Updated : 28 Mar 2022 14:50 IST

Will Smith: రెండు సార్లు తగ్గాడు.. ఇప్పుడు ‘ఆస్కార్‌’ ఉత్తమ నటుడిగా నెగ్గాడు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మార్చి పోతే సెప్టెంబరు’ అని పరీక్ష తప్పిన విద్యార్థులు ఎలా అనుకుంటారో ‘ఇప్పుడు కాకపోతే వచ్చే ఏడాదిలో’ అని అవార్డు మిస్‌ అయిన నటులు ముందుకెళ్తుంటారు. అయితే.. ఫలితం అనుకున్నంతగా తేలిగ్గా రాదు కదా. స్టూడెంట్‌ అయినా.. సినిమా వాళ్లయినా.. పరాజయం పొందినప్పుడు తమ లోపాన్ని సరిదిద్దుకుంటేనే లక్ష్యాన్ని చేరుకుంటారు. అలా.. రెండు సార్లు ‘ఆస్కార్‌’ను సాధించలేకపోయిన హాలీవుడ్‌ నటుడు విల్‌స్మిత్‌ మూడో ప్రయత్నంలో విజయం అందుకున్నాడు. భారతీయ సినీ అభిమానులకు సుపరిచితుడైన ఆయన ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. ఎందరో జీవితాల్ని తెరపైకి తీసుకొచ్చిన ఈ ఉత్తమ నటుడి గురించి తెలుసుకుందాం..

ర్యాపర్‌ అవ్వాలని..

1968 సెప్టెంబరు 25న జన్మించిన స్మిత్‌ అసలు పేరు విల్లర్డ్‌ క్రిస్టోఫర్‌ స్మిత్‌ జూనియర్‌. ఇంజినీర్‌ అయిన అతడి తండ్రి పేరు (విల్లర్డ్‌ క్రిస్టోఫర్‌ స్మిత్‌ సీనియర్‌) ఇదే కావడంతో.. కొన్నాళ్లకు విల్‌ స్మిత్‌గా మారాడు. తల్లి.. కారోలైన్‌. వెస్ట్‌ ఫిలడేల్ఫియాలోని వైన్‌ ఫీల్డ్‌లో స్మిత్‌ బాల్యం గడిచింది. అతడికి ముగ్గురు తోబుట్టువులున్నారు. తన 13 ఏటనే విడిపోయిన తల్లిదండ్రులు 2000లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. స్మిత్‌కు చిన్నప్పటి నుంచి ర్యాపర్‌ అవ్వాలనే బలమైన కోరిక ఉండటంతో చదువుపై శ్రద్ధ చూపలేదు.

బుల్లితెర టు వెండితెర

ఆ ఆసక్తితోనే 12 ఏళ్ల వయసులోనే తన స్నేహితుడితో కలిసి సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఈ ద్వయం స్వరపరిచిన ‘గాళ్స్‌ ఎయింట్‌ నథింగ్‌ బట్‌’ ట్రబుల్‌’ ఆల్బమ్ సంగీత శ్రోతల్ని విశేషంగా అలరించింది. ఈ ఇద్దరికీ మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అలా ర్యాపర్‌గా తనదైన ముద్ర వేసిన స్మిత్‌ 1990లో బుల్లితెరపై మెరిశారు. ‘ది ఫ్రెష్‌ ప్రిన్స్‌ ఆఫ్‌ బెల్‌- ఎయిర్‌’ అనే సిరీస్ ఆయనకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చింది. ఉత్తమ నటుడిగా ‘గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్‌’కు నామినేట్‌ అయ్యాడు. రెండేళ్ల తర్వాత ‘వేర్‌ ది డే టేక్స్‌ యు’ అనే చిత్రంతో వెండితెరకు పరిచయమైన స్మిత్‌.. ఇందులో దివ్యాంగుడిగా కనిపించారు. తొలి ప్రయత్నంలోనే తన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు.

అటు యాక్షన్‌ చిత్రాలు.. ఇటు జీవిత కథలు

కెరీర్‌ ప్రారంభంలో ‘బ్యాడ్‌ బాయ్స్‌’ (కాప్‌ యాక్షన్‌ కామెడీ), ‘మెన్‌ ఇన్‌ బ్లాక్‌’ (సైన్స్‌ ఫిక్షన్‌), ‘ఎనిమీ ఆఫ్‌ ది స్టేట్‌’ (పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్) వంటి విభిన్న తరహా కథలతో అలరించిన స్మిత్‌ నటించిన తొలి బయోపిక్‌ ‘అలీ’. ఈ చిత్రం ప్రముఖ బాక్సర్‌ మహ్మద్‌ అలీ జీవితాధారంగా తెరకెక్కింది. అలీ పాత్రలో ఒదిగిపోయి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాతోనే ఉత్తమ నటుడిగా తొలిసారి ఆస్కార్‌కు, గ్లోబల్‌ గోల్డ్‌ అవార్డ్‌కు నామినేట్‌ అయ్యాడు. అతడు నటించిన రెండో బయోపిక్‌ ‘ది పర్షుట్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌’. అమెరికన్‌ బిజినెస్‌మ్యాన్‌, మోటివేషన్‌ స్పీకర్‌ క్రిస్‌ గార్డ్‌నర్‌ జీవితకథాంశాలతో ఈ సినిమా రూపొందింది. తండ్రీకొడుకుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో స్మిత్‌ భావోద్వేగాలు చూస్తే కళ్లు చెమ్మగిల్లాల్సిందే. అంతగా హృదయాల్ని హత్తుకున్నాడు కాబట్టే ఉత్తమ నటుడిగా రెండోసారి ఆస్కార్‌ నామినేషన్‌కు ఎంపికయ్యాడు. నైజీరియన్‌- అమెరికన్‌ ఫిజిషియన్‌ బెన్నెత్‌ ఒమలు జీవితాధారంగా తెరకెక్కిన ‘కన్‌క్యూషన్‌’ సినిమాకు ఉత్తమ నటుడిగా గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్‌కు నామినేట్‌ అయ్యాడు స్మిత్‌.

బయోపిక్‌తోనే అవార్డు..

ఇలా.. పలు ప్రతిష్ఠాత్మక అవార్డులకు నామినేట్‌ అయి విజేతగా నిలవకపోయినా స్మిత్‌ ఎప్పుడూ నిరాశ పడలేదు. ‘ప్రయత్నిస్తే ఎప్పటికైనా అనుకున్న ఫలితం వస్తుంద’నే నమ్మకంతోనే మరొకరి జీవిత కథను తెరపైకి తీసుకొచ్చాడు. ఉత్తమ నటుడిగా స్మిత్‌కు ఆస్కార్‌ను అందించిన ఆ చిత్రమే ‘కింగ్‌ రిచర్డ్‌’. ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణులు వీనస్‌, సెరీనా విలియమ్స్‌ తండ్రి, కోచ్‌ రిచర్డ్‌ విలియమ్స్‌ జీవిత కథతో రూపొందింది. వీనస్‌, సెరీనాలను టెన్నిస్‌ క్రీడాకారిణులుగా తయారు చేయడంలో రిచర్డ్‌ ఎలా కృషి చేశారు? అన్నది ఇందులో భావోద్వేగభరితంగా చూపించారు. టైటిల్‌ పాత్రలో విల్‌స్మిత్‌ జీవించిన తీరు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ప్రపంచమంతా తన గురించి మాట్లాడుకునేలా చేసింది. ఈ ఆస్కార్‌ విజేత భారతీయ చిత్రం ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ (హిందీ)లో అతిథిగా సందడి చేసిన సంగతి తెలిసిందే.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని