గానతంత్ర దినోత్సవం

ఏంటండీ... ఈ రోజు కొన్ని పాటలు కొత్త కిరీటాలేవో పెట్టుకున్నట్లు మురిసిపోతున్నాయి....

Published : 27 Jan 2021 11:19 IST

‘‘ఏంటండీ... ఈ రోజు కొన్ని పాటలు కొత్త కిరీటాలేవో పెట్టుకున్నట్లు మురిసిపోతున్నాయి.’’ - టీగ్లాస్‌ అందుకుంటూ నాగేశ్వరరావు ప్రశ్నించాడు.

‘‘ఈ గణతంత్రదినోత్సవం... తెలుగు సినిమా పాటకు ‘గాన’తంత్ర దినోత్సమైంది. ఎందుకంటే...? పాటల కోట ఎస్పీ బాలును పద్మవిభూషణ్‌తో గౌరవించారు. రాగాల కోయిలమ్మ చిత్రమ్మను పద్మభూషణ్‌తో సత్కరించారు.’’ - సుబ్రమణ్యం పులకిస్తూ... సమాధానమిచ్చాడు.

‘నా గొంతు శ్రుతిలోన.. నా గుండె లయలోన.. ఆడవే పాడవే కోయిలా.. పరవశించు జన్మజన్మలా!’ ... అంటూ ఎఫ్‌ఎం గొంతు సవరించుకుంది.

‘‘నిజంగానే వీరిద్దరి గాత్రాలతో పాటల ప్రేమికులు జన్మజన్మలా పరవశిస్తారండీ. బాలు పాటంటే... తెలుగు సినిమాకు రాగాల కోట. చిత్ర గానమంటే... సరిగమల బాట. పాట కోసం బాలు పడిన కష్టం... పాటంటే చిత్రకున్న ఇష్టం చూస్తే... ఎంతటి పురస్కారాలైనా ఇవ్వాలనిపిస్తుంది. కోయిలలైనా వీరి పాటలను ప్రాక్టీస్‌ చేయాల్సిందే.’’ - అక్కడే బెంచిపై కూర్చొని పేపర్‌ చదువుతున్న రామబ్రహ్మం తేల్చి చెప్పాడు.

‘రేపల్లె మళ్లీ మురళి విన్నది.. ఆ జానపదం ఝల్లుమన్నది...’ అప్పుడే అక్కడికొచ్చిన కుర్రాడి వాట్సప్‌ స్టేటస్‌ మురిసిపోయింది. ...ఒకటా రెండా... ఎన్ని పాటలండి..? ‘‘40వేలకు పైగా బాలు, 26వేలకు దగ్గరగా చిత్ర గీతాలను తమ గాత్రాలతో అలంకరించారు. వీరి గొంతుతో... పాటకు, పాత్రలకూ ప్రాణం పోసి... మన హృదయాల్లో ముద్రించగల సామర్థ్యం వాళ్లేకే సొంతమండీ. అందుకే ఈ పాటలు మళ్లీ, మళ్లీ మనం వింటూనే ఉంటాం.’’ - కుర్రాడు గూగుల్‌లో వెదికి సమాచారం వాళ్లముందుంచాడు.

‘‘ఔరా అమ్మకచల్లా..ఆలకించి నమ్మడమెల్లా.. అంతవింత గాథల్లో ఆనందలాల..’’ పక్కనే ఉన్న అతను టీతాగుతూ యూట్యూబ్‌లో వింటున్నాడు. ‘‘... మనసు పులకించదా? ఈ గానాలు వింటుంటే.. చెవులు రిక్కించి ఆలకించవా ఈ పాటలు వినపడితే. వీళ్లకు ఇచ్చినందుకు ఆ పురస్కారాలే పరవశిస్తాయండీ.’’ - తాగేసిన టీకప్పు పక్కన పెడుతూ నాగేశ్వరరావు వివరించాడు.

‘సౌందర్యలహరి... స్వప్న సుందరి’ అంటూ యువకుడు కలలుగన్నా, ‘శుభలేఖ రాసుకున్నా.. ఎదలో ఎప్పుడో...’ ప్రేమికులు మనసు పంచుకున్నా.., ‘ఝుమ్మనే తుమ్మెద రాగం...’ అని కొత్త జంటలు పాడుకున్నా, ‘ఎన్నెన్నో అందాలు... ఏవేవో రాగాలు’ అంటూ ఆరాధకులు పరవశించినా,  వీరిద్దరూ పాడిన పాటలు... ఇలా మనందరి జీవితాల్లో భాగమైపోయాక... పాటల ప్రేమికుల హృదయాల్లో వీరికి వేసిన సింహాసనం ముందు ఎన్ని పురస్కారాలిచ్చినా తక్కువేనండి. - టీ బంకు యజమాని రాజేశ్వరరావు ముక్తాయించాడు.

గౌరవానికి ఎంతో అర్హులు: చిరు

ఎస్పీ బాలుకి పద్మవిభూషణ్‌ గౌరవం పట్ల ప్రముఖ కథానాయకుడు చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఈ గౌరవానికి ఎంతో అర్హులైనవారని ట్విటర్‌ ద్వారా వ్యాఖ్య చేశారు. ‘‘నా ప్రియమైన సోదరుడు ఎస్పీ బాలు గారికి పద్మవిభూషణ్‌ ప్రకటించినందుకు సంతోషంగా ఉంది.  బ్రాకెట్‌లో ‘మరణానంతర’ అనే పదం చూడటమే బాధగా అనిపించింది. ఆయన ఈ పురస్కారం స్వీకరించడానికి వ్యక్తిగతంగా ఇక్కడ ఉండాల్సింద’’ని ట్వీట్‌ చేశారు చిరంజీవి. పవన్‌కల్యాణ్‌, దేవిశ్రీప్రసాద్‌తో పాటు పలువురు సినీ ఎస్పీ బాలుకి పద్మవిభూషణ్‌ గౌరవం పట్ల సంతోషం ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని