో లేదో కూడా మనకు తెలియదు. వాళ్లే అసలైన మనుషులు. తెల్లవారిన దగ్గర్నుంచి మనలాగా జీవితం గురించి వాళ్లు ఎప్పుడూ ఫిర్యాదు చేయరు. ఇల్లు లేని వాళ్లు ఎప్పుడైన మంచివాడు. సొంత ఇల్లు కట్టుకున్నవాళ్లు.. కట్టుకోవాలని అనుకునేవాళ్లు.. అప్పటికే పది ఇళ్లు కట్టుకున్నవాళ్లే.. ప్రపంచంలో ఉండే సమస్యలన్నింటికీ కారణం’’ అని పూరి ముగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని