Oscar Awards 2022: ఈసారి ఆస్కార్‌ పట్టు ‘పట్టారు’.. విల్‌స్మిత్‌, జెస్సికా ప్రయాణమిదీ!

ఒకరు.. రెండు సార్లు ఆస్కార్‌ ఉత్తమ నటుడిగా నామినేట్‌ అయి విజేతగా నిలవలేకపోయారు. మరొకరు.. ఓసారి ఉత్తమ నటిగా  నామినేషన్‌ అందుకున్నా అవార్డు అందుకోలేకపోయారు.

Updated : 28 Mar 2022 11:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకరు.. రెండు సార్లు ఆస్కార్‌ ఉత్తమ నటుడిగా నామినేట్‌ అయి విజేతగా నిలవలేకపోయారు. మరొకరు.. ఓసారి ఉత్తమ నటిగా నామినేషన్‌ అందుకున్నా అవార్డు అందుకోలేకపోయారు. అయినా నిరాశ పడకుండా తమను తాము మెరుగుపరుచుకున్నారు. ఈసారైనా ఆస్కార్‌ తీసుకోవాలనే లక్ష్యంతో ముందుకుసాగారు. ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. వారెవరో కాదు విల్‌స్మిత్‌, జెస్సికా ఛస్టెయిన్‌. 94వ ఆస్కార్‌ వేడుకల్లో ఉత్తమ నటీనటులుగా మెరిసిన ఈ ఇద్దరి సినీ ప్రయాణం చూద్దామా..

రెండు సార్లు మిస్‌..

‘వేర్‌ ది డే టేక్స్‌ యు’ అనే చిత్రంతో తెరంగేట్రం చేసిన విల్‌స్మిత్‌ ర్యాప్‌ సింగర్‌, నిర్మాతగానూ తనదైన ముద్రవేశాడు. ‘మేడ్‌ ఇన్‌ అమెరికా’, ‘సిక్స్‌ డిగ్రీస్ ఆఫ్‌ సెపరేషన్‌’, ‘బ్యాడ్‌ బాయ్స్‌’, ‘మెన్‌ ఇన్‌ బ్లాక్‌’, ‘వైల్డ్‌ వైల్డ్‌ వెస్ట్‌’, ‘ఐ, రోబో’, ‘ఐయామ్‌ లెజెండ్‌’, ‘అలాద్దీన్‌’ వంటి ఎన్నో వైవిధ్య భరిత కథల్లో నటించిన ఆయన భారతీయ సినీ ప్రేక్షకులకూ సుపరిచితుడే. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ (హిందీ) సినిమాలో విల్‌స్మిత్‌ అతిథిగా మెరిశారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న విల్‌స్మిత్‌.. ‘అలీ’ (2002), ‘ది పర్షుట్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌’ (2007) చిత్రంలో నటనకు ఉత్తమ నటుడిగా నామినేషన్‌ దక్కించుకున్నారు. కానీ, అప్పుడు అవార్డు అందుకోలేకపోయారు. ఇప్పుడు.. ఆండ్రూ గార్‌ఫీల్డ్‌, బెనిడిక్ట్‌ కంబర్‌ బ్యాచ్‌, జేవియర్‌ బార్డెమ్, డెంజిల్‌ వాషింగ్టన్‌ను వంటి దిగ్గజ నటులను వెనక్కినెట్టి ‘కింగ్‌ రిచర్డ్‌’ సినిమాలోని నటనకు ఆస్కార్‌ సాధించారు. ప్రపంచం మెచ్చిన టెన్నిస్‌ క్రీడాకారిణులు వీనస్‌, సెరీనా విలియమ్స్‌ తండ్రి, కోచ్‌ రిచర్డ్‌ విలియమ్స్‌ జీవిత కథతో రూపొందిన చిత్రమిది. రిచర్డ్‌  పాత్రలో విల్‌స్మిత్‌ పండించిన భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకున్నాయి. ఆస్కార్‌ను అందించాయి.


ఇదీ జెస్సికా అంటే..

‘జోలెన్‌’తో వెండితెరకు పరిచయమైన జెస్సికా ఛస్టెయిన్‌ ‘స్టోలెన్‌’, ‘టేక్‌ షెల్టర్‌’, ‘ది హెల్ప్‌’, ‘లా లెస్‌’ తదితర సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించింది. ‘ఇంటర్‌స్టెల్లర్‌’లో శాస్త్రవేత్తగా, ‘ది మార్టిన్‌’లో వ్యోమగామిగా కనిపించి, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్న జెస్సికా ఆస్కార్‌ అందుకోవడం ఇదే తొలిసారి. ‘ది ఐస్‌ ఆఫ్‌ టమ్మీ ఫాయే’ చిత్రంలోని నటనకుగానూ ఆమెకు ఈ గౌరవం దక్కింది. నికోల్‌ కిడ్‌మన్‌, ఒలివీయా కోల్‌మెన్‌, పెన్లోప్‌ క్రూజ్‌, క్రిస్టిన్‌ స్టివార్ట్‌లతో పోటీపడి విజేతగా నిలిచింది. సినిమాకి మిశ్రమ స్పందన లభించినా జెస్సికాకు ఆస్కార్‌ వచ్చిందంటే ఆమె నటన ఎలాంటిదో అర్థమవుతుంది. ఈ సినిమాలో మత ప్రచారకురాలు, గాయని, టీవీ వ్యాఖ్యాత అయిన టమ్మీ ఫాయే పాత్రలో జెస్సికా నటించింది. గతంలో ‘జీరో డార్క్‌ థర్టీ’ చిత్రంలోని నటనకు ఉత్తమ నటి విభాగంలో నామినేషన్‌ అందుకుని, విన్నర్‌గా నిలవలేకపోయింది. ఇప్పుడు తానెంటో ప్రపంచానికి చాటిచెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని