NTR: విశ్వక్‌సేన్‌ అలా అన్నప్పుడు చాలా బాధేసింది: ఎన్టీఆర్‌

‘దాస్‌ కా దమ్కీ’ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్వక్‌సేన్‌ హీరోగా నటించిన చిత్రమది.

Published : 17 Mar 2023 22:58 IST

హైదరాబాద్‌: స్వీయ దర్శకత్వంలో విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) హీరోగా నటించిన తాజా చిత్రం ‘దాస్‌ కా దమ్కీ’ (Das Ka Dhamki). నివేదా పేతురాజ్‌ కథానాయిక. ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ప్రముఖ హీరో ఎన్టీఆర్‌ (NTR) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వేడుకనుద్దేశించి ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘విశ్వక్‌సేన్‌ మాట్లాడినట్టు నేనెప్పటికీ మాట్లాడలేను (నవ్వుతూ..). నేనే ఎక్కువగా మాట్లాడతా అనుకుంటే నాకంటే తను ఎక్కువగా మాట్లాడతాడు. నేను కూడా సైలెంట్‌ అయిపోయేలా చేశాడంటే అతడి స్థాయిని ఊహించుకోండి. నా మూడ్‌ బాగోకపోతే చూసే సినిమాల్లో విశ్వక్‌ నటించిన ‘ఈ నగరానికి ఏమైంది’ తప్పక ఉంటుంది. అందులో ఓ నటుడిగా ఆయన కామెడీ చేయకుండానే నవ్విస్తాడు. ఎంతగా ఎంటర్‌టైన్‌ చేస్తాడో అంతే బాధనూ లోపల దాచుకుని ఉంటాడు. అలా నటించాలంటే చాలా కష్టం. అతనికి అంత కాన్ఫిడెన్స్‌ ఎలా వచ్చిందో నాకు అర్థంకావట్లేదు. నటుడిగానే కాదు దర్శకుడిగానూ తను ప్రతిభావంతుడే. ఒకానొక సమయంలో రొటీన్‌ చిత్రాలు చేస్తున్నాడనుకున్నప్పుడు ‘అశోక వనంలో అర్జున కల్యాణం’తో వైవిధ్యం చూపించాడు. ఆ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు నేను వెళ్లాల్సి ఉంది కానీ కుదర్లేదు. ఆ చిత్రం చూశాక షాక్‌ అయ్యా. యాటిట్యూడ్‌తో మాట్లాడే ఒక మనిషి దానికి పూర్తి భిన్నంగా సాఫ్ట్‌ క్యారెక్టర్‌లో ఒదిగిపోగలడా? అని అనిపించింది. మూసధోరణిలో సాగుతున్న సినిమా నుంచి బయటకు వచ్చేందుకు నాకు చాలా కాలంపట్టింది. తర్వాత తన ‘హిట్‌’ చూశాక మరింత ఆశ్చర్యం కలిగింది. ఎంతో బ్యాలెన్స్‌గా నటించాడతడు. సమాజానికి కాదు తనకు తానే నిరూపించుకునేందుకు బయలుదేరిన నటుడు విశ్వక్‌. ఈ ‘దాస్‌ కా దమ్కీ’కి తానే దర్శకత్వం వహించాడు. ఇకపై తాను డైరెక్షన్‌ ఆపేయాలని కోరుకుంటున్నా ఎందుకంటే  కొత్తవారికి అవకాశం ఇవ్వాలి కాబట్టి (నవ్వులు..). ‘అన్నా.. ఈ సినిమాకి ఉన్నదంతా పెట్టేశా. ఈవెంట్‌కు మీరు రావాలంటే..’ అని నన్ను కలిసినప్పుడు విశ్వక్‌ అంటుంటే నాకు చాలా బాధేసింది. సినిమా అంటే తనకి ఎంత పిచ్చో అప్పుడు అర్థమైంది’’ అని అన్నారు.

ఆస్కార్‌ మీరూ సాధించారు..

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రపంచ పటంలో నిలవడానికి, ఆస్కార్‌ (సాంగ్‌ విభాగంలో) దక్కించుకోవడానికి మా దర్శకుడు జక్కన్న (రాజమౌళి), సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్‌, గాయకులు కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌, కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌ ఎంతటి కారకులో తెలుగు చలన చిత్ర పరిశ్రమ, యావత్‌ భారతీయ సినీ పరిశ్రమ, ప్రేక్షకులు అంతే కారణం. మీ అభిమానం (ఫ్యాన్స్‌నుద్దేశించి) ముఖ్య కారణం. ఆ అవార్డును మాతోపాటు మీరూ సాధించారు. మీ అందరి స్థానంలో మేం ఆస్కార్‌ వేదికపైకి వెళ్లాం. నాకు ఆ స్టేజ్‌పై అవార్డు అందుకున్న ఇద్దరు భారతీయులు (తెలుగువారు) కనిపించారే కానీ కీరవాణి, చంద్రబోస్‌ కనిపించలేదు’’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని