అప్పుడు మనసుకు కష్టమనిపించింది

‘‘ఒకే సమయంలో రెండు చిత్రాలు తెరకెక్కించడం గతంలో పెద్ద దర్శకుల విషయంలో జరిగింది. ఇప్పుడు మళ్లీ నా   జీవితంలో జరుగుతోంద’’న్నారు విజయ్‌ కుమార్‌ కొండా. ‘గుండెజారి గల్లంతయ్యిందే’

Published : 04 Oct 2020 12:19 IST

‘‘ఒకే సమయంలో రెండు చిత్రాలు తెరకెక్కించడం గతంలో పెద్ద దర్శకుల విషయంలో జరిగింది. ఇప్పుడు మళ్లీ నా   జీవితంలో జరుగుతోంద’’న్నారు విజయ్‌ కుమార్‌ కొండా. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ‘ఒక లైలా కోసం’ వంటి వినోదాత్మక ప్రేమకథా చిత్రాలతో సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడాయన. ఇప్పుడాయన నుంచి వచ్చిన చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. రాజ్‌తరుణ్, మాళవిక నాయర్‌ జంటగా నటించిన చిత్రమిది. ఇటీవలే ఆహా ఓటీటీ ద్వారా విడుదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆన్‌లైన్‌ ద్వారా మీడియాతో ముచ్చటించారు విజయ్‌ కుమార్‌.

ఆశించిన ఫలితం అందింది

థియేటర్లో ప్రేక్షకులంతా పడిపడి నవ్వుకునేలా చేయాలన్న లక్ష్యంతోనే ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా తీర్చిదిద్దాం. కరోనా - లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల వెండితెర ఆనందాల్ని మిస్సయినా.. ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులంతా ఇంటి నుంచే మా వినోదాన్ని కుటుంబ సమేతంగా ఆస్వాదిస్తున్నారు. మేం సినిమా   ప్రారంభించినప్పటి నుంచి ఆశించినది ఇదే. ఇప్పుడా ఫలితాన్ని ‘ఆహా’ ఓటీటీ వేదికగా అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

కథ రాసుకున్నప్పుడే అనుకున్నా

ఈ కథకు ప్రత్యేకంగా స్ఫూర్తంటూ ఏమీ లేదు. ముందు నుంచీ ఈ చిత్రంతో పూర్తి వినోదాన్ని పంచివ్వాలని గట్టిగా ఫిక్సయిపోయా. దీనికి తగ్గట్లుగా ఈ కథ సిద్ధం చేసుకున్నాక.. బుజ్జిగాడు పాత్రకు రాజ్‌తరుణ్‌     సరిపోతారనిపించి తన వద్దకు వెళ్లా. ఎందుకంటే దీంట్లో హీరో పాత్ర పక్కింటి కుర్రాడిలా అనిపించాలి. సినిమా అంతా నవ్వించాలి. ఆ లక్షణాలన్నీ రాజ్‌తరుణ్‌లోనే ఉన్నాయి. అందుకే తననే ఈ చిత్రానికి ఎంపిక చేసుకున్నాం. ఇది సినిమాకు కలిసొచ్చింది. అలాగే మాళవిక పాత్రకి ముందు నుంచి తననే అనుకున్నాం.

అందుకే గ్యాప్‌ వచ్చింది

‘ఒక లైలా కోసం’ తర్వాత వెంటనే ఒక హీరోతో సినిమా అనుకున్నా. ఇద్దరం ఒక కథ అనుకొని దానితోనే కొంత కాలం ట్రావెల్‌ అయ్యాం. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. మరో రెండు మూడు చిత్రాలకీ ఇదే జరిగింది. ఆ సమయంలో చాలా బాధపడ్డా. మన కథలో తప్పులుంటే పెద్దగా పట్టించుకోం. కానీ, ఒక జోనర్‌లో సినిమా అనుకుని దానిపై కొంత కాలం వర్క్‌ చేశాక, ఇప్పుడిది వద్దు మరొకటి ట్రై చేద్దామంటే మనసుకు కష్టంగా అనిపించేది. నాకు ఓపిక, కసి రెండూ ఎక్కువే కాబట్టి ఆ కథలు పక్కకు పెట్టి మరో కథతో రాజ్‌తరుణ్‌తో సినిమా చేశా. ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలతో సెట్స్‌పై ఉన్నా.

విభిన్నంగా ప్రయత్నిస్తున్నా

నాకు వినోదాత్మక ప్రేమకథలంటే చాలా ఇష్టం. కానీ ఇకపై విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా. ప్రస్తుతం రాజ్‌తరుణ్‌తోనే చేస్తున్న మరో కొత్త చిత్రాన్ని ఓ చక్కటి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతోనే తెరకెక్కిస్తున్నాం. ఇప్పుడు మొయినాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్‌తో చేస్తున్న ‘రైడర్‌’ చిత్రం సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. బాస్కెట్‌ బాల్‌ ఆట నేపథ్యంలో సాగే చక్కటి ప్రేమకథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. నాకెంతో ప్రత్యేకమైన ప్రాజెక్టిది. పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని