Pankaj Tripathi: మాజీ ప్రధాని బయోపిక్‌లో ‘మీర్జాపూర్‌’ నటుడు.. ఆ పీఎం ఎవరంటే?

‘మీర్జాపూర్‌’ వెబ్‌ సిరీస్‌తో మంచి గుర్తింపు పొందిన పంకజ్‌ త్రిపాఠి భారత మాజీ ప్రధాని పాత్రలో కనిపించనున్నారు.

Published : 18 Nov 2022 22:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మీర్జాపూర్‌’, ‘సాక్రెడ్‌ గేమ్స్‌’, ‘క్రిమినల్‌ జస్టిస్’, ‘క్రిమినల్‌ జస్టిస్‌: బిహైండ్‌ క్లోజ్డ్‌ డోర్స్‌’ తదితర వెబ్‌ సిరీస్‌లతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటుడు పంకజ్‌ త్రిపాఠి (Pankaj Tripathi). 60కిపైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించిన ఈయన త్వరలోనే భారత మాజీ ప్రధానమంత్రి గెటప్పులో కనిపించనున్నారు. అటల్‌ బిహారి వాజ్‌పేయీ బయోపిక్‌లో ఆయన టైటిల్‌ పాత్రలో నటిస్తున్నారు. వాజ్‌పేయీ (Atal Bihari Vajpayee) జీవితకథను తెరపైకి తీసుకొస్తున్నామని బాలీవుడ్‌ నిర్మాతలు వినోద్‌ భానుషాలి, సందీప్‌ సింగ్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దర్శకుడు, నటుడు వివరాలను వెల్లడించారు. ఈ సినిమాలో పంకజ్‌ ప్రధాన పాత్రధారికాగా రవి జాదవ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘మై రహూ.. యా నా రహూ.. యే దేశ్‌ రెహనా చాహీయే అటల్‌’ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా ‘ది అన్‌టోల్డ్‌ వాజ్‌పేయీ: పొలిటీషియన్‌ అండ్‌ పారడాక్స్‌’ అనే పుస్తకాధారంగా రూపొందుతోంది. వాజ్‌పేయీ 99వ జయంతి సందర్భంగా 2023 క్రిస్మస్‌కు విడుదలకానుంది.

పంకజ్‌ మాట్లాడుతూ.. ‘‘గొప్ప రాజకీయ నాయకుడి పాత్రలో నటించే అవకాశం నాకు రావడం గౌరవంగా భావిస్తున్నా. వాజ్‌పేయీ పొలిటీషియన్‌ మాత్రమే కాదు అంతకుమించి. ఆయన మంచి రచయిత, కవి’’ అని అన్నారు. ‘చిగురిడ కనసు’ అనే కన్నడ సినిమాలో చిన్న రోల్‌తో కెరీర్‌ను ప్రారంభించిన ఒక్కో మెట్టు ఎక్కుతూ పంకజ్‌ జాతీయ అవార్డు అందుకున్నారు. ఎక్కువగా హిందీ సినిమాలు చేసిన ఆయన ‘దూసుకెళ్తా’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ‘మీర్జాపూర్‌’ సిరీస్‌తో బాగా దగ్గరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు