Oscar Awards: ‘ఆస్కార్‌’ గెలిచిన భారతీయులు వీరే.. తొలి వ్యక్తి ఎవరంటే?

ఇప్పటి వరకూ ఎంతమంది భారతీయులు ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్నారో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Updated : 13 Mar 2023 17:49 IST

సినీ అవార్డుల్లో ప్రతిష్ఠాత్మకమైంది ‘ఆస్కార్‌’. ఆ పురస్కారానిది 95 ఏళ్ల చరిత్ర. ఇన్నేళ్లలో అతి తక్కువమంది భారతీయులు ఆస్కార్‌ విజేతలుగా నిలిచారు. వారెవరు? ఏయే విభాగాల్లో అందుకున్నారో గుర్తుచేసుకుందాం..   

‘నాటు నాటు’ పాట ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డు దక్కించుకున్న క్షణం నుంచే అది ఆస్కార్‌నూ సొంతం భారతీయులంతా భావించారు. ఆశించినట్టుగానే.. లాస్‌ ఏంజిల్స్‌ వేదికగా జరిగిన 95వ ఆస్కార్‌ వేడుకల్లో ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ (నాటు నాటు) విభాగంలో సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి (MM Keeravani), గేయ రచయిత చంద్రబోస్‌ (chandrabose) అవార్డులు స్వీకరించారు. ఈ పురస్కారం అందుకున్న తొలి తెలుగు వారిగా చరిత్ర సృష్టించారు. సుమారు 85 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి ఆస్కార్‌ అందుకున్నది వీరే. మరోవైపు, బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో మనదేశం నుంచి నామినేట్‌ అయిన ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ (The Elephant Whisperers) ఆస్కార్‌ను దక్కించుకుంది. ఈ మేరకు  దర్శకురాలు కార్తికి గోన్‌సాల్వెస్‌, నిర్మాత గునీత్‌ మోగ్న.. అవార్డులను అందుకున్నారు. భారత తొలి ఆస్కార్‌ విజేత ఎవరు? ఇప్పటి వరకు ఎంతమందికి వచ్చిందంటే?

భారత తొలి ఆస్కార్‌గా విజేతగా..

భారత తొలి ఆస్కార్‌ విజేతగా భాను అథైయా (Bhanu Athaiya) చరిత్ర పుటల్లో నిలిచారు. 1983లో నిర్వహించిన 55వ ఆస్కార్‌ వేడుకల్లో ఆమె ఆ పురస్కారం స్వీకరించారు. 1982లో విడుదలైన ‘గాంధీ’ సినిమాకిగానూ బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌ విభాగంలో ఆ ప్రతిష్ఠాత్మక అవార్డును ఆమె అందుకున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జీవితాధారంగా తెరకెక్కిన ఆంగ్ల చిత్రమది. దర్శకుడు సహా ఎక్కువమంది ఇంగ్లాండ్‌ వారు ఈ సినిమాకి పని చేశారు. భానుతోపాటు కొందరు భారతీయులు ఆ ప్రాజెక్టులో భాగమయ్యారు. ఇంగ్లాండ్‌కు చెందిన జాన్‌ మొల్లో, భాను అథైయా సంయుక్తంగా ‘గాంధీ’ చిత్రానికి కాస్ట్యూమ్‌ డిజైనర్లుగా వ్యవహరించి, ఆస్కార్‌ పొందారు. మహారాష్ట్రలోని కొల్హాపుర్‌లో 1929 ఏప్రిల్‌ 28న జన్మించారు. ఆమె అసలు పేరు భానుమతి అన్నాసాహెబ్‌ రాజోపాధ్యాయ్‌. తన తండ్రి పలు సినిమాలకు ఫొటోగ్రఫీ చేయడంతో భానుకు కళలపై ఆసక్తి పెరిగింది. ఆర్టిస్ట్‌ అయ్యేందుకు ముంబయిలోని ‘జె. జె. స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌’లో విద్యనభ్యసించారు.

అక్కడ ఆమె రూపొందించిన ‘లేడీ ఇన్‌ రెస్పాన్స్‌’ అనే ఆర్ట్‌ వర్క్‌కు 1951లో ఉషా దేశ్‌ముఖ్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించారు. ఆ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకుంటూనే ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే ‘ప్రోగ్రెసివ్‌ ఆర్టిస్ట్స్‌ గ్రూప్‌’లో ఓ సభ్యురాలు అయ్యారు.  ‘ఈవ్స్‌ వీక్లీ’, ‘ఫ్యాషన్‌ అండ్‌ బ్యూటీ’వంటి ఉమెన్స్‌ మ్యాగజైన్స్‌కు ఫ్రీలాన్సర్‌గా పని చేశారు. భాను ప్రతిభను మెచ్చిన ఈవ్స్‌ మ్యాగజైన్‌ ఎడిటర్‌ ఆమెను కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా మారితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ మాటను ఆచరణలో పెట్టిన భాను 1956లో తెరకెక్కిన ‘సీఐడీ’ చిత్రంతో కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ‘ప్యాసా’, ‘మీరా’, ‘సుహాగ్‌’, ‘షాలీమార్‌’, ‘అబ్‌ క్యా హోగా’, ‘ఆక్రమణ్‌’, ‘గాంధీ’, ‘లగాన్‌’, ‘లేకిన్‌’సహా 100కిపైగా సినిమాల్లోకి విభిన్న పాత్రలకు తనదైన మార్క్‌ కాస్ట్యూమ్స్‌ను రూపొందించి, పలు జాతీయ అవార్డులు అందుకున్నారు. అనారోగ్య సమస్యతో 91 ఏళ్ల వయసులో 2020 అక్టోబరు 15న ఆమె మరణించారు.

ఆ పురస్కారం అందుకున్న ఏకైక భారతీయుడు..

భారత చలనచిత్ర జగత్తు దశను, దిశను మార్చిన దర్శక దిగ్గజం సత్యజిత్‌ రే (Satyajit Ray). ‘పథేర్‌ పాంచాలి’, ‘అపరాజితో’, ‘పరశ్‌ పాథర్‌’, ‘దేవి’, ‘అపూర్‌ సన్‌సార్‌’, ‘కాంచన్‌జంగా’, ‘చారులత’సహా 36 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. స్కీన్ర్‌ ప్లే రచయిత, కథారచయిత, ఎడిటర్, సినిమాటోగ్రాఫర్, సంగీత దర్శకుడు, చిత్రకారుడు, కళా దర్శకుడు, కథలు, వ్యాసాలు, నవలలు రాసిన సాహిత్యకారుడు.. ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి విభాగంలో ఆయన నిష్ణాతుడు. సినీ రంగానికి సత్యజిత్‌ రే చేసిన విశేష సేవలను గుర్తించిన ‘అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్’ 1992లో ఆయనకు ఆనరరీ అవార్డు (గౌరవ పురస్కారం)ను ప్రకటించింది. అనారోగ్య కారణంగా వేడుకల్లో పాల్గొనలేకపోయిన సత్యజిత్‌రేకు ఆయన చికిత్స పొందిన కోల్‌కతాలోని ఆస్పత్రిలోనే ఆస్కార్‌ను అందించింది అకాడమీ . ఈ ఆనరరీ అవార్డు పొందిన ఏకైక భారతీయుడు ఆయనే. 1992 ఏప్రిల్‌ 23న ఆయన కన్నుమూశారు.

1992 తర్వాత 2009లోనే..

1992 తర్వాత భారతీయులు ఆస్కార్‌ను అందుకోవడానికి దాదాపు 17 ఏళ్లు పట్టింది. 2009లో జరిగిన 81వ ఆస్కార్‌ వేడుక ఆ లోటును భర్తీ చేసింది. విశేషం ఏంటంటే.. ఒకట్రెండు కాదు ఏకంగా మూడు ఆస్కార్‌ అవార్డులను ముగ్గురు భారతీయులు అందుకున్నారు. అది కూడా ఒకే సినిమాకి! అదే ‘స్లమ్‌డాగ్‌ మిలీనియర్‌’. ఈ చిత్రానికిగానూ ‘బెస్ట్‌ సౌండింగ్‌ మిక్సింగ్‌’ కేటగిరీలో రసూల్‌ (Resul Pookutty).. రిచర్డ్‌ ప్రైక్‌, ఇయాన్‌ ట్యాప్‌తో కలిసి ఆస్కార్‌ పురస్కారం స్వీకరించారు. 1971 మే 30న కేరళలోని కొల్లాం జిల్లా విళక్కుపర గ్రామంలో రసూల్‌ జన్మించారు. స్వగ్రామంలో పాఠశాల లేకపోవడంతో ఆయన ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి, పక్క గ్రామం స్కూల్‌లో పాఠాలు నేర్చుకునేవారట. అప్పటికి తమ గ్రామానికి విద్యుత్తు సౌకర్యంలేకపోవడంతో దీపం వెలుగులోనే చదువు సాగించారు. 1990లో కేరళలోని ఓ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందిన రసూల్‌ తండ్రి కోరిక మేరకు తిరువనంతపురంలోని ‘లా’ కాలేజీలో చేరారు. ఎల్‌. ఎల్‌. బి. ని మధ్యలోనే వదిలేసి, సౌండింగ్‌పై ఉన్న ఇష్టంతో పుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి తగిన శిక్షణ పొందారు. అనంతరం, లా కోర్స్‌ను పూర్తిచేశారు. ‘ముసాఫిర్‌’ (హిందీ) సినిమాతో 2004లో సినీ కెరీర్‌ను ప్రారంభించిన రసూల్‌ తమిళ్‌, మలయాళం, కన్నడ, తెలుగు (పుష్ప, రాధేశ్యామ్‌) చిత్రాలకు సౌండ్‌ మిక్సింగ్‌ చేశారు.

బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌లో..

గేయ రచయిత, కవి, స్క్రీన్‌ రైటర్‌, దర్శకుడు, నిర్మాతగా భారతీయ సినీ ప్రేక్షకులందరికీ సుపరిచితులు గుల్జార్‌ (Gulzar). ఎక్కువగా సాహిత్యంతో అలరించే ఆయన 1934 ఆగస్టు 18న పంజాబ్‌లో జన్మించారు. ‘బాందిని’తో 1963లో లిరిసిస్ట్‌గా జీవితాన్ని మొదలుపెట్టిన గుల్జార్‌ వందకుపైగా చిత్రాలకు సూపర్‌ హిట్‌ పాటలను అందించారు. వాటిల్లోని ఒకటైన ‘జయహో’ (స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌) బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఎంపికై, ఆయనకు ఆస్కార్‌ను అందించింది.

రెండు విభాగాల్లో రెహమాన్‌..

సంగీత ప్రియులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు ఎ. ఆర్‌. రెహమాన్‌ (A R Rahman). రెండు అకాడమీ అవార్డులు గెలుచుకున్న తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ చిత్రానికిగానూ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ (జయహో), బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగాల్లో ఆయన ఆస్కార్‌ అందుకున్నారు. 1967 జనవరి 6న మద్రాసులో జన్మించిన రెహమాన్‌ చిన్నతనంలోనే సంగీతానికి ప్రభావితమై ఆ దిశగా అడుగులు వేశారు. ‘రోజా’తో సంగీత దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన భారతీయ సినిమాలతోపాటు హాలీవుడ్‌ చిత్రాలకు స్వరాలు సమకూర్చి, విశేష అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని