NV Prasad: పవన్‌పై దాడి చేయాలనుకుంటే.. రాజకీయంగా చూసుకోండి..!

పవన్‌కల్యాణ్‌-రానా కీలకపాత్రల్లో నటించిన ‘భీమ్లానాయక్‌’ ప్రదర్శనల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆంక్షలు విధించడం పట్ల తెలుగు ఫిలిం ఛాంబర్‌ మాజ...

Updated : 25 Feb 2022 11:26 IST

‘భీమ్లానాయక్‌’ రిలీజ్‌పై ఆంక్షలు.. స్పందించిన తెలుగు ఫిలిం ఛాంబర్‌ మాజీ అధ్యక్షుడు

తిరుపతి: పవన్‌కల్యాణ్‌-రానా కీలకపాత్రల్లో నటించిన ‘భీమ్లానాయక్‌’ ప్రదర్శనల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆంక్షలు విధించడం పట్ల తెలుగు ఫిలిం ఛాంబర్‌ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్‌ స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 10 గంటల వరకూ సినిమా షోలకు అనుమతి లేని విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘భీమ్లానాయక్‌’ విడుదల నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘిస్తారేమోనన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని పలు థియేటర్ల వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులు పహారా కాస్తున్నట్లు పలు వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై తాజాగా ఎన్వీ ప్రసాద్‌ స్పందించారు. పవన్‌పై దాడి చేయాలనుకుంటే రాజకీయంగా చేయాలని.. కానీ, ఇలా ఆంక్షలు విధించడం వల్ల ఎగ్జిబిటర్ల వ్యవస్థకే నష్టం చేకూరుతుందని ఆయన వాపోయారు.

‘‘థియేటర్‌ యజమానులపై మీరు చేస్తోన్న దాడి సరైంది కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎలా మీవాళ్లు అవుతారో ఇక్కడ ఉన్న ఎగ్జిబిటర్లు కూడా మీవాళ్లే. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇది పవన్‌పై లేదా నిర్మాతలపై దాడి కాదు. అధికారులపై ఒత్తిడి తెచ్చి, వాళ్లని థియేటర్ల వద్ద కూర్చొపెట్టాల్సిన అవసరం లేదు. మీరు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా వచ్చినప్పుడు మేము ఎంతో సంతోషించాం. మా సమస్యలు తీరిపోతాయని భావించాం. కానీ, అలా జరగలేదు. ఇప్పటివరకూ వచ్చిన మూడు కరోనాల కన్నా  తీవ్రంగా ఎగ్జిబిటర్ల వ్యవస్థపై దాడి చేస్తున్నారు. ఇది సినిమా పరిశ్రమపై దాడి కాదు. ఏపీలో ఉన్న సినిమా ఎగ్జిబిటర్ల వ్యవస్థపై దాడి చేస్తున్నారనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. ఆంక్షలు విధించడం వల్ల ‘భీమ్లానాయక్‌’, పవన్‌కల్యాణ్‌పై దాడి అనుకుంటున్నారు. 10 గంటల వరకూ షో వేయొద్దని నోటీసులు ఇచ్చారు. దానికి అనుగుణంగా మేము ఉన్నాం. 10 గంటల లోపు సినిమా వేసే అధికారం ఎవ్వరికీ లేదు. కానీ, అధికారులు మళ్లీ థియేటర్లపై  దాడి చేయడం ఎంతవరకూ న్యాయం? ఏపీలో ఉన్న సినిమా ఎగ్జిబిటర్లను ఏం చేయాలనుకుంటున్నారో ఓపెన్‌గా చెప్పేయండి. పవన్‌పై దాడి చేయాలనుకుంటే అది మీ వ్యక్తిగతం. రాజకీయంగా చూసుకోండి. కానీ థియేటర్ల వ్యవస్థపై దాడి చేస్తున్నారు. థియేటర్ల ఓనర్లు ఏం చేశారని మీరు ఇలా చేస్తున్నారు?. ఈ దాడుల వల్ల పవన్‌కల్యాణ్‌కు ఎలాంటి నష్టం ఉండదు. మంత్రి గారూ ఈ విషయాన్ని అర్థం చేసుకోండి’’ అని ఎన్వీ ప్రసాద్‌ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని