ఆనాడు దర్శకుడికి కోపం తెప్పించిన నయనతార.. ‘నువ్వు రావొద్దు’ అని చెప్పేసిన డైరెక్టర్‌

అగ్రకథానాయిక నయనతార (Nayanthara) గతంలో ఓ దర్శకుడి కోపానికి గురయ్యారు. ఆమె చేసిన పనితో ఆగ్రహానికి గురైన ఆ దర్శకుడు.. సినిమా ఛాన్స్‌ని వెనక్కి తీసేసుకున్ననారు.  

Published : 01 Jun 2023 01:03 IST

చెన్నై: దక్షిణాదిలో అగ్ర కథానాయికగా రాణిస్తున్నారు నటి నయనతార (Nayanthara). ప్రస్తుతం కెరీర్‌ పరంగా దూసుకెళ్తోన్న ఆమె.. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ఎన్నో విమర్శలు, అవమానాలు ఎదుర్కొన్నారు. ఓ సమయంలో ప్రముఖ దర్శకుడికి కోపానికీ ఆమె గురయ్యారు. ఆమె చేసిన పని వల్ల కోలీవుడ్‌ ఎంట్రీ ఏడాది ఆలస్యమైంది. ఇంతకీ నయన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ దర్శకుడు ఎవరు? ఆయనకు కోపం వచ్చేలా ఆమె ఏం చేశారంటే..?

కేరళకు చెందిన నయనతార Manassinakkare అనే మలయాళీ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చారు. కెరీర్‌ ఆరంభంలో సుమారు మూడు మలయాళీ సినిమాల్లో నటించిన ఆమె 2005లో విడుదలైన ‘అయ్యా’తో కోలీవుడ్‌లోకి ప్రవేశించారు. యువ, అగ్ర హీరోల సరసన నటించి మంచి ఫేమ్‌ సొంతం చేసుకుని.. చెన్నైలో స్థిరపడిపోయారు. ఇదిలా ఉండగా, అంతా బాగుండుంటే ఆమె 2004లోనే తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాల్సిందని నటుడు దర్శకుడు, నటుడు పార్థిబన్‌ తాజాగా వెల్లడించారు. తాను తెరకెక్కించిన ‘కుడైకుల్‌ మలై’కు మొదట నయన్‌నే హీరోయిన్‌గా అనుకున్నట్లు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.

‘‘కుడైకుల్‌ మలై’.. 2004లో నేను దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం నయనతారను హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నాను. అప్పటికి ఆమె ఇంకా తమిళ పరిశ్రమలోకి అడుగు పెట్టలేదు. నయన్‌ ఫొటో చూసిన వెంటనే ఆమెకు ఫోన్‌ చేసి.. ‘నేనొక సినిమా చేస్తున్నాను. అందులో మీకు ఛాన్స్‌ ఇవ్వాలనుకుంటున్నా. రేపు ఉదయం 8 గంటల కల్లా చెన్నైకు వచ్చి నన్ను కలవండి’ అని చెప్పా. కారణం ఏమిటనేది నాకు తెలియదు కానీ, అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన రోజు ఆమె రాలేదు. ఆతర్వాత రోజు ఫోన్‌ చేసి.. ‘సార్‌.. నిన్న మిమ్మల్ని కలవలేకపోయాను. రేపు తప్పకుండా కలుస్తాను. ఈరోజే కేరళ నుంచి బయలు దేరుతున్నాను’ అని చెప్పింది. అప్పటికే నాకు ఆమెపై బాగా కోపం వచ్చేసింది. ‘నువ్వు రావాల్సిన అవసరం లేదు. రావొద్దు’ అని చెప్పేశాను’’ అంటూ ఆనాటి సంఘటనను తాజాగా పార్థిబన్‌ గుర్తు చేసుకున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని