Lata Mangeshkar: గానకోకిల ‘మౌనవ్రతం చేసిన వేళ.. ఎందుకంటే?

వేలాది పాటలతో సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకున్న గాయని లతా మంగేష్కర్‌ మృతి తీరని లోటును మిగిల్చింది.

Published : 07 Feb 2022 01:33 IST

ఇండోర్‌: వేలాది పాటలతో సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకున్న గాయని లతా మంగేష్కర్‌ మృతి తీరని లోటును మిగిల్చింది. అనితర సాధ్యమైన రీతిలో ఆమె ఎన్నో వేల పాటలను ఆలపించారు. అయితే, 1960వ దశకంలో మాత్రం కొన్ని నెలల పాటు ఆమె పాటలకు దూరంగా ఉన్నారు. అంతేకాదు, అనేక రోజులు మౌనవత్రాన్ని ఆచరించారు. దీని వెనుక కారణాన్ని ఆమె సోదరుడు హృదయనాథ్‌ మంగేష్కర్‌ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

1960 నాటికే కొన్ని వందల పాటలను ఆలపించిన లతా మంగేష్కర్‌కు గొంతు సంబంధిత సమస్య ఎదురైంది. ముఖ్యంగా స్వరం పెంచి పాడాల్సిన పాటలను ఎక్కువగా ఆమె పాడుతుండటంతో స్వరపేటికలో సమస్య ఏర్పడింది. దీంతో ఏ పాట పాడినా అనుకున్న రీతిలో వచ్చేది కాదు. పైగా లతాజీ కూడా బాగా ఇబ్బంది పడేవారట. ఇదే విషయాన్ని ప్రముఖ గాయకుడు ఉస్తాద్‌ ఆమీర్‌ ఖాన్‌కు చెబితే సమస్య పరిష్కారమయ్యే వరకూ ఎలాంటి పాటలూ పాడవద్దని సూచించారట. ఆ సమయంలో లతా మంగేష్కర్‌ కెరీర్‌ అత్యున్నత స్థాయిలో ఉంది. అయినా కూడా ఉస్తాద్‌ సూచన మేరకు ‘మౌనవ్రతం’ ఆచరించటం మొదలు పెట్టిన ఆమె కొన్ని నెలల పాటు ఏ గీతాన్ని ఆలపించలేదు. 2010లో ఇండోర్‌లో నిర్వహించిన ‘మై ఔర్‌ దీదీ’ కార్యక్రమంలో హృదయనాథ్‌ ఈ విషయాన్ని పంచుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని