ఎవరి పేరు ముందు వేయాలి?

అప్పట్లో ఒక చిత్రంలో ఇద్దరు స్టార్స్‌ నటిస్తుంటే చాలా విషయాల్లో ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు

Published : 24 Dec 2020 16:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అప్పట్లో ఒక చిత్రంలో ఇద్దరు స్టార్స్‌ నటిస్తుంటే చాలా విషయాల్లో ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు వచ్చేవి. అయితే అవి బయటకు కనిపించేవి కావు. కథ డిమాండ్‌ చేయడం, దర్శక-నిర్మాతల మొహమాటం వల్ల ఇద్దరు స్టార్స్‌ కలిసి నటించేందుకు ఒప్పుకొనేవారు. అయితే అక్కడి నుంచే ఆ చిత్ర బృందానికి తిప్పలు ప్రారంభమయ్యేవి. షూటింగ్‌ సమయంలో ఒకరి డేట్స్‌, ఇంకొకరి డేట్స్‌ కుదరకపోవడం, రిహార్సల్స్‌కు రాకపోవడం, అలకలు ఇలా చాలా విషయాల్లో షూటింగ్‌కు అంతరాయం కలిగేది. ఇక అక్కడి నుంచి బుజ్జగింపులు, బ్రతిమాలుకోవడాలు నిర్మాతలకు షరామామూలే.

కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో ఎమ్‌.ఎస్‌.రెడ్డి ‘శ్రీకృష్ణ విజయం’ (1971) తీశారు. అందులో జమున, జయలలిత ముఖ్య పాత్రధారులు. ఇద్దరూ కలిసి ఉన్న దృశ్యాలు తీసేటప్పుడు ఇబ్బందులు వచ్చేవి. సెట్టుకి రమ్మని పిలిస్తే ‘‘ఆమె వచ్చిందా? ఆమె వచ్చాక చెప్పండి నేను వస్తాను’’ అని ఒకరంటే, రెండోవారూ అలాగే అనేవారు. అదెలా తేల్తుంది? ఎలాగో తేలింది- మధ్యలో నిర్మాత నలిగేవాడు. ‘సెట్‌‌లో అందరం రిహార్సల్‌ చేస్తున్నాం. కానీ, ఆమె మాత్రం చాలా రిజర్వ్‌డ్‌గా ఉండేవాళ్లు. డైలాగ్‌లు చెప్పమంటే చెప్పేవారు కాదు. ఈ విషయాన్ని దర్శకుడికి చెబితే ఏం మాట్లాడలేదు. నాకు కోపమొచ్చి అలిగా. మేకప్‌ తీసేసి వెళ్లిపోతానన్నా.’ అని స్వయంగా జమున ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇలాంటి ‘ఇగో’లు సినిమా ప్రపంచంలో సహజమే! కానీ, ఎన్‌.టి.ఆర్‌, ఎ.ఎన్‌.ఆర్‌.లు ఒకే చిత్రంలో నటిస్తున్నప్పుడు ఇలాంటివి కనిపించలేదు. ఇద్దరిలో ఎవరు ముందు సిద్ధమైతే, వారు సెట్‌కి వెళ్లిపోయేవారు. అసలు, ఎన్టీఆర్‌ ఇంటి దగ్గరే సిద్ధమై సరాసరి సెట్టుకే వచ్చేసేవారు. అప్పటికే అక్కినేని సెట్లో ఉండేవారు. ‘భూకైలాస్‌’ చిత్రంలో రావణుడు, నారదుడు అవుట్‌డోర్‌ షూటింగ్‌కి వెళ్లాలి. చెప్పిన వేళకి- ఇద్దరూ ఒకేసారి కార్లు దిగారు! వాళ్ల క్రమశిక్షణ అది! ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ తీసినప్పుడు- ఇద్దరికీ అభిమాన సంఘాలు ఎక్కువగానే ఉండేవి. ఇద్దరిలోనూ ఎవరి పేరు ముందు వెయ్యాలి? ఎవరి పేరు ముందు వేసినా, రెండోవారి అభిమాన సంఘాలు పేచీ పెడతాయట. ఈ విషయం తెలుసుకున్న కె.వి.రెడ్డి గారు టైటిల్స్‌లో వాళ్ల పేర్లు వెయ్యకుండా- కృష్ణార్జునులిద్దరూ కలిసి వస్తున్న ‘షాట్‌’ వేశారు. తర్వాత తక్కినవాళ్ల పేర్లు వస్తాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని