NTR: లావుగా ఉన్న నన్ను చూసి రాజమౌళి ఆ మాట అన్నారు: ఎన్టీఆర్‌

NTR: తాను లావుగా ఉండటం చూసి రాజమౌళి ఏమన్నారో దాచుకోకుండా చెప్పి ఎన్టీఆర్‌ అందరి హృదయాలు గెలుచుకున్నారు.

Published : 02 Sep 2021 01:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వెండితెరపైనే కాదు, బుల్లితెరపై తనదైన శైలిలో అదరగొడుతున్నారు స్టార్‌ హీరో ఎన్టీఆర్‌. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం, అందరితోనూ కలిసిపోవడం ఎన్టీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. అందుకే గతంలో ఆయన చేసిన షో విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆయన వ్యాఖ్యాతగా ‘Evaru Meelo Koteeswarulu’ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ షోలోనూ తనదైన వాగ్ధాటితో మెప్పిస్తున్నారు. తాజాగా ఈ షోలో హాట్‌సీట్‌లో కూర్చొన్న ఒక కంటెస్టెంట్‌ తనకున్న బట్టతల కారణంగా ఆత్మన్యూనత భావానికి గురయ్యేవాడినని, పలువురు చేసే కామెంట్స్‌కు చాలా బాధపడేవాడినని చెప్పారు. ఇది విన్న NTR తన బరువు విషయంలో జరిగిన ఒక సంఘటనను ఈ వేదికపై పంచుకున్నారు. తాను లావుగా ఉండటం చూసి రాజమౌళి ఏమన్నారో దాచుకోకుండా చెప్పి అందరి హృదయాలు గెలుచుకున్నారు.

‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి 20ఏళ్లు దాటింది. తొలినాళ్లలో చాలా లావుగా ఉండేవాడిని. ఏ రోజూ నేను లావుగా ఉన్నానని నాకు అనిపించలేదు. ఒకరోజు మా జక్కన్న(రాజమౌళి) నన్ను చూసి ‘అసహ్యంగా ఉన్నారు’ అన్నారు. ఆ రోజు నాకు విషయం అర్థమైంది. మన చుట్టూ ఉన్న స్నేహితులు మనల్ని చక్కగా మార్గనిర్దేశం చేస్తారు. వాళ్లే మన నిజమైన స్నేహితులు. మీది జుట్టు సమస్య.. నాది కొవ్వు సమస్య.. అంతే తేడా’’ అని ఎన్టీఆర్‌ చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్లకు ఒక సలహా కూడా ఇచ్చారు. ‘నటనలో రాణించాలంటే మనకు కావాల్సింది నిజాయతీ. మనకు చాలా తెలుసు అనుకుంటాం. మనకు ఏదీ తెలియదు. ప్రపంచంలో ఎన్నో విషయాలు మనకు తెలియనివి జరుగుతుంటాయి. అవన్నీ పట్టించుకోకుండా మనకు చాలా తెలుసని ధైర్యంతో ఉంటాం. మన కోరిక వైపు చాలా బలంగా ప్రయాణించాలి’’ అని ఎన్టీఆర్‌ చెప్పడం అభిమానులతో పాటు, వీక్షకులను సైతం చప్పట్లు కొట్టేలా చేసింది.

ఇక ఎన్టీఆర్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘RRR’లో నటిస్తున్నారు. ఇందులో ఆయన కొమరం భీంగా కనిపించనున్నారు. రామ్‌చరణ్‌ మరో కథానాయకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు