Liger: పూరీ ఆలోచనల్లో అనన్య లేదు.. ‘లైగర్‌’ భామ ఆమె కాదు..!

‘లైగర్‌’ (Liger).. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరి నోటా వినిపిస్తోన్న పేరు. విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) - పూరీ జగన్నాథ్‌.....

Updated : 18 Aug 2022 09:56 IST

క్రేజీ ప్రాజెక్ట్‌ వదులుకున్న బీటౌన్‌ స్టార్‌

హైదరాబాద్‌: ‘లైగర్‌’ (Liger).. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరి నోటా వినిపిస్తోన్న పేరు. విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) - పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) కాంబినేషన్‌లో పక్కా మాస్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకొని పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌తో బాలీవుడ్‌ భామ అనన్యా పాండే (Ananya Pandey) దక్షిణాది వారికి పరిచయం కానున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో ఆమెను చూసి యువత మనసు పారేసుకొంటున్నారు. అయితే, ‘లైగర్‌’ ప్రాజెక్ట్‌ అనుకున్నప్పుడు కథానాయికగా ఆమెను తీసుకోవాలని పూరీ అస్సలు అనుకోలేదట. ఆయన ఆలోచనల్లో మరో బీటౌన్‌ బ్యూటీ ఉందట. నిర్మాత వల్లే ఈ అవకాశం అనన్యను వరించిందట.

అనన్య కాదు..!

‘లైగర్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా పూరీ జగన్నాథ్‌  (Puri) ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ‘లైగర్‌’ హీరోయిన్‌ అనన్యా పాండే (Ananya) గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ‘‘విజయ్‌తో (Vijay Deverakonda) ‘లైగర్‌’ ప్రాజెక్ట్‌ చేయాలని నిర్ణయించుకొన్నాక.. స్క్రిప్ట్‌ సిద్ధం చేసి నిర్మాణంలో భాగం కావాల్సిందిగా కోరుతూ బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ని (karan johar) కలిశా. కథ విన్న వెంటనే ఆయన ఓకే అనడంతో మా ప్రాజెక్ట్‌ పట్టాలెక్కింది. అందుకు ఆయనకు థ్యాంక్స్‌ చెప్పాలి. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా బాలీవుడ్‌ నుంచి యువ, నూతన నటి ఉంటే బాగుంటుందనిపించింది. అలా నేను మొదటి నుంచి జాన్వికపూర్‌నే తీసుకోవాలనుకున్నా. స్వతహాగా నేను శ్రీదేవి అభిమాని కూడా. నా ప్రాజెక్ట్‌తో శ్రీదేవి కుమార్తెను దక్షిణాది వారికి పరిచయం చేయాలనుకున్నా. కాకపోతే జాన్వి డేట్స్‌ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్‌ను వదులుకుంది. ఇదే విషయాన్ని కరణ్‌ జోహార్‌కు చెప్పగా.. ఆయనే అనన్యా పాండేను తీసుకోమని సలహా ఇచ్చారు. ఆయన చెప్పడంతో ఈ ప్రాజెక్ట్‌లోకి అనన్యను తీసుకున్నాం. ఆమె మంచి నటి. ప్రతి సీన్‌లోనూ చక్కని హావభావాలు పలికించింది. ఈ సినిమా తర్వాత ఆమెకు యూత్‌లో ఫాలోయింగ్‌ విపరీతంగా పెరుగుతుంది’’ 

‘అర్జున్‌ రెడ్డి’తోనే ఇది సాధ్యమైంది..!

‘‘లైగర్‌’ ప్రమోషన్స్‌ కోసం విజయ్‌, అనన్య ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకాదరణ మెండుగా లభిస్తోంది. పుణె, పట్నా, వడోదర, చండీగఢ్‌.. ఇలా ప్రతి చోటా నిర్వహించిన ప్రమోషనల్‌ ఈవెంట్స్‌లో షాపింగ్‌ మాల్స్‌, గ్రౌండ్స్‌ నిండిపోతున్నాయి. రాత్రి తొమ్మిది గంటలకు ప్రోగ్రామ్‌ అని ప్రకటిస్తున్నప్పటికీ మధ్యాహ్నం మూడు గంటల నుంచే అభిమానులు ఈవెంట్ జరిగే ప్రదేశానికి భారీ ఎత్తున చేరుకుంటున్నారు. విజయ్‌కున్న క్రేజ్‌, ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్‌ చూసి సినిమా విషయంలో మేము కాస్త రిలాక్స్‌ అవుతున్నాం. విజయ్‌ నటించిన ‘అర్జున్‌ రెడ్డి’ని (Arjun Reddy) ఉత్తరాది వాళ్లూ చూశారు. ఆ సినిమా తర్వాత నుంచే వాళ్లందరూ విజయ్‌ని అభిమానిస్తున్నారు’’ 

పదేళ్ల క్రితమే..!

‘‘నా సతీమణి చెప్పడంతో ఓసారి విజయ్‌ నటించిన ‘అర్జున్‌రెడ్డి’ చూశా. ఆ సినిమా చూస్తున్నప్పుడే అతడు మంచి నటుడని అర్థమైంది. అతడితో ఎలాగైనా సినిమా చేయాలనిపించింది. సుమారు పదేళ్ల క్రితమే లైగర్‌ స్టోరీ సిద్ధం చేశా. విజయ్‌తో సినిమా చేయాలనుకున్నాక.. అతడిని ఓసారి కలిసి నా వద్ద ఉన్న ‘లైగర్‌’, మరో కథ కూడా చెప్పా. విజయ్‌కు ‘లైగర్‌’ బాగా నచ్చేసింది. ‘నాకు ఈ కథ నచ్చింది. ఈ సినిమా కోసం ఫిట్‌నెస్‌ జాగ్రత్తలు పాటిస్తూ ఫైటర్‌లా సిద్ధమవుతా. దయచేసి మనం ఈ సినిమానే చేద్దాం’ అంటూ విజయ్‌ అంగీకరించారు’’ అని పూరీ వివరించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని