kushboo sundar: నాపై లైంగిక వేధింపులు.. చెప్పినందుకు సిగ్గుపటడం లేదు: ఖుష్బూ

తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పినందుకు  తాను ఏమాత్రం సిగ్గుపడటం లేదని నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ (kushboo sundar) చెప్పారు. 

Updated : 08 Mar 2023 10:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన తండ్రి వల్ల తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానంటూ ఇటీవల సినీ నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ (kushboo sundar)సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  ఆ వ్యాఖ్యలపై తాజాగా ఆమె స్పందించారు. తనకు జరిగిన అన్యాయాన్ని బయట ప్రపంచానికి చెప్పినందుకు తాను ఏమాత్రం సిగ్గుపడటంలేదన్నారు.

‘‘నాకు జరిగిన అన్యాయాన్ని ధైర్యం చేసి నిజాయతీగా అందరికీ తెలిసేలా చేశాను. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. అలాగే ఆ విషయాన్ని చెప్పినందుకు నేనేమీ సిగ్గుపడటం లేదు. నాపై ఆ దారుణానికి పాల్పడిన వ్యక్తి సిగ్గుపడాలి. అలాగే మహిళలందరూ ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. మిమ్మల్ని కించపరిచే వాటిని ప్రోత్సహించకూడదు. నాకు జరిగిన దారుణాన్ని అందరితో చెప్పడానికి సమయం తీసుకొని ఉండొచ్చు. అదే మాదిరిగా ప్రతి ఒక్కరూ తమకు ఎదురైన వేధింపులను వెల్లడించి..  తమ ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నా’’ అని ఆమె వివరించారు.

మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఝార్ఖండ్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ఇటీవల ఖుష్బూ (kushboo sundar) ముఖ్య అతిథిగా విచ్చేశారు. నారీ శక్తి గురించి మాట్లాడుతూ.. తాను ఎనిమిదేళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్పారు. ‘‘భార్యాపిల్లల్ని చిత్రహింసలు పెట్టడం, కన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడడాన్ని జన్మహక్కుగా భావించే వ్యక్తి వల్ల నా తల్లి వైవాహిక బంధంలో ఇబ్బందులు పడింది. ఎనిమిదేళ్ల వయసులోనే నేను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను. 15 ఏళ్ల వయసులో ఆయనకు ఎదురుతిరగడం మొదలుపెట్టాను. నాకు 16 ఏళ్లు రాకముందే ఆయన మమ్మల్ని వదిలివెళ్లిపోయాడు’’ అని ఆమె వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని