Ginna: విష్ణు ‘జిన్నా’ విషయంలో ఆ తప్పులు సరిచేసుకుని ఉంటే..: పరుచూరి గోపాలకృష్ణ

మంచు విష్ణు హీరోగా నటించిన ‘జిన్నా’ సినిమా గురించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. ఆ సినిమాలోని లోపాలను వివరించారు.

Published : 19 Feb 2023 18:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన యూట్యూబ్‌ ఛానల్‌ వేదికగా సినిమాల్లోని మంచీ చెడుల గురించి ప్రేక్షకులకు పాఠాలు చెబుతుంటారు రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna). అందులో భాగంగా తాజాగా ‘జిన్నా’ (Ginna) చిత్రం గురించి విశ్లేషించారు. మంచు విష్ణు (Vishnu Manchu), పాయల్‌ రాజ్‌పూత్‌ (Payal Rajput), సన్నీలియోనీ (Sunny Leone) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ఇది. ఇషాన్‌ సూర్య దర్శకత్వం వహించారు. గతేడాది అక్టోబరులో విడుదలైన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో ఎందుకు విజయం అందుకోలేకపోయిందో గోపాలకృష్ణ మాటల్లోనే..

‘‘జిన్నా’ అనే టైటిల్‌ వినగానే అది హీరో ఓరియెంటెడ్‌ కథ అని అందరికీ అనిపిస్తుంది. దర్శకుడు ఇషాన్‌ సూర్య, మోహన్‌బాబు, కోన వెంకట్‌, జి. నాగేశ్వర్‌రెడ్డి ఈ సినిమా రచనలో భాగమయ్యారు. ఈ చిత్ర కథా మూలానికి వెళ్తే ‘మనసంతా నువ్వే’లా ఉంటుంది. మాటలురాని హీరోయిన్‌ని (బాల్యంలో) నువ్వు ఎక్కడ కూర్చుంటావ్‌? అని అడిగితే వెళ్లి హీరో పక్కన కూర్చొంటుంది. ఆ అమ్మాయి మాట్లాడలేదు కాబట్టి కుటుంబ సభ్యులు ఓ విజిల్‌ ఇస్తారు. విజిల్‌ ఎప్పుడైతే వేసిందో ఆమెకు ఏదో అవసరం ఉందని వారు గుర్తిస్తారు. కొన్నాళ్లకు ఆ అమ్మాయి విదేశాలకు వెళ్తుంది. అప్పుడు.. హీరో కూడా విదేశాలకు వెళ్తాడా? హీరోయిన్‌ స్వదేశానికి తిరిగొచ్చినప్పుడు వారి మధ్య ప్రేమ మళ్లీ చిగురిస్తుందా? అనే సందేహం ప్రేక్షకులకు కలుగుతుంది’’

మల్లీశ్వరి తరహా కాన్సెప్ట్‌..

‘‘ఇందులోని హీరోని కబడ్డీ సన్నివేశంతో పరిచయం చేశారు. అతను స్వగ్రామంలో టెంట్‌ హౌస్‌ నడిపిస్తుంటాడు. చావులకు మాత్రమే టెంట్‌ సామాన్లు రెంట్‌కు ఇవ్వాలని  హీరో మామయ్య తీర్మానిస్తాడు. దాంతో, కథానాయకుడిని ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. వాటి నుంచి ఆయన ఎలా బయటపడతాడో అని ప్రేక్షకులు అనుకుంటున్నప్పుడు.. ఎవరినైతే హీరో బాల్యంలో ఇష్టపడ్డాడో ఆ అమ్మాయి ఊరికి వచ్చి, ఆదుకుంటుంది. కానీ, అప్పటికే హీరో మరో అమ్మాయితో ప్రేమలో పడిపోతాడు. ఇదే కాన్సెప్ట్‌ నాటి చిత్రం ‘మల్లీశ్వరి’లో కనిపిస్తుంది. దానికి అవార్డులు వచ్చాయి తప్ప డబ్బులు రాలేదు’’

కథలో లోపం లేదు కానీ..

‘‘చిన్నప్పుడు హీరోని ప్రేమించిన అమ్మాయి ఎప్పుడైతే  ఊరికి తిరిగి వస్తుందో అప్పుడు.. ‘ఇకపై లవ్‌స్టోరీ మొదలవుతుంది. కామెడీ కూడా ఉండబోతోంది’ అని ప్రేక్షకులు ఆశిస్తారు. రేణుకగా వచ్చిన ఆ హీరోయిన్‌.. నరేశ్‌ పాత్రను చంపేయడంతో స్టోరీ డెడ్‌లాక్‌ అయిపోయింది. మర్డర్‌ చేయడంతో ఆ కథానాయిక పాత్ర ప్రేక్షకుల హృదయాల్లోంచి బయటకు వెళ్లిపోతుంది. అక్కడ నరేశ్‌ పాత్రను చంపేయడమేకాకుండా మరో విధంగా చూపించి ఉంటే బాగుండేది. రేణుక హీరోని ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించగా ‘మనది స్వచ్ఛమైన ప్రేమ అనుకున్నా. డర్టీ లవ్‌ అనుకుంటే కానీ’ అని హీరో చెప్పే సంభాషణ అద్భుతమైంది. అలా చెప్పించి విష్ణు పాత్రను కాపాడారు. ఒకవేళ ఆ హీరోయిన్‌ విష్ణుని ముద్దుపెట్టుకుని ఉంటే చాలా లోపం కనిపించేది. ఈ సినిమాపై విష్ణు ఆశలు పెట్టుకుని ఉండి ఉంటాడు. ఈ చిత్ర కథనంలో లోపం ఉందిగానీ కథలో లేదు. ఒక అబ్బాయిని ఇద్దరో ముగ్గురో అమ్మాయిలు ప్రేమించడం, అతను ఒక అమ్మాయినే కోరుకోవడమనేది చాలా సినిమాల్లో కనిపిస్తుంది. కానీ, బాల్యంలో ప్రేమించిన అమ్మాయి స్థానంలో డూప్‌గా మరో అమ్మాయిని పెట్టి కథను నడిపించాలనే ఆలోచన ప్రమాదకరమైంది. దానికి తగ్గ స్క్రీన్‌ప్లేను ఈ చిత్రంలో ఆలస్యంగా రివీల్‌ చేశారు. ఆ డూప్‌ పాత్రను ముందే చూపించి ఉంటే ‘హీరో ఆ అమ్మాయి వలలో పడిపోతాడేమో. అలా జరగకూడదు’ అని ప్రేక్షకులకు ఉత్కంఠకు గురయ్యేవారు’’

అలా చెప్పడం ప్రమాదకరం..

సస్పెన్స్‌, సెంటిమెంట్‌ ఒకేసారి పండవనే విషయం ఈ చిత్రంతో స్పష్టమైంది. రేణుకగా ప్రవేశించిన అమ్మాయి నకిలీ అనే సస్పెన్స్‌ను చివరి వరకు దాచిపెట్టడం, ఆమె ఫ్లాష్‌బ్యాక్‌ చెప్పడం, అందులోనూ తను హత్య చేసినట్టు చూపించడంతో.. తను హీరోని పెళ్లి చేసుకుని ఎలా ఉండగలదనే ప్రశ్న ఆడియన్స్‌కు తప్పక వస్తుంది. విదేశాల నుంచి వచ్చిన అమ్మాయి రేణుకే అని చెప్పి ఉంటే మరోలా ఉండేది. అసలు రేణుకగా వచ్చిన అమ్మాయికి హీరో అంటే ఎందుకంత ప్రేమ కలిగింది? అనే సందేహమూ వస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు హీరో స్నేహితురాలని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ‘నాలుగు రోజులు నాటకం ఆడదాం. ఆ అమ్మాయి (రేణుక) దగ్గర డబ్బులు తీసుకుందాం. నిన్ను పెళ్లి చేసుకుంటా’ అని చెబుతాడు. దాంతో, హీరో క్యారెక్టరైజేషన్‌ స్థాయి పడిపోయింది. మరో సన్నివేశంలో ఎన్నికల్లో డబ్బు ఖర్చుపెడితేనే గెలుస్తారనే దాన్ని ప్రకటించడం ప్రమాదకరమైన చర్య. హీరో అంటే పైసా ఖర్చు పెట్టకుండా గెలవాలి. కథ రాసుకునే సమయంలోనే ఇలాంటి చిన్న చిన్న తప్పులను సరిచేసుకుని ఉండి ఉంటే బాగుండేది. దర్శక, నిర్మాతలు తమ లక్ష్యాన్ని చేరుకోలేదని అర్థమైంది’’ అని గోపాలకృష్ణ వివరించారు. టైటిల్‌ పాత్రలో విష్ణు కనిపించగా స్వాతి పాత్రలో పాయల్‌ సందడి చేశారు. ఫేక్‌ రేణుకగా సన్నీ లియోనీ నటిస్తే అసలైన రేణుకగా దివి మెరిశారు. ఈ సినిమా ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు