Parampara 2 Review: రివ్యూ: పరంపర సీజన్‌ 2

నవీన్‌ చంద్ర, జగపతిబాబు తదితరులు నటించిన ‘పరంపర 2’ సిరీస్‌ ఎలా ఉందంటే...

Published : 22 Jul 2022 16:14 IST

Parampara Season 2 Review: వెబ్‌ సిరీస్‌: పరంపర సీజన్‌ 2; నటీనటులు: నవీన్‌ చంద్ర, జగపతి బాబు, శరత్‌ కుమార్‌, ఇషాన్‌, ఆమని, ఆకాంక్ష సింగ్‌, నైనా గంగూలీ తదితరులు; నేపథ్య సంగీతం: నరేశ్‌ కుమరన్‌; ఛాయాగ్రహణం: ఎస్‌.వి.విశ్వేశ్వర్‌; కూర్పు: తమ్మిరాజు; నిర్మాణ సంస్థ: ఆర్కా మీడియా వర్క్స్‌; కథ: హరి యెల్లేటి; దర్శకత్వం: కృష్ణ విజయ్‌ ఎల్‌, విశ్వనాథ్‌ అరిగెల, హరి యెల్లేటి; స్ట్రీమింగ్‌: ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’.

గతేడాది విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు వెబ్‌ సిరీస్‌ల్లో ‘పరంపర’ (Parampara) ఒకటి. మురళీ మోహన్‌, శరత్‌ కుమార్‌, జగపతి బాబు, ఆమని, నవీన్‌ చంద్ర.. ఇలా ప్రముఖ సినీ తారలు నటించడం, ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఆర్కా మీడియా వర్క్స్‌’ నిర్మించడంతో ఈ సిరీస్‌పై మొదటి నుంచీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే తెరకెక్కిన సీజన్‌ 1 అలరించింది. దానికి కొనసాగింపుగా తెరకెక్కిన సీజన్‌ 2 ప్రస్తుతం ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో (Disney+ Hotstar) స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి, ఇందులో కొత్త పాత్రలు ఏమున్నాయ్‌? అసలు సీజన్‌ 2 ఎలా ఉంది? (Parampara Season 2) తెలుసుకోవాలనుంటే ఇది చదివేయండి. (Review)

కథేంటంటే: సీజన్‌ 2 కథ తెలుసుకునేందుకు ముందు సీజన్‌ 1 స్టోరీపై ఓ లుక్కేద్దాం. చింతలపూడి వీరనాయుడు (మురళీ మోహన్) రాజకీయ నాయకుడు. అతని తనయుడు నాగేంద్ర నాయుడు (శరత్‌ కుమార్‌) (Sarath Kumar), దత్త పుత్రుడు మోహన్‌రావు (జగపతి బాబు) (Jagapathi Babu). వీరనాయుడు రాజకీయ వారసుడిగా మోహన్‌రావు ఎక్కడ ప్రజల మన్ననలు పొందుతాడోనని నాగేంద్ర నాయుడు లోలోపల మథన పడుతుంటాడు. అన్నీ తనకు దక్కేలా ప్రణాళికలు రచిస్తుంటాడు. తన నాన్నని చిన్నచూపు చూస్తుండటంతో గోపి (నవీన్‌ చంద్ర) (Naveen Chandar) నాగేంద్ర నాయుడుపై వైరం పెంచుకుంటాడు. ఈ సంఘర్షణల కారణంగా గోపి తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి దూరం అవడవంతో సీజన్‌ 1 పూర్తవుతుంది. సీజన్‌ 2 విషయానికొస్తే.. గోపి ప్రేమించిన అమ్మాయిని తన కొడుకు సురేశ్‌ (ఇషాన్‌)కి ఇచ్చి పెళ్లి చేస్తాడు నాగేంద్ర నాయుడు. కోపంతో.. ఆ వేడుకలో లైసెన్స్‌ లేని మారణాయుధం (తుపాకీ) ప్రయోగించడంతో గోపి జైలు పాలవుతాడు. తోటి ఖైదీ చెప్పిన మాటలతో అప్పటి వరకూ ఉన్న కోపాన్ని అణుచుకుని, ఏ కోణంలో వెళ్తే తన తండ్రికి న్యాయం జరుగుతుందో ఆలోచించి, ఆ దిశగా స్కెచ్‌ వేస్తాడు. అక్కడే పరిచయమైన రత్నాకర్‌ (రవివర్మ) సాయంతో బెయిల్‌పై బయటకొస్తాడు. అలా వచ్చిన గోపి తన తండ్రి కోసం ఏం చేశాడు? తన బాబాయ్‌పై పగ తీర్చుకున్నాడా? అన్నది మిగతా కథ.

ఎలా ఉందంటే: ‘‘ఎప్పుడూ కొత్త కథలంటే కష్టం. కథ పాతదే అయినా విభిన్న స్క్రీన్‌ప్లే జోడిస్తే ప్రేక్షకుల్ని మెప్పించవచ్చు’’ అనేది సినీ వర్గాల్లో తరచూ వినిపించే మాట. ఈ సిరీస్‌ విషయంలో ఈ మాట వర్తిస్తుంది. ఎందుకంటే, రాజకీయం కోసం వివిధ కారణాల వల్ల అన్నదమ్ములు, వారి కొడుకులు మధ్యే వైరం రావడమనే కాన్సెప్ట్‌ చాలా సినిమాల్లో కనిపించింది. ఆ ఫార్మాటే అయినా ఇందులో ఎత్తుకుపైత్తులు వేసే క్రమం కట్టిపడేస్తుంది. సీజన్‌ 1 చూడకుండా నేరుగా సీజన్‌ 2 చూస్తే బాబాయ్‌పై గోపికి ఎందుకంత పగ, ప్రతీకారం? తన కొడుకైన గోపిని నాగేంద్ర నాయుడు ఇబ్బంది పెడుతున్నా మోహన్‌రావు ఎందుకు ఊరుకుంటున్నాడు? తదితర అంశాలు అంత త్వరగా అర్థంకాకపోవచ్చు. నవీన్‌ చంద్ర, శరత్‌ కుమార్‌.. ఇద్దరిలో నెగెటివ్‌ ఛాయలున్న పాత్ర ఎవరిదో అంత త్వరగా కనిపెట్టలేం.

తొలి భాగం 7 ఎపిసోడ్లుకాగా రెండో భాగం 5 ఎపిసోడ్లతో రూపొందింది. నిడివి, వేగం విషయంలో సీజన్‌ 1తో పోలిస్తే సీజన్‌ 2 ముందంజలో నిలుస్తుంది. ఈ విషయంలో దర్శకులు తగిన కసరత్తు చేశారనిపించింది. ఇందులోనూ తొలి రెండు ఎపిసోడ్లు సోసోగా సాగినా మూడో ఎపిసోడ్‌ నుంచి వేగం పుంజుకుంది. ఈ బాబాయ్‌ అబ్బాయిల మధ్య ‘నువ్వానేనా’ అంటూ సాగే పోటీ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తించిన ఎక్కువ సంభాషణలు ఫోన్‌కే పరిమితమయ్యాయి. తన తండ్రి/తల్లిని ఎన్నికల్లో గెలిపించేందుకు స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించడం, కొత్తగా రహదారి నిర్మించడం.. ఇలా తన ప్రణాళిక అమలు పరుస్తున్నాడని తెలుసుకున్న నాగేంద్రనాయుడు ‘‘నిన్ను రాజకీయంలోకి దించే టైమ్‌ వచ్చిందిరా’’ అంటూ తన కొడుకుతో చెప్పే సీన్‌ సినిమా రేంజ్‌ను తలపిస్తుంది. కొన్ని ఫ్లాష్‌బ్యాక్‌ సీన్లు అంత స్పష్టంగా లేవు. గోపిని ప్రేమించిన జెన్నీ (నైనా) ఇతరత్రా పాత్రలను అసంపూర్తిగా చూపించారు. సీజన్‌ 3లో వాటి పరిధి పెంచుతారేమో చూడాలి. ఏంటీ? మూడో భాగం ఉందా? అనుకుంటున్నారా? చివరి ఎపిసోడ్‌ క్లైమాక్స్‌ మీకే చూశాక మీకే తెలుస్తుంది. దర్శకులు అంతగా స్పష్టతనిచ్చారు.

ఎవరెలా చేశారంటే: నటన పరంగా ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు. నవీన్‌ చంద్ర క్యారెక్టర్‌కు స్కోప్‌ ఎక్కువ ఉండటంతో తెరపై ఆయనే ఎక్కువగా కనిపిస్తారు. గోపీగా తనదైన మార్క్‌ చూపించారు. సినిమా అయినా సిరీస్‌ అయినా ఎంపిక చేసుకున్న పాత్రలో ఒదిగిపోతామని శరత్‌కుమార్‌, జగపతి బాబు మరోసారి నిరూపించారు. శరత్‌ కుమార్‌ తనయుడిగా ఇషాన్ చక్కని ప్రతిభ చూపారు. ఆకాంక్ష సింగ్‌ సన్నివేశాలన్నీ ఎమోషనల్‌గా సాగాయి. ఆమని, కస్తూరి తదితరులు ఫర్వాలేదనిపించారు. ఈ సీజన్‌లో రత్నాకర్‌ పాత్ర పోషించిన రవివర్మ, ‘బిగ్‌బాస్‌’ ఫేం దివి మెరిశారు. ‘నిజం ఎవరు దాచినా దాగదు. అది నా తమ్ముడైనా కొడుకైనా’, ‘పంతం జీవితాన్నే నాశనం’ తదితర సంభాషణలు మెప్పించేలా ఉన్నాయి. నేపథ్యం సంగీతాన్ని నరేశ్‌ ఇంకా బాగా ఇవ్వాల్సింది. విశ్వేశ్వరన్‌ కెమెరా పనితనం బాగుంది. తమ్మిరాజు తన కత్తెరకు బాగా పనిచెప్పారు. ముగ్గురు దర్శకుల టేకింగ్‌ ఓకే అనిపిస్తుంది.

చివరిగా: మరింత పవర్‌ఫుల్‌గా.. పరంపర: సీజన్‌ 2

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts