Oscars 2023: ఆస్కార్‌.. 95 ఏళ్ల చరిత్రను తిరగరాసేలా

ఆస్కార్‌ (Oscars) అవార్డుల కోసం ఓటింగ్‌ పూర్తైంది. ఇందులో విజయం సాధించిన చిత్రాలను త్వరలో ప్రకటించనున్నారు. ఆయా చిత్రాలు ఈ ఏడాది ఆస్కార్‌ నామినేషన్స్‌లో తలపడనున్నాయి.

Updated : 19 Jan 2023 14:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్కార్‌ 2023 అవార్డుల (Oscars) ప్రదానోత్సవం కోసం ఓటింగ్‌ విజయవంతంగా పూర్తైంది. సుమారు 80 దేశాలకు చెందిన అకాడమీ సభ్యులు ఈ ఓటింగ్‌లో పాల్గొని తమకు నచ్చిన చిత్రాలు, నటీనటులకు ఓటు వేశారు. అయితే, ఈ ఏడాది ఆస్కార్‌ ఓటింగ్‌ మరింత ప్రాధాన్యత సొంతం చేసుకుంది. మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక మంది సభ్యులు ఈ సారి ఓటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. 95 ఏళ్ల ఆస్కార్‌ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్‌ జరగడం ఇదే తొలిసారి అని సమాచారం. ఈ మేరకు అకాడమీ సీఆర్‌ఓ బిల్ క్రామెర్ ఆనందం వ్యక్తం చేస్తూ.. అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ సభ్యులందరికీ సందేశాలు పంపించారని పలు ఆంగ్ల పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి.

ఇక, ఈ సారి అకాడమీ అవార్డుల (Academy Awards) నామినేషన్స్‌ కోసం మన దేశం తరఫు నుంచి సుమారు 10 చిత్రాలు పోటీ పడుతున్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR), ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ (The Kashmir Files), ‘కాంతార’ (Kantara), ‘విక్రాంత్‌ రోణ’ (Vikrant Rona), ‘గంగూభాయి కతియావాడి’, ‘మి వసంతరావ్‌’, ‘తుజ్యా సాథీ కహీ హై’, ‘రాకెట్రీ’, ‘ఇరవిన్‌ నిళల్‌’ వంటి చిత్రాలు ఓపెన్‌ కేటగిరిలో నిలిచాయి. వీటితోపాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 301 సినిమాలు పురస్కారాల కోసం పోటీ పడుతున్నాయి. నామినేషన్స్‌ కోసం పోటీ పడుతోన్న చిత్రాలకు జనవరి 11 నుంచి 17 వరకూ ఓటింగ్‌ నిర్వహించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ సైతం ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ నెల 24న ఆస్కార్‌కు నామినేట్‌ అయిన చిత్రాలను ప్రకటిస్తారు. మార్చి 12న ఆస్కార్‌ వేడుక జరగనుంది.

మరోవైపు ఉత్తమ అంతర్జాతీయ సినిమా కేటగిరీలో ‘లాస్ట్‌ ఫిల్మ్‌ షో’ (Last Film Show), ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) నుంచి ‘నాటునాటు’ (Naatu Naatu), ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ విభాగంలో ‘ఆల్‌ దట్‌ బ్రీత్స్‌’ (All That Breathes), ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్‌ విష్పెర్స్‌’ (the elephant whisperer) ఆస్కార్‌ షార్ట్‌ లిస్ట్‌లో ఇప్పటికే చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని