Ori Devuda: మరికొన్ని గంటల్లో ‘ఓరి దేవుడా..!’ స్ట్రీమింగ్‌.. ఏ ఓటీటీలో అంటే?

‘ఓరి దేవుడా..!’ సినిమా ఓటీటీ విడుదల ఖరారైంది. విశ్వక్‌ సేన్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఎప్పటి నుంచి స్ట్రీమింగ్‌ కానుందంటే?

Published : 10 Nov 2022 13:12 IST

హైదరాబాద్‌: దీపావళి కానుకగా అక్టోబరు 21న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘ఓరి దేవుడా..!’ (Ori Devuda). ఈ సినిమా మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. గురువారం అర్ధరాత్రి (12 గంటలకు) నుంచి ఈ చిత్రం ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సడెన్‌ సర్‌ప్రైజ్‌తో సినీ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. సదరు సంస్థ ప్రకటనపై సోషల్‌ మీడియా వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా తెరకెక్కిన ఈ ఫాంటసీ రొమాంటిక్‌ కామెడీ చిత్రంలో వెంకటేశ్‌ అతిథి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాతో మిథిలా పాల్కర్‌ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

క‌థేంటంటే: అర్జున్ (విశ్వక్‌ సేన్‌), అను (మిథిలా పాల్కర్) బాల్య స్నేహితులు. అను ఇష్టపడటంతో అర్జున్ ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కానీ, ఆ తరవాతే సమస్యలు మొదలవుతాయి. ఆమె అర్జున్‌ని అనుమానిస్తూ ఉంటుంది. అర్జునేమో ఆమె ప్రేమను అర్థం చేసుకోకుండా తన స్వేచ్ఛ కోల్పోయినట్లు భావిస్తాడు. దాంతో ఇద్దరూ విడాకులకు సిద్ధమవుతారు. జీవితంలో భార్య స్నేహితురాలిగా ఉండొచ్చు కానీ, స్నేహితురాలే భార్యగా రాకూడదంటూ అర్జున్‌ దేవుడు ముందు మొర పెట్టుకుంటాడు. ప్రేమ పెళ్లి విషయంలో తనకి సెకండ్ ఛాన్స్ ఇవ్వమని కోరుకుంటాడు. దేవుడు కొన్ని కండిషన్స్‌తో అందుకు అంగీకరిస్తాడు. మరి సెకండ్ ఛాన్స్ తీసుకున్న అర్జున్ తనకి స్కూల్ డేస్ నుంచి ఇష్టమైన మీరా (ఆశా భట్) ప్రేమని పొందాడా? అను- అర్జున్‌లు విడిపోయారా? దేవుడు (వెంకటేశ్‌) ఏం చేశాడు? అన్నది మిగతా కథ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని