padutha theeyaga: ‘పాడుతా తీయగా’ 19వ సీజన్ ప్రత్యేకతలివే..!

సంగీతంతో ఎస్పీ బాలు(SP Balu)ది ఎన్నెన్నో జన్మల బంధం. అది ఎన్నటికీ వీడని రాగబంధం. పరిమళ గంధం. గంధర్వులే

Updated : 14 Nov 2021 07:19 IST

సంగీతంతో ఎస్పీ బాలు(SP Balu)ది ఎన్నెన్నో జన్మల బంధం. అది ఎన్నటికీ వీడని రాగబంధం. పరిమళ గంధం. గంధర్వులే ఆవహించారేమో అన్నట్టు ఆయన పాడతారు. పాడటమే కాదు వేలమంది యువగాయకుల స్వరమై నిలిచారు. 1996లో ఈటీవీలో ప్రారంభమైన ‘పాడుతా తీయగా’(Padutha Theeyaga) బాలు మానస పుత్రిక. దక్షిణ భారత దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ‘పాడుతా తీయగా’(Padutha Theeyaga) అనేకమంది గాయకులను ప్రపంచానికి పరిచయం చేసింది. తెలుగు సినీ నేపథ్యగానానికి యువ ప్రతిభావంతులను అందించిన ఏకైక వేదిక బాలు గారి సారథ్యంలో సాగిన ఈటీవీ పాడుతా తీయగా(Padutha Theeyaga) దక్షిణ భారతంలోనే మొట్టమొదటి సంగీత ఆధారిత రియాలిటీ షో.

తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల నుంచి కూడా అద్భుత గాయకులను వెలుగులోకి తెచ్చిన ఘనత పాడుతా తీయగా ఖండాంతరాలకు వ్యాపించి ఇతరదేశాల్లోనూ దీనిని నిర్వహించటం విశేషం. తెలుగుసినీ సంగీతాన్ని ఉత్తేజితం చేసిన గాయనీ, గాయకులు, సంగీత దర్శకులు ఉష, హేమచంద్ర, కారుణ్య, రామాచారి, మాళవిక, కౌసల్య, స్మిత, కె.ఎం.రాధాకృష్ణ, గోపికా పూర్ణిమా, సాహితి, దామిని, మల్లిఖార్జున్ వంటి ఎందరో తాము ఈటీవీ పాడుతా తీయగా(Padutha Theeyaga) ద్వారానే వెలుగులోకి వచ్చామని గర్వంగా చెప్పుకుంటారు. అలా 18 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం తొలిసారి బాలు పరోక్షంలో ఆయన లేకుండా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆయన వారసుడు ఎస్పీ చరణ్(SP Charan) బాలు గారి సారథ్య బాధ్యతలను స్వీకరించారు. ఈటీవీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు అందుకు ప్రతీకగా మైకును ఇటీవల జరిగిన బాలు ప్రథమ వర్థంతి సభలో చరణ్‌ చేతికి అందించారు. గతంలో బాలు గారు ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చరణ్ ఈసారి స్వయంగా తన భుజాలపై వేసుకుని 19వ సీజన్‌ను నడిపించటం విశేషం.

కరోనా దృష్ట్యా ఈటీవీ నిర్వహించిన ఆన్‌లైన్‌ ఆడిషన్స్‌లో 4వేలమంది గాయనీగాయకులు పాల్గొన్నారు. వాటి అన్నింటినీ వడపోసి 16మందిని 19వ సీజన్‌కు ఎంపిక చేశారు న్యాయనిర్ణేతలు. యంగ్‌ టాలెంట్‌ను గుర్తించటానికి ఈ కార్యక్రమానికి ముగ్గురు ప్రముఖ సెలబ్రిటీలు జడ్జిలుగా వ్యవహరిస్తారు. అద్భుతకలంతో హృదయాన్ని మీటే పాటలు రాసిన చంద్రబోస్(Chandra bose), తీయనైన తేనెలాంటి స్వరంతో అలరించే మధురగాయని సునీత(sunitha), ఆస్కార్ అవార్డు అందుకున్న జయహో గీతాలాపన చేసిన వారిలో ఒకరైన యువకెరటం విజయ్ ప్రకాష్‌(vijay prakash)లు పాడుతా తీయగా 19వ సీజన్ జడ్జిలుగా వ్యవహరిస్తారు. బాలు ప్రాణంపోసిన ఆయన మానస పుత్రిక ఈటీవీ పాడుతా తీయగా(Padutha Theeyaga) ద్వారా మధుర తుషారాలు మనసును తాకుతాయి. మధువనాలు మళ్లీ పూస్తుంటాయి. బాలు దీవెనలతో ఆయన రాగరంజిత గానం మన హృదయాల్లో ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రేక్షకలోకం పరవశిస్తూనే ఉంటుంది.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని