Puri Musings: రూ.85తో ఇంటిని కొనుక్కోండి!

ఆ ఇళ్లన్నీ 500 ఏళ్ల క్రితం కట్టినవి

Updated : 19 Jun 2021 17:37 IST

ఇటలీవాళ్లకే కాదు.. మనకూ ఆ అవకాశం ఉంది

ఇంటర్నెట్ డెస్క్‌: ‘‘ఒక్కసారి యూట్యూబ్‌లో ఈ నగరాలను చూడండి. అద్భుతమైన రాతి కట్టడాలతో ఆకట్టుకుంటాయి. ఒకసారి చూడండి. మీక్కూడా నచ్చితే.. తలో ఇల్లు కొనేద్దాం. కేవలం ఒక్క యూరో మాత్రమే’’ అని తన ‘పూరీ మ్యూజింగ్స్‌’ వేదికగా ఇటలీలోని ప్రాంతాల గురించి వివరించారు. ‘‘ఇటలీ అనేది అందమైన దేశం. అక్కడ ఏ నగరాన్ని చూసినా కొన్ని వేల ఏళ్ల చరిత్ర ఉంటుంది. ఒక్కో భవనం.. ఒక్కో అద్భుతమైన కట్టడం. అట్లాగే ఇటలీలో ఎన్నో చరిత్రాత్మక నగరాలు ఉన్నాయి. అవన్నీ ఎప్పుడో కట్టినవి. చక్కటి ఇళ్లు, వీధులు, పార్కులతో చాలా కవితాత్మకంగా ఉంటాయి. అయితే కొన్ని నగరాల్లో రకరకాల సమస్యలు వచ్చి.. అక్కడ  పనిదొరక్క.. బతకడం కష్టమై.. అక్కడున్నవారంతా ఆ ప్రదేశాలను విడిచిపెట్టి వెళ్లిపోయారు. అలా అవన్నీ ఖాళీ అయిపోయాయి. ఇప్పుడక్కడ ఒక్క మనిషి ఉండటం లేదు. కానీ ఆ నగరాలను చూస్తే.. ఇప్పటికీ ఎంతో అందంగా ఉంటాయి. ప్రభుత్వం వాటిని జనాభాతో పూర్వవైభవం తేవాలని నిర్ణయించుకుంది. అక్కడున్న ఒక్కో ఇంటిని ఒక యూరోకి అమ్మడం మొదలుపెట్టింది. అంటే మన రూపాయల్లో 85 అన్నమాట. అంతే.. అలాంటి ఇంటిని అక్కడి నివాసితులు మాత్రమే కాదు.. మనం కూడా కొనుక్కోవచ్చు. అక్కడనున్న మున్సిపాలిటీ వాళ్లు మనకు అమ్ముతారు. అయితే ఆ ఇంటిని తిరిగి నిర్మిస్తామని హామీ ఇవ్వాలి’’

‘‘డిపాజిట్‌గా రూ.25వేలు లేదా 50 వేలు కడితే సరిపోతుంది. నిర్మించేటప్పుడు ఆ డబ్బును తిరిగి మళ్లీ మనకే ఇచ్చేస్తారు. కొన్ని నగరాల్లో అయితే ఆ డిపాజిట్‌ కూడా తీసుకోవడం లేదు. అలాగే నిర్మాణానికి మనకు 1-3 ఏళ్ల వరకూ సమయమిస్తారు. ప్రతీ నగరానికి ఒక ఆర్కిటెక్ట్‌ అలాగే బిల్డర్‌ ఉంటారు. మీరు వాళ్లకే పని ఇవ్వాలి. ఆర్కిటెక్ట్‌ ఆ నగరం రూపురేఖలు మారిపోకుండా చూస్తారు. ఇంకొకటి.. ఆ ఇళ్లన్నీ 500 ఏళ్ల క్రితం కట్టినవి. కట్టడాలన్నీ గట్టిగా ఉంటాయన్న నమ్మకం లేదు. దీంతో అదనంగా ఖర్చు అవుతుంది. చిన్న ఇంటికి రూ.25 లక్షలు పెట్టాల్సి వస్తుంది. ఇంటి సైజ్‌ బట్టి ఖర్చులు పెరుగుతాయి. మీరు కావాలంటే ఒక యూరో చొప్పున నగరం మొత్తం కొనుక్కోవచ్చు. ఆ నగరంలో ఉండే ఇళ్లు, వీధులు, చర్చి, రోడ్లు..  అన్ని మీ సొంతం. అయితే మీరొక్కరే కాకుండా మీ స్నేహితులందరూ కలిసి అలాంటి నగరంలో తలా ఒకటి కొని తిరిగి ఆధునీకరిస్తే చాలు.. ఇటలీలో మనకు సొంతంగా ఒక టౌన్‌ ఉన్నట్టే. అక్కడ స్ర్టీట్‌ మార్కెట్లు, స్ర్ట్రీట్‌ ప్లే, చిన్న చిన్న ఓపెన్‌ రెస్టారెంట్లు, బార్లను ప్రారంభించి పర్యాటకులను ఆకట్టుకుంటే అదిరిపోతుంది. స్నేహితులంతా జట్టుగా ఏర్పడి ఇలా చెయొచ్చు. ఇప్పుడు 11టౌన్స్‌ సేల్‌కోసం రెడీగా ఉన్నాయి. అవేంటంటే.. ముసొమెల్లి, క్యాస్ట్రోపిగ్నానో, లసర్నా, సింక్‌ఫాండీ, ఒల్లల్లాయి, ట్రాయినా, గంగీ,  జుంగోలి, సంబుకా.. ఒక్కసారి మీరు యూట్యూబ్‌లో ఈ నగరాలను చూడండి. అద్భుతమైన రాతి కట్టడాలతో ఆకట్టుకుంటాయి. ఒకసారి చూడండి. మీక్కూడా నచ్చితే.. తలో ఇల్లు కొనేద్దాం. కేవలం ఒక్క యూరో మాత్రమే’’ అని ఇటలీ నగరాల గురించి ఆసక్తికర అంశాలను వెల్లడించారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని