‘గుండమ్మకథ’ విడుదల చేయడానికి భయపడ్డారు!

‘గుండమ్మకథ’ విడుదల చేయడానికి విజయావారు భయపడ్డారు

Updated : 09 Jul 2021 14:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు పరుచూరి గోపాలకృష్ణ ‘పరుచూరి పలుకులు’ పేరుతో యూట్యూబ్‌ వేదికగా తన అనుభవాలు పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అలనాటి దిగ్గజ సినీ రచయిత డి.వి. నరసరాజు గురించి పలు విషయాలు పంచుకున్నారు. తెలుగు సినిమా రచయితల సంఘానికి ఆయనో భీష్మాచార్యుడని అన్నారు. రచయితలకు ఓ సంఘం ఉండాలని పట్టుబట్టి, పోరాడి మద్రాసులోనే తెలుగు సినీ రచయితల సంఘాన్ని పెట్టించారని తెలిపారు. ఇంకా డి.వి.నరసరాజు గురించి పరుచూరి ఏం చెప్పారంటే..

ఎందుకు భీష్మాచార్యులు అంటున్నానంటే..

‘‘నేను ఫస్ట్‌ ఫారంలో కూడా చేరకముందే ఆయన చిత్రాలు చూశా. ‘పెద్ద మనుషులు’, ‘దొంగరాముడు’.. ఇలా ఆయన సినిమాలన్నీ నిక్కర్లు వేసుకున్న రోజుల్లోనే చూశా. రచయితల సంఘం పెట్టినప్పుడు.. ఫిలింనగర్‌లో ఆఫీస్‌ ఉండేది కాదు. అందరూ చెట్టుకింద కూర్చొనేవారు. అలాంటి పరిస్థితుల్లో రచయితల సంఘాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లారు. సాధారణంగా కథలను ఆఫీసుల్లో కంటే  గెస్టు హౌసుల్లో కూర్చొని రాసేవారు. ఆయన మాత్రం ఏనాడూ హోటల్‌ రూమ్‌ బుక్‌ చేయించుకోలేదు. అలా ఎప్పుడూ కథలు రాయలేదు. ఇది ఆయన గొప్పదనం’’

‘గుండమ్మకథ’ని మళ్లీ తీద్దామనుకున్నాం..

‘‘ఆయన సినిమాల్లో ముఖ్యమైనది ‘గుండమ్మకథ’. అయితే ఇందులో ఎన్టీఆర్‌ నిక్కర్‌తో కనిపిస్తారు. సినిమాను అలాగే విడుదల చేస్తే ప్రజలు కొడతారని విజయావారు భయపడ్డారు. అయితే, విజయావారి ఇంట్లో ఒక ఫంక్షన్‌ జరిగింది. దానికి వచ్చిన బంధువులకు ప్రత్యేకంగా తమ సొంత థియేటర్‌లో ఈ సినిమా వేశారు. సినిమా చూసి అందరూ పడీపడీ నవ్వారు. అది చూశాక విజయావారికి ధైర్యం వచ్చింది. అప్పుడు సినిమాను రిలీజ్‌ చేశారు. ఆ సినిమా ఇప్పుడు చూసినా, ఎంతగానో అలరిస్తుంది. ‘గుండమ్మకథ’ చిత్రాన్ని మళ్లీ బాలకృష్ణ, నాగార్జునతో తీద్దామనుకున్నాం. బాలకృష్ణతో ఈ విషయం గురించి మాట్లాడాను కూడా. ‘మళ్లీ మాతో తీస్తే చూస్తారా?’ అని అన్నారు. ఆయన అలా అనేసరికి ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు’’

ఆ సినిమా చూడటానికి వేరే ఊరు వెళ్లా..

‘‘రాముడు భీముడు’ చిత్రం విడుదల సమయానికి నేను నూజివీడులో ఉన్నా. అక్కడ ఆ సినిమా షో వేయకపోవడంతో కేవలం రామారావుగారి కోసం ప్రత్యేకంగా గుడివాడకి సైకిల్‌ మీద వెళ్లి.. ఒకే రోజు రెండు సార్లు చూశా. అసలు ఆ కథ ఎలా పుట్టిందంటే.. రామానాయుడు గారికి నరసరాజుగారు రెండు మూడు కథలు చెప్పినా నచ్చలేదట. అప్పుడు నరసరాజుగారు ‘అందరూ వద్దన్న కథ ఒకటి నా దగ్గర ఉంది చెప్పనా’ అంటే ‘సరే చెప్పండి’ అన్నారట రామానాయుడు. అదే ‘రాముడు- భీముడు’. రామానాయుడిగారికి కథ నచ్చడంతో వెంటనే తీద్దామన్నారు. అయితే ఆ కథను అందరూ నిరాకరించారన్న విషయాన్ని ఎన్టీఆర్‌కి చెప్పొద్దని నరసరాజుగారు రామానాయుడు గారిని కోరారట. కథ విన్న అన్నగారు ‘చాలా బాగుంది’ అని ఆ సినిమా చేశారట. ఆ తర్వాత ఈ కథా నేపథ్యంతో ఎంతమంది, ఎన్ని సినిమాలు తీశారో అందరికీ తెలిసిందే. ‘బడిపంతులు’ సినిమా చూస్తూ థియేటర్‌లోనే ఏడ్చేశా. అందులో ఎన్టీఆర్‌ కాకుండా కేవలం బడిపంతుల్నే చూశా. దానికి ఎన్టీఆర్‌ నటనతో పాటు డి.వి. నరసరాజు గారి కలం బలం కూడా తోడైంది. అలా దర్శకుడు, నటుడు, రచయిత కలిస్తే, అద్భుతాలు చేయొచ్చు.

నిరంతం పనిచేయాలని చెప్పేవారు..

‘‘మనల్ని ఎవరైనా వద్దనుకునే రోజు వరకూ పనిచేయాలి’ తప్ప ఒక రచయితగా ఎప్పుడూ రిటైర్‌మెంట్‌ ప్రకటించకూడదు’ అని నరసరాజుగారు చెప్పేవారు. ఆ మాట ఈరోజుకీ ఆదర్శం. తన కలం బలంలో హీరో పాత్రలకి జీవం పోసిన మహానుభావులు ఆయన.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు