రివ్యూ: సైనా

పరిణీతి చోప్రా నటించిన ‘సైనా’ బయోపిక్‌ ఎలా ఉందంటే?

Updated : 26 Mar 2021 14:29 IST

చిత్రం: సైనా; నటీనటులు: పరిణీతి చోప్రా, మానౌవ్‌ కౌల్‌, ఇషాన్‌ నఖ్వీ, మేఘనా మాలిక్‌, సుబ్రజ్యోతి బరాత్‌, అంకుర్‌ విశాల్‌ తదితరులు; సంగీతం: అమాల్‌ మాలిక్‌; సినిమాటోగ్రఫీ: పీయూష్ షా; ఎడిటింగ్‌: దీపా భాటియా; నిర్మాత: భూషణ్‌కుమార్‌, కృష్ణన్‌ కుమార్‌, సుజయ్‌ జైరాజ్‌, రాశేష్‌ షా; రచన, దర్శకత్వం: అమోల్‌ గుప్త, అమితోష్‌ నగపాల్‌(డైలాగ్స్‌); బ్యానర్‌: టి-సిరీస్‌ ఫిల్మ్స్‌, ఫ్రంట్‌ ఫుట్‌ పిక్చర్స్‌; విడుదల: 26-03-2021

వెండితెరకు బయోపిక్‌లు కొత్తేమీ కాదు. సినీ తారలు, రాజకీయ ప్రముఖులు, క్రీడాకారుల జీవితాలను ఎందరో దర్శకులు వెండితెరపై ఆవిష్కరించారు. జీవితకథలను ఉన్నవి ఉన్నట్టు తీస్తే డాక్యుమెంటరీలుగా మిగిలిపోతాయి. కథలో భావోద్వేగాలు, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటే బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తాయి. చిన్న వయసులోనే బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు సైనా నెహ్వాల్‌. ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకం తెచ్చి పెట్టారామె. ఆమె జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. సైనా కథతో సినిమా వస్తుందంటే అందరికీ ఆసక్తే. అమోల్‌ గుప్త దర్శకత్వంలో ‘సైనా’ పేరుతో ఆమె జీవిత కథను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. మరి శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? సైనాగా పరిణీతి మెప్పించిందా?

కథేంటంటే: ఒక చిన్న పట్టణంలో అతి సాధారణ కుటుంబంలో పుట్టిన బాలిక సైనా నెహ్వాల్‌(పరిణీతి చోప్రా). చిన్నప్పటి నుంచి ఆమెకు బ్యాడ్మింటన్‌ అంటే ఎంతో ఇష్టం. కుమార్తె ఇష్టాన్ని గుర్తించిన ఆమె తల్లిదండ్రులు ఎలాగైనా ఆమె బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిని చేయాలనుకుంటారు.  షటిల్‌ కాక్స్‌ కొనడానికి సైతం అప్పులు చేయాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో సైనా బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా ఎలా ఎదిగింది? ఆమెను వెన్ను తట్టి ప్రోత్సహించి ముందుకు నడిపింది ఎవరు? అంతర్జాతీయ స్థాయిలో ఎలా రాణించింది? ఆమె జీవితంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఎలా ప్రభావితం చేశాయి? అన్నది కథ.

ఎలా ఉందంటే: ముందుగానే చెప్పుకొన్నట్టు జీవిత కథను మామూలుగా తీస్తే డాక్యుమెంటరీగా మిగిలిపోతుంది. ఉలి దెబ్బలు తగలనిదే శిల శిల్పంగా మారదు. ఉన్నతస్థితికి చేరుకున్న ప్రతి ఒక్కరీ జీవితంలో ఎదురు దెబ్బలు తగిలే ఉంటాయి. ముఖ్యంగా క్రీడాకారుల జీవితాల్లో ఎత్తు పల్లాలు ఎక్కువ. వారి జీవితాన్ని ఎంత భావోద్వేగభరితంగా చూపించారన్న దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. ‘సైనా’ విషయంలో దర్శకుడు అమోల్‌గుప్త సఫలమయ్యారు. కష్టాలు ఎన్ని ఎదురైనా కుంగిపోకుండా ముందుకు సాగలన్న విషయాన్ని ‘సైనా’ బయోపిక్‌లో మనకు కనిపిస్తుంది. కామన్వెల్త్‌ క్రీడల్లో సైనా విజయంతో సినిమాను ప్రారంభించాడు దర్శకుడు. మొదటి సన్నివేశంతోనే ప్రేక్షకుడిని కథలో లీనం చేసే ప్రయత్నం చేశాడు. సైనా బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా ఎలా మారిందన్న విషయాలను ఒకదాని తర్వాత మరొకటి హృదయానికి హత్తుకునేలా తీర్చిదిద్దాడు. తల్లిదండ్రులతో ఆమెకు ఉన్న అనుబంధం, బ్యాడ్మింటన్‌ శిక్షణకు సైనాను ఆమె తల్లి తీసుకెళ్లే సన్నివేశాలు ఎమోషనల్‌గా అనిపిస్తాయి. సైనాకు శిక్షణ సమయంలో ఆమె తల్లి చెప్పే ఐదు విషయాలు, కుమార్తె ఆట కోసం తండ్రి షటిల్స్‌ కొనడం తదితర సన్నివేశాలను దర్శకుడు హృద్యంగా రాసుకున్నాడు. ప్రథమార్ధమంతా సైనా బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా ఎలా ఎదిగిందన్న విషయాలను చూపిస్తూ వెళ్లారు. ద్వితీయార్ధం ప్రారంభంలో కూడా అవే సన్నివేశాలు వస్తున్నట్లు అనిపించడం కాస్త విసుగ్గా కనిపించినా చివరి 30 నిమిషాల్లో కథ,కథనాల్లో వేగం ఉంటుంది. ఒక ఆసక్తికర విషయంతో క్లైమాక్స్‌ ముగించిన తీరు ఆకట్టుకుంటుంది.

ఎవరెలా చేశారంటే: ‘సైనా’ పాత్రలో పరిణీతి చోప్రా ఒదిగిపోయారు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా కనిపించేందుకు తెర వెనుక ఆమె పడిన శ్రమ తెరపై మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గేమ్‌ ఆడే సమయంలో సైనా శరీర తీరు, హావభావాలను పరిణీతి చక్కగా ఒడిసి పట్టింది. బ్యాడ్మింటన్‌పై అవగాహన ఉన్నవారికి పరిణీతి ఎంత కష్టపడిందో అర్థమవుతుంది. సైనా కోచ్‌ పాత్రలో మానవ్‌ కౌల్‌ చక్కగా నటించారు. తన నటనతో మెప్పించారు. సైనా తల్లిగా మేఘనా మాలిక్‌, తండ్రిగా సుబ్రజ్యోతి భరత్‌ నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ముఖ్యంగా మేఘనా మాలిక్‌ పలికే సంభాషణలు హృద్యంగా ఉంటాయి. పారుపల్లి కశ్యప్‌ పాత్రలో ఇషాన్‌ నఖ్వీ పర్వాలేదనిపించారు. సైనా చిన్నప్పటి పాత్ర చేసిన పాప నైషా కౌర్‌ కూడా అద్భుతంగా నటించింది.

సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. పీయూష్‌ షా కెమెరా వర్క్‌ అద్భుతం. గేమ్‌ సన్నివేశాలను భావోద్వేగభరితంగా, ఉద్విగ్నంగా చూపించారు. అమాల్‌ మాలిక్‌ సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. మైనే హూన్‌ నా తేరా సాథ్‌, చాల్‌ వహిన్‌ చలేన్‌ పాటలు బాగున్నాయి. దర్శకుడు అమోల్‌ గుప్త ‘సైనా’ బయోపిక్‌ను చక్కగా తెరకెక్కించారు. ప్రతి సన్నివేశంపైనా ఆయనకు ఉన్న స్పష్టత తెరపై కనిపిస్తుంది. ప్రతి పాత్రను ఆయన రాసుకున్న విధానం మెప్పిస్తుంది. తెరపై జూనియర్‌ ఆర్టిస్ట్‌లు ఎలా నటించాలన్న చిన్న చిన్న విషయాలను కూడా ఆయన చాలా చక్కగా చూపించారు. అయితే, ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు, ‘సైనా’ కథ అందరికీ తెలిసిందే కావటం కాస్త మైనస్‌.

బలాలు బలహీనతలు
+ పరిణీతి చోప్రా - ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు
+ దర్శకత్వం - తెలిసిన కథే కావటం
+ ఇతర నటీనటులు, సాంకేతిక బృందం పనితీరు  

చివరిగా: స్ఫూర్తిని నింపుతూ అలరించే ‘సైనా’

గమనిక: ఈ  సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని