Published : 27/10/2021 12:45 IST

అవకాశం కల్పిస్తే సత్తా చూపిస్తుంది!

ఇంటర్నెట్‌ డెస్క్: తెలుగు సినీపరిశ్రమలో పరుచూరి బ్రదర్స్‌ది ప్రత్యేకమైన స్థానం. వారిలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ రచయితగా, నటుడిగా రాణించారు. ఆయన ‘పరుచూరి పలుకులు’ పేరుతో సినిమా విశేషాలతో పాటు, అప్పట్లో జరిగిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఆయన అలనాటి నటి, బీజేపీ నేత కవిత గురించి మాట్లాడారు. ఆ పలుకులేంటో తెలుసుకుందాం... 

‘‘మేం చిత్రసీమలోకి రాకముందు నుంచే కవిత కథానాయికగా నటిస్తున్నారు. మొదట మేము 1978లో ‘చలిచీమలు’ చిత్రానికి చేసే నాటికే కవిత హీరోయిన్‌. ఆమె 1976 నుంచి 1984 వరకు కథానాయికగా చాలా మంచి పాత్రలు చేశారు. మేం 1978 నుంచి 1982 వరకు వేరొకరికి వేషాలు ఇప్పించేంత పరిస్థితి లేదు. 1984 నుంచి మాకు వేరొకరికి రెకమెండ్ చేసే అవకాశం వచ్చింది. దర్శకులకు, రచయితలకు కొంచెం పేరు రాగానే.. ఆ ఆర్టిస్టులను తీసుకో.. వీళ్లను తీసుకో అంటూ నిర్మాతల నుంచి, వేరేవాళ్ల నుంచి కూడా సహజంగానే ఒత్తిళ్లు వస్తుంటాయి. కవిత నటించిన ‘పెళ్లిళ్ల పేరయ్య’ చిత్రానికి మేం పనిచేశాం. కానీ ఆ సినిమా అంత బాగా ఆడలేదు. కానీ కవిత చాలా బాగా నటించింది ఈ సినిమాలో. మేం చేసిన సినిమాల్లో ‘అల్లరిపిడుగు’(బాలకృష్ణ, కత్రీనా కైఫ్‌)లో నటించింది. మేం రాసిన చిత్రాలకంటే ఆమె వేరే చిత్రాల్లో బాగా నటించి పేరు తెచ్చుకుంది. వాటిల్లో ఒకటి ‘ప్రెసిడెంట్ పేరమ్మ’. ఈ సినిమాని నేనొక ప్రేక్షకుడిగా చూశా. చాలా బాగుంటుంది. చిత్రసీమకు వచ్చిన కొత్తలో మేం రాసిన రెండు చిత్రాల్లో ఆమె నాయికగా నటించింది. విచిత్రమేమిటంటే సినీ పరిశ్రమలో ఓ లక్షణం ఉంటుంది. ఏదైనా సినిమాల్లో మన కాంబినేషన్‌ సక్సెస్‌ కాకపోతే హీరోయిన్‌నో, మిగతా ఎవరో ఒకరినో మార్చేస్తుంటారు. 1983-84లో రాధ, సుహాసిని, విజయశాంతి, భానుప్రియ.. ఇలా నలుగురైదుగురు కొత్త హీరోయిన్లు అగ్రతారలుగా మారిపోయారు. ఆ సమయంలో ఏ దర్శకుడు, రచయిత, నిర్మాతైనా సరే నెంబర్‌వన్ స్థానంలో ఉన్న కథానాయికలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేస్తుంటారు.

‘ప్రెసిడెంట్‌ పేరమ్మ’లో అంత బాగా నటించిన కవితకు, గొప్పగా ఎందుకు రాయలేకపోయామన్న బాధ నాకు ఇప్పటికీ కలుగుతూనే ఉంటుంది. ‘అమ్మ రాజీనామా’ చిత్రంలో సీనియర్‌ నటి శారదతో పోటాపోటీగా ఓ సన్నివేశంలో నటించింది. తనలో ఎంత నటన ఉందో అందులో చూపించింది. కవిత మా కుటుంబానికి చాలా ఆత్మీయురాలు. విచిత్రం ఏంటంటే సినిమా షూటింగ్‌లకు వెళ్లినప్పుడు అశోక హోటల్‌లో ఉండేవాళ్లం. ప్రతి రూమ్‌లోనూ ఎవరో ఒకరు సినిమా ఆర్టిస్టు ఉండేవారు. మేం అలా బయటకు రాగానే .. ‘ఏం నేను హీరోయిన్‌లాగా కనపడటం లేదా?’ అని కవిత నవ్వుతూ పలకరించేది. ఏదైనా సినిమా ప్రకటన వెలువడగానే, అందులో మా పేర్లు కనిపించేవి. ‘మీ ఇంటి ఎదురింట్లోనే ఉంది కవిత. ఈ కవిత మాత్రం మీకు గుర్తుకు రాదు’ అంటూ జోకులేసేది. ఎప్పుడూ తనకు వేషం ఇవ్వలేదని గొడవ పడలేదు కవిత. చాలా సహృదయురాలు. మా సినిమాల్లో ఆమె నటించి విజయం సాధించిందిన చిత్రం ‘పెద్దరికం’. సినిమాల్లోనూ మంచి వేషాలు వేసుకుంటూ సేవచేస్తుంది. ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉంది. కవితకు సేవ చేసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం నుంచి లభిస్తే సంతోషించేవారిలో నేనొకడిని. ఆమెను ఎప్పుడైనా సరే గమనించండి.. ‘చిరునవ్వు’తోనే ఉంటుంది. కవితకి సేవ చేయాలనే తపన చాలా ఉంది. దాన్ని గుర్తించి బీజేపీ వాళ్లు ఏదైనా పదవి (బాధ్యత) ఇస్తే, సక్రమంగా చేసి తనేంటో నిరూపించుకుంటుంది’’ అని అన్నారు. 
 


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్