HBD Prabhas: ఆరడుగుల ప్రభంజనం..ప్రభాస్‌

రూ.వందకోట్లకే పరిమితమైన టాలీవుడ్‌ మార్కెట్‌ను రూ. 2 వేల కోట్లకు చేర్చి తెలుగోడి సత్తాని సగర్వంగా చాటిన యువ తరంగం ప్రభాస్‌.

Updated : 23 Oct 2021 10:18 IST

‘ఈశ్వర్‌’తో గల్లీకుర్రాడిగా తెలుగుతెరకు పరిచయమైన ప్రభాస్‌... ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలందుకొని పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. లవర్‌బాయ్‌గా, అమ్మాయిల కలల రాకుమారుడిగా, మాస్‌ హీరోగా, అమరేంద్ర బాహుబలిగా ఇలా పలు పాత్రలతో వైవిధ్యాన్ని కనబరిచాడు. రూ.వందకోట్లకే పరిమితమైన తెలుగు చిత్ర పరిశ్రమ మార్కెట్‌ను రూ.2 వేల కోట్లకు చేర్చి తెలుగోడి సత్తాని సగర్వంగా చాటిన యువ తరంగం ప్రభాస్‌. బాలీవుడ్‌ స్టార్‌ సినిమాలకు లేనంత బడ్జెట్‌తో నాలుగైదు భారీ ప్రాజెక్టులు ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్నాయి. వాటి బడ్జెట్‌ మొత్తం కలిపి రూ.2 వేల కోట్లకు పైమాటే. ఇవాళ యంగ్‌ రెబల్‌ స్టార్‌ పుట్టిన రోజు. పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగే క్రమంలో ఆయన జీవితంలోని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

హీరో కాకుంటే రెస్టారెంట్‌

ప్రభాస్‌ భోజన ప్రియుడన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయనిచ్చే ఆతిథ్యం గురించి ఇండస్ట్రీ గొప్పగా చెప్పుకొంటుంది. సినిమా సెట్లకి ప్రభాస్‌ ఇంటి నుంచి భారీగా క్యారేజీలు వెళ్తుంటాయి.  హీరో కాకుంటే ఎంచక్కా మంచి హోటల్‌ లేదా రెస్టారెంట్‌ని ఏర్పాటు చేసుకునేవాడినని ప్రభాస్‌ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు.  పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన తర్వాత కూడా సినిమా బృందానికి ఆతిథ్యమివ్వడం వదిలిపెట్టలేదు.  ప్రభాస్‌ ఇంటి భోజనమంటే బాలీవుడ్‌ ప్రముఖులు కూడా లొట్టలేసుకునేలా చేస్తున్నాడు‌. 


భక్త కన్నప్ప చూసి స్ఫూర్తి

చిన్నప్పటి నుంచి నటుడవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు.  ప్రభాస్‌ అందం, ఎత్తు చూసి చాలామంది ఆయన్ను ‘హీరో... హీరో’ అని పిలిచేవారట. అలా పిలిచినప్పుడైనా నటుడవ్వాలన్న ఆలోచన రాలేదు. సినిమా షూటింగ్‌లకు చూసేందుకు వెళ్లినప్పుడు..హీరో కావడం అంత సులువు కాదనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది.  వెంటనే హీరో అవ్వాలనే ఆలోచన విరమించుకున్నాడు. షూటింగ్‌లో వందల మంది ముందు ఎలా నటిస్తారోనన్న భయం కూడా ఏర్పడింది. వాళ్ల పెద్దనాన్న స్ఫూర్తితోనే సినిమాలపై ఆసక్తి పుట్టింది. పెదనాన్న కృష్ణంరాజుకి ప్రభాస్‌ వీరాభిమాని. దర్శకుడు బాపుతో కృష్ణంరాజు చేసిన ‘భక్తకన్నప్ప’, ‘మనవూరి పాండవులు’ చూసి తను కూడా పెదనాన్నలా హీరోలా అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అలా సినిమాల్లోకి రావాలనే ఆలోచన పెదనాన్న సినిమాలు చూడటంతో మొదలైంది. 


వర్షం ఫ్లాపేమోనని నిరాశ

మొదటి సినిమా ‘ఈశ్వర్‌’తోనే ప్రభాస్‌కి హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. అరంగేట్ర చిత్రమైనా నటన, హావభావాలతో ఆకట్టుకున్నాడనే ప్రశంసలు దక్కాయి. అయితే హిట్టు మాత్రం దక్కలేదు. ఆ తర్వాత చేసిన ‘రాఘవేంద్ర’ కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. మొదటి రెండు సినిమాలు పరాజయం కావడంతో మూడో సినిమాని జాగ్రత్తగా పట్టాలెక్కించాడు. మంచి ఫీల్‌గుడ్‌ ప్రేమకథ ‘వర్షం’తో ప్రేక్షకులను పలకరించాడు.  మొదటి రోజు ‘సినిమా జస్ట్‌ ఓకే’ అనే కామెంట్‌ వినిపించింది. దీంతో ఇది కూడా ఫ్లాపేనా అని నిరుత్సాహానికి గురయ్యాడు. క్రమంగా ‘వర్షం’ కలెక్షన్లు పుంజుకున్నాయి. కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వరుసకట్టారు.  విడుదలైన పదిరోజులకు సూపర్‌హిట్‌ టాక్‌ వినపడటంతో ఊపిరి పీల్చుకున్నాడు ప్రభాస్‌. ‘వర్షం’తో బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. 


తనని తానే చెక్కుకుంటూ

మొదటి రెండు సినిమాలు ఫ్లాప్స్‌. మూడో సినిమా ‘వర్షం’ సూపర్‌ హిట్‌. మళ్లీ రెండు అట్టర్‌ ఫ్లాప్స్‌. ఆ తర్వాత ‘ఛత్రపతి’తో బ్లాక్‌బస్టర్‌. ఆ తర్వాత మళ్లీ పరాజయాలే. ఇలా కెరీర్‌లో పడిపోయిన ప్రతిసారి తనను తాను చెక్కుకుంటూ విజయాలు అందుకున్నాడు. తనలోని కొత్తదనాన్ని వెలికితీస్తూ హీరోగా తనకు తానే సానబెట్టుకుని వెండితెరపై వజ్రంలా మెరిసిపోయాడు. ‘బుజ్జిగాడు’తో తెలుగుతెరపై మునునపెన్నడూ చూడని మ్యానరిజాన్ని పరిచయం చేశాడు.  ‘బిల్లా’తో తనలోని స్టైలిష్‌ నటుడిని చూపించిన ప్రభాస్‌...‘డార్లింగ్’‌, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘మిర్చి’ చిత్రాలతో కుటుంబ ప్రేక్షకులనూ మెప్పించగలనని నిరూపించాడు.  జక్కన్న  ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా తెలుగోడి సత్తా ఏంటో చాటిచెప్పాడు.


అయిదేళ్లలో ఒక్కటీ ఒప్పుకోలేదు

సినిమాకు సంవత్సరం, లేదా రెండు రెండేళ్లపాటు డేట్స్‌ ఇచ్చే స్టార్‌ హీరోలను చూశాం. ఐదేళ్లపాటు మరో సినిమాకు ఒప్పుకోకుండా నటించిన హీరో మాత్రం ప్రభాసే. ‘బాహుబలి’ కోసం జక్కన్నకి పూర్తి కాల్షీట్లు ఇచ్చేశాడు. ఆ సినిమాలకు పనిచేసిన మిగతా నటీనటులు వేరే సినిమాలు చేశారు. అనుష్క, రానాలు ఇతర చిత్రాల్లో నటించారు. ప్రభాస్‌ ఒక్కడే బాహుబలి షూటింగ్‌ మొత్తం ఒకే సినిమాకి పనిచేశాడు. ఆ కష్టం ఎక్కడికి పోలేదు. సినిమా విడుదలయ్యాక దేశవ్యాప్తంగా అభిమానులు తయారయ్యారు. పాన్‌ ఇండియా స్టార్‌గా ఎనలేని గుర్తింపు వచ్చింది. ప్రభాస్‌ కొత్త సినిమాలపై నార్త్‌ ఇండియా ప్రేక్షకులూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.  ‘రాధేశ్యామ్’‌, ‘ఆదిపురుష్’‌, ‘స్పిరిట్‌’లు ప్రకటించి సినిమా సినిమాకి తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్నాడు.  బాలీవుడ్‌ అగ్రతారలను మించిపోయే స్టార్‌డమ్‌ను దక్కించుకుంటున్న టాలీవుడ్‌ హీరో ప్రభాస్ అనడంలో సందేహం అక్కర్లేదు.


‘బాహుబలి’కి ముందే బాలీవుడ్‌కి

ప్రభాస్‌కి ఎన్నడూ లేనంత స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టిన సినిమా ‘బాహుబలి’. ఆ సినిమా తర్వాతే నార్త్‌లోనూ యంగ్‌ రెబల్‌ స్టార్‌ పేరు మార్మోగిపోయింది. తనకంటూ ప్రత్యేక అభిమానులు ఏర్పడ్డారు. అయితే ‘బాహుబలి’తోనే బాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయం కాలేదు. దీనికన్నా ముందే హిందీతెరపై కనిపించాడు.  ప్రభుదేవా తెరకెక్కించిన యాక్షన్‌ జాక్సన్‌(2014)లోని ఓ పాటలో స్టెప్పులేసి అదరగొట్టాడు. ఈ సినిమా వచ్చినప్పుడు ప్రభాస్‌కి ఉత్తరాదిన అంత గుర్తింపు లేదు. సరిగ్గా ఏడాది తర్వాత ‘బాహుబలి’గా వచ్చి ప్రభంజనం సృష్టించాడు. 


వాలీబాల్‌ ప్రియుడు

సినిమా, ఫుడ్‌లాగే ప్రభాస్‌కు వాలీబాల్ అంటే ప్రాణం. దానికోసం ఇంటి ఆవరణలోనే ప్రత్యేక మైదానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. స్నేహితులతో కలిసి తరచూ ఇక్కడే ఆటలాడుతూ కాలక్షేపం చేస్తాడు. ‘బాహుబలి’ సమయంలోనూ వాలీబాల్‌ గ్రౌండ్‌లోనే చెమటలు కక్కే కసరత్తులు చేసి ఫిట్‌గా తయారయ్యాడు. టాలీవుడ్‌కి చెందిన ప్రముఖులు కాలక్షేపం కోసం వచ్చి ప్రభాస్‌తో వాలీబాల్‌ ఆడతారని సమాచారం. 


రాజ్‌కుమార్‌ హిరాణీ, రాబర్ట్ డినీరో

కెరీర్‌ పరంగా తనను అత్యున్నత స్థానంలో నిలబెట్టిన డైరెక్టర్‌గా రాజమౌళి అంటే ప్రభాస్‌కి ఎనలేని అభిమానం. జక్కన్న తర్వాత అంత ఇష్టమైన దర్శకుడు మరొకరు ఉన్నారు. బాలీవుడ్‌ ఫీల్‌గుడ్‌ చిత్రాల దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ. ఆయన సినిమాలను అమితంగా ఇష్టపడతాడు. రాజ్‌కుమార్‌ హిరాణీ తీసిన ‘త్రీ ఇడియట్స్’, ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’ సినిమాలను ఇరవైకి పైగా సార్లు చూసినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. హాలీవుడ్‌లో దిగ్గజ నటుడు రాబర్డ్‌ డినీరో అన్నా అంతే ఇష్టం. 

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని