Paarijatha Parvam Review: రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్‌, శ్రద్ధాదాస్‌ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

Updated : 19 Apr 2024 11:49 IST

Paarijatha Parvam Review; చిత్రం: పారిజాత పర్వం; నటీనటులు: చైతన్యరావు, సునీల్‌, శ్రద్ధాదాస్‌, వైవా హర్ష తదితరులు; సంగీతం: రీ; ఎడిటింగ్‌: శశాంక్‌; సినిమాటోగ్రఫీ: బాల సరస్వతి; నిర్మాత: మహీందర్‌రెడ్డి, దేవేష్‌; రచన, దర్శకత్వం: సంతోష్‌ కంభంపాటి; విడుదల: 19-04-2024

చిన్న చిత్రాల సంద‌డితో ఈ వేస‌వి సీజన్ ప‌రుగులు పెడుతోంది. ఈ వారం కూడా ఓ మూడు సినిమాలు బాక్సాఫీస్ ముందుకొచ్చాయి. వాటిలో కాస్త అంచ‌నాలున్న చిత్రం ‘పారిజాత ప‌ర్వం’. ‘కీడా కోలా’తో ప్రేక్ష‌కుల్ని మెప్పించిన చైత‌న్య రావు, స్టార్ క‌మెడియ‌న్ సునీల్, శ్ర‌ద్ధా దాస్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. టీజ‌ర్‌, ట్రైల‌ర్లు ఆస‌క్తిరేకెత్తించేలా ఉండ‌టంతో దీనిపై ప్రేక్ష‌కుల చూపు ప‌డింది. మ‌రి ఈ సినిమా క‌థేంటి? ఇది ప్రేక్ష‌కుల్ని ఎంత వరకూ ఆకట్టుకుంటోందో తెలుసుకుందాం.. 

క‌థేంటంటే: హీరో కావాలన్న ల‌క్ష్యంతో భీమ‌వ‌రం నుంచి భాగ్య‌న‌గ‌రానికొస్తాడు శ్రీను (సునీల్‌). స్టూడియోల చుట్టూ కాళ్ల‌రిగేలా తిరిగినా త‌ను అనుకున్న‌ది సాధించ‌లేక‌పోతాడు. ఎలాగైనా అవ‌కాశాలు అందిపుచ్చుకోవాల‌నే ల‌క్ష్యంతో సినిమా వాళ్లు ఎక్కువ‌గా వ‌చ్చిపోయే కృష్ణాన‌గ‌ర్‌లోని ఓంకార్ బార్‌లో వెయిట‌ర్‌గా చేర‌తాడు. అక్క‌డే పార్వ‌తి (శ్ర‌ద్ధా దాస్‌) డ్యాన్స‌ర్‌గా ప‌ని చేస్తుంటుంది. ఓసారి త‌న‌కు ఆ బార్ ఓన‌ర్ నుంచి పెద్ద స‌మ‌స్య ఎదుర‌వ‌గా.. ఆమెను కాపాడ‌బోయే క్ర‌మంలో శ్రీను ఆ ఓన‌ర్‌ను చంపేస్తాడు. అప్ప‌టి నుంచి తాను బార్ శ్రీనుగా మారి సెటిల్‌మెంట్లు చేయ‌డం మొద‌లు పెడ‌తాడు. ఇత‌ని క‌థ‌నే సినిమా స్ర్కిప్ట్‌గా తీసుకొని ద‌ర్శ‌క‌త్వ ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు చైత‌న్య (చైత‌న్య రావు). అయితే, ఆ క‌థ కొంద‌రు నిర్మాత‌ల‌కు న‌చ్చినా.. చైతూ త‌న‌ ఫ్రెండ్ హ‌ర్ష (హ‌ర్ష చెముడు) హీరోగా చేస్తాడ‌నే స‌రికి వాళ్లంతా వెన‌క‌డుగేస్తుంటారు. దీంతో విసిగిపోయిన చైతూ త‌న క‌థ‌ను తానే నిర్మించాలనే నిర్ణ‌యానికొస్తాడు. అందుకు కావాల్సిన డ‌బ్బు సంపాదించ‌డానికి ఎవ‌రినైనా కిడ్నాప్ చేయాల‌నుకుంటాడు. త‌న‌ని బాగా అవ‌మానించిన నిర్మాత‌ల్లో ఒక‌రైన శెట్టి (శ్రీకాంత్ అయ్యంగార్‌)ని ల‌క్ష్యంగా చేసుకొని.. అత‌ని భార్య సురేఖ‌ (సురేఖ వాణి)ను కిడ్నాప్ చేసేందుకు రంగంలోకి దిగుతాడు. స‌రిగ్గా అప్పుడే బార్ శ్రీను గ్యాంగ్ కూడా ఆమెను కిడ్నాప్ చేసేందుకు వ‌స్తుంది. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది? వీళ్లిద్ద‌రిలో ఆమెను ఎవ‌రు కిడ్నాప్ చేస్తారు? ఈ క్ర‌మంలో చైతూ గ్యాంగ్‌కు.. బార్ శ్రీను గ్యాంగ్‌కు ఎదురైన‌ స‌వాళ్లేంటి? సినిమా చేయాల‌న్న చైత‌న్య ల‌క్ష్యం నెర‌వేరిందా?  లేదా? అన్న‌ది తెర‌పై చూసి తెలుసుకోవాలి.

ఎలా సాగిందంటే: కిడ్నాప్ చేయ‌డమూ ఓ క‌ళ‌.. అన్న‌ది ఈ చిత్ర ఉప‌శీర్షిక‌. దీన్ని బ‌ట్టి ఇందులో కిడ్నాప్ డ్రామాను ఎంత కొత్త‌గా.. ఆస‌క్తిక‌రంగా చూపించారోన‌న్న ఉత్కంఠ ప్రేక్ష‌కుల్లో క‌లుగ‌క మాన‌దు. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లను క‌ట్ చేసిన తీరును చూసి ఇందులో ఆ కిడ్నాప్ డ్రామా బాగా పండిన‌ట్లే క‌నిపించింది. కాక‌పోతే దాన్ని చూసి ఎన్నో అంచ‌నాల‌తో థియేట‌ర్ల‌లోకి అడుగు పెట్టిన ప్రేక్ష‌కుల‌కు ఇది శ‌రాఘాత‌మే. ఆరంభంలో క‌థను న‌డిపిన విధానం కాస్త కొత్త‌గా క‌నిపించినా.. అస‌లైన కిడ్నాప్ డ్రామా మొద‌ల‌య్యాక సినిమా పూర్తిగా గాడి త‌ప్పినట్లైంది. సాధార‌ణంగా ఇలాంటి డ్రామాల్లో క‌నిపించాల్సిన సంఘ‌ర్ష‌ణ‌, స‌స్పెన్స్‌, మ‌లుపులు, వేగం ఏవీ మ‌చ్చుకైనా ఉండవు. దీంతో ఏ ద‌శ‌లోనూ ప్రేక్ష‌కులు ఈ క‌థ‌తో క‌నెక్ట్ కాలేని ప‌రిస్థితి.

బార్ శ్రీను క‌థ ప‌ట్టుకొని చైతూ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌య‌త్నాలు చేయ‌డం.. ఈ క్ర‌మంలో త‌న‌కెదుర‌య్యే అవ‌మానాలు.. మ‌రోవైపు అత‌ని నేరేషన్ ద్వారా స‌మాంత‌రంగా అదే క‌థ‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయ‌డం.. ఇలా సినిమాని ఆరంభించిన తీరు ఆస‌క్తిక‌రంగానే ఉంటుంది. ఈ మ‌ధ్య‌లో స్టోరీ సిట్టింగ్స్‌లో వైవా హ‌ర్ష హీరో అని చెప్పిన‌ప్పుడ‌ల్లా నిర్మాత‌లు స్పందించే తీరు.. ఈ విష‌య‌మై హ‌ర్ష‌-చైతూకు మ‌ధ్య జ‌రిగే వాదనలు న‌వ్వులు పూయిస్తాయి. చైత‌న్య కిడ్నాప్ చేయాల‌ని ఫిక్స్‌ కావడంతో క‌థ మ‌లుపు తిరుగుతుంది. సురేఖ‌ను కిడ్నాప్ చేసేందుకు చైత‌న్య వేసే ప్లాన్ ఏమాత్రం ఆస‌క్తిరేకెత్తించ‌దు. కాక‌పోతే స‌రిగ్గా అదే స‌మ‌యానికి బార్ శ్రీను గ్యాంగ్ కూడా ఆమెనే కిడ్నాప్ చేసేందుకు రంగంలోకి దిగ‌డంతో విరామ స‌న్నివేశాలు కాస్త ఆస‌క్తిక‌రంగా మార‌తాయి. ద్వితీయార్ధంలో ఈ కిడ్నాప్ వ్య‌వ‌హారం చుట్టూ ఓ క‌న్ఫ్యూజన్‌ డ్రామాను అల్లి ప్రేక్ష‌కుల్ని న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. అది వ‌ర్కౌట్‌ కాలేదు.  అంతేకాదు, అస‌లు శ్రీను క‌థ‌లో సినిమా చేసేంత విష‌యం ఏముంద‌న్నది ఎంత‌కీ అంతుచిక్క‌దు. అందుకే ఈ క‌థ‌తో ప్రేక్ష‌కులు ఏ ద‌శ‌లోనూ క‌నెక్ట్ అవ్వ‌ని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక కిడ్నాప్ చేశాక‌.. చైతూ, శ్రీను గ్యాంగ్స్‌ శెట్టి నుంచి డ‌బ్బులు డిమాండ్ చేసే తీరు మ‌రీ సిల్లీగా అనిపిస్తుంది. క‌థ అస‌లు ఏ ద‌శ‌లోనూ సీరియ‌స్‌గా లేదు. క‌థ‌నానికి త‌గ్గ‌ట్లుగానే ముగింపు కూడా ఉసూరుమ‌నిపించేలాగే ఉంటుంది.

ఎవ‌రెలా చేశారంటే: ద‌ర్శ‌కుడ‌వ్వాల‌న్న ల‌క్ష్యంతో జీవించే కుర్రాడిగా చైత‌న్య త‌న పాత్ర‌లో స‌హ‌జంగా ఒదిగిపోయాడు. త‌న న‌ట‌న‌ను ప‌రీక్షించే సీన్స్ పెద్ద‌గా లేకున్నా.. అక్క‌డ‌క్క‌డా త‌న‌దైన కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు.  త‌న‌కు.. మాళ‌విక‌కు మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థ‌లో ఏమాత్రం ఫీల్ క‌నిపించ‌దు. వారి ట్రాక్ సినిమాకి అక్క‌డ‌క్క‌డా స్పీడ్ బ్రేక‌ర్‌లా అడ్డు త‌గులుతుంటుంది. సునీల్, హ‌ర్ష‌, శ్రీకాంత్ అయ్యంగార్‌ల పాత్ర‌లు క‌థ‌లో అక్క‌డ‌క్క‌డా న‌వ్వులు పంచే ప్ర‌య‌త్నం చేశాయి. సినిమా మొత్తంలో కాస్త కాల‌క్షేపాన్నిచ్చేది వీళ్లు ముగ్గురే. సురేఖ వాణి, స‌మీర్‌, ముర‌ళీధ‌ర్ గౌడ్ త‌దిత‌రుల పాత్ర‌ల‌న్నీ ప‌రిధి మేర ఉంటాయి. ద‌ర్శ‌కుడు సంతోష్ రాసుకున్న క‌థ‌లో లోపాలున్నాయి. స్ర్కీన్‌ప్లేలో మెరుపు లేదు. క‌థ‌లో ఎక్క‌డా బ‌ల‌మైన సంఘ‌ర్ష‌ణ క‌నిపించ‌దు. కిడ్నాప్ డ్రామా పూర్తిగా తేలిపోయింది. నేప‌థ్య సంగీతం అక్క‌డ‌క్క‌డా ఆక‌ట్టుకుంటుంది. ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. నిర్మాణ విలువ‌లు క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా ఉన్నాయి.

  • బ‌లాలు:
  • + సునీల్, వైవా హ‌ర్ష కామెడీ
  • + విరామ స‌న్నివేశాలు
  • బ‌ల‌హీన‌త‌లు:
  • - క‌థ‌, స్ర్కీన్‌ప్లే
  • - థ్రిల్ పంచ‌ని కిడ్నాప్ డ్రామా
  • - ముగింపు
  • చివ‌రిగా: పారిజాత ప‌ర్వం.. చూడ‌టానికి ఓపికుంటే న‌యం
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని