Coda: బధిరులకూ వినిపించే గానం‘

కొడా’ చిత్రం 2014లో వచ్చిన ఫ్రెంచ్‌ చిత్రం ‘లా ఫ్యామిలీ బిలియర్‌’ చిత్రానికి రీమేక్‌. 2021   జనవరి 28న ఆపిల్‌ టీవీలో విడుదలైంది. అమెరికన్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆ ఏడాది గుర్తించిన పది ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

Updated : 30 Mar 2022 07:52 IST

పాడే ప్రతిభ ఉంటే... బధిరులకైనా గానం వినిపించవచ్చు ... అని చాటుతుంది రూబీ రోసి పాత్ర.


వినే మనసుంటే... చెవిటి వాళ్లైనా సంగీతంతో పరవశించవచ్చు... అని నిరూపిస్తుంది ఫ్రాంక్‌ రోసి కుటుంబం.


లక్ష్యం నెరవేర్చుకోవాలన్న తపన, అందుకు తగ్గ ప్రతిభ మన దగ్గర ఉంటే ఆటంకాలు ఎన్ని వచ్చినా అధిగమించవచ్చునని చెబుతుంది ‘కొడా’ చిత్రం.


ఆస్కార్‌ ఉత్తమ చిత్రంతోపాటు.. అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే, సహాయ నటుడు పురస్కారాలు సొంతం చేసుకున్న ఈ సినిమా కథేంటో... దాని నేపథ్యమేంటో ఓ సారి చదవండి.


కొడా’ చిత్రం 2014లో వచ్చిన ఫ్రెంచ్‌ చిత్రం ‘లా ఫ్యామిలీ బిలియర్‌’ చిత్రానికి రీమేక్‌. 2021   జనవరి 28న ఆపిల్‌ టీవీలో విడుదలైంది. అమెరికన్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆ ఏడాది గుర్తించిన పది ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. స్వయంగా స్క్రీన్‌ప్లే రచయిత అయిన సాన్‌ హెయిడర్‌ ఈ చిత్రాన్ని రూపొందించింది. ఇందులో రూబీ పాత్ర  పోషించిన ఎమిలియా నటియే గాక, గాయని, పాటల రచయిత కావడంతో ఈ పాత్ర   సినిమాలో ఎంతోబాగా పండింది. ఫ్రాంక్‌గా నటించిన ట్రాయ్‌ కాట్సర్‌ నిజంగానే బధిరుడు కావడం గమనార్హం. మనసును కరిగించే భావోద్వేగాలను పండించి ఉత్తమ సహాయ నటుడిగా నిలిచాడీయన. అమెరికా సైన్‌ లాంగ్వెజ్‌లో ఎక్కువగా సంభాషణలు సాగే ఈ చిత్రాన్ని అక్కడి బధిర సంఘాల వారూ చూసి... ప్రశంసించడం గర్వకారణమని హెయిడర్‌ చెప్పింది.

కథ: మాంచెస్టర్‌లో చేపల వేటతో జీవనం సాగించే ఓ కుటుంబ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఆ కుటుంబ పెద్ద ఫ్రాంక్‌ రోసి(ట్రాయ్‌ కాట్సర్‌), ఆయన భార్య జాకీ(మార్టీ మాట్లిన్‌). వీరికి ఇద్దరు పిల్లలు. వారిలో లియో(డేనియల్‌) అబ్బాయి కాగా, రూబీ(ఎమిలియా జోన్స్‌) అమ్మాయి. ఈ కుటుంబంలో రూబీ తప్ప మిగతా ముగ్గురికి వినపడదు. మాట్లాడలేరు. వాళ్లింట్లో సంజ్ఞలతో మాట్లాడుకుంటూ ఉంటారు. రూబీ లేకుండా ఆ కుటుంబం చేపల వేటకు వెళ్లలేదు.

ఈ కథ మొత్తం రూబీ కేంద్ర బిందువుగా సాగుతుంది. రూబీకి గానమంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా మంచి గాయనిగా పేరుతెచ్చుకోవాలని తపిస్తుంటుంది. ఆమె చదివే కళాశాలలో ప్రొఫెసర్‌ మిస్టర్‌ వి(దెర్‌బజ్‌) రూబీలోని ప్రతిభ గుర్తించి ప్రోత్సహిస్తారు. బర్క్‌లీ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌కు ఆమెను పంపాలని అనుకుంటాడు. అందుకు ఆమెకు మైల్స్‌(ఫెర్డియా వాష్‌)తో స్నేహం చేయిస్తాడు. మైల్స్‌ రూబీని ప్రేమిస్తుంటాడు. ఇద్దరూ కలిసి సాధన చేస్తుంటారు. ఓ సారి రూబీ సాధనలో నిమగ్నమై ఉంటుంది. అప్పుడే ఫ్రాంక్‌, లియో సముద్రంలో వేటకు వెళతారు. అక్కడ కోస్ట్‌ గార్డ్‌లు మోగించే హారన్‌ వినపడక, రేడియో సిగ్నల్స్‌ను అర్థం చేసుకోక... నిబంధనలు అతిక్రమిస్తారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన స్థానిక ప్రభుత్వం వారి జైలుకు పంపుతుంది. రూబీ వెళ్లి వారి పరిస్థితిని వివరించి తన కుటుంబాన్ని విడిపిస్తుంది. ఇక తర్వాత తను సంగీత సాధనకు వెళ్లకుండా... చేపల వేటకు వెళుతుంది. లియో దీన్ని వ్యతిరేకించినా వినదు. రూబీలోని ప్రతిభను చెవిటి వారైన ఆ కుటుంబ సభ్యులు ఎప్పుడు, ఎలా తెలుసుకున్నారు? రూబీని వారు ప్రోత్సహించారా? రూబీ తన లక్ష్యం చేరుకుందా? లేదా? అనేది మిగతా కథ.

సంజ్ఞలతో పాడి...

ఓ సారి రూబీ ఓ స్టేజి దగ్గర పాట పాడితే... ప్రేక్షకులంతా చప్పట్లతో ఆమెను అభినందిస్తారు. దీన్ని కళ్లారా చూసిన ఫ్రాంక్‌ పొంగిపోతాడు. కూతురి ప్రతిభను ఇన్నిరోజులూ గుర్తించలేని తండ్రిగా ఫ్రాంక్‌ పాత్రలో నటించిన ట్రాయ్‌ కాట్సర్‌ నటన ప్రేక్షకులనే కాదు... విమర్శకులనూ మెప్పిస్తుంది. ప్రేక్షకుల హావభావాలను చూస్తూ... తన కూతురి గానాన్ని అర్థం చేసుకొనే తండ్రిగా అతను ప్రదర్శించే నటన అద్భుతం అనకుండా ఉండలేం. అందుకే 94వ ఆస్కార్‌ పురస్కారాల్లో ఉత్తమ సహాయ నటుడిగా నిలిచారు. ఎన్ని కష్టాలొచ్చినా తన కూతురిని బర్క్‌లీ కాలేజీ ఆఫ్‌ మ్యూజిక్‌కు పంపాలని ఆ కుటుంబం పడే ఆతృత.. అదే సందర్భంలో రూబీ లేకపోతే చేపల వేట, వ్యాపారం ఎలా అన్న సంఘర్షణను ట్రాయ్‌ కాట్సర్‌ సునాయసంగా పండించారు.

* సినిమా క్లైమాక్స్‌ పండే భావోద్వేగాలు ఎవ్వరి మనసులనైనా కరిగిస్తాయి. బర్క్‌లీ స్టేజీ మీద రూబీ పాట పాడుతుంటే... తన కుటుంబ సభ్యులు ఎక్కడో బాల్కనీలో ఉంటారు. అమ్మా, నాన్నలు, అన్నకు అర్థమయ్యేలా పాడాలనుకున్న రూబీ... సంజ్ఞల ద్వారా భావాన్ని చూపుతూ... గానంతో న్యాయనిర్ణేతలను కట్టిపడేసే సన్నివేశం భావోగ్వేగ భరితంగా సాగుతుంది. హృదయాన్ని హత్తుకునే ఇలాంటి సన్నివేశాలను తెరకెక్కించినందుకు ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే విభాగంలో దర్శకురాలు సాన్‌ హెయిడర్‌ ఈ ఏడాది ఆస్కార్‌ అందుకుంది. భావోద్వేగాలను ఒడిసిపట్టిన సినిమాటోగ్రఫీ, సన్నివేశాలకు అనుగుణంగా సాగిన సంగీతం మన మనసుల్లో చెరగని ముద్ర వేస్తాయి.


కుటుంబమే లక్ష్య సాధనకు ఆటంకంగా మారిందని కొందరి భావన. అలాంటి భావనను మనసులోంచి తుడిచేసే చిత్రం ‘కొడా’. అనుబంధాలే మనల్ని విజయ తీరాలకు నడిపిస్తాయని చెబుతుందీ సినిమా.


చిత్రం: కొడా
దర్శకత్వం: సాన్‌ హెయిడర్‌
నటీనటులు: ఎమిలియా జోన్స్‌, దెర్‌బజ్‌, మార్లీ మాట్లిన్‌, ట్రాయ్‌ కాట్సర్‌, డేనియల్‌ తదితరులు
సినిమాటోగ్రాఫర్‌: పాల్‌ హెడోబ్రో
సంగీతం: మారిస్‌ డి వ్రైస్‌
విడుదల: జనవరి 28, 2021
నిడివి: 111 నిమిషాలు
బడ్జెట్‌: 10 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని