శ్రీశ్రీ పుస్తకంలోనూ అలాగే రాసేవారు: పరుచూరి

మహాకవి శ్రీశ్రీ(శ్రీరంగం శ్రీనివాసరావు) గొప్పతనం గురించి ఎంత చెప్పినా చంద్రుడికి నూలిపోగులాంటిదేనని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. తన పాడ్‌కాస్ట్‌ ‘పరుచూరి పలుకులు’లో భాగంగా ఆయన శ్రీశ్రీతో తన సినిమా ప్రయాణాన్ని ఆయన గుర్తు..

Published : 30 Jun 2021 01:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహాకవి శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) గొప్పతనం గురించి ఎంత చెప్పినా చంద్రుడికి నూలిపోగులాంటిదేనని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. తన పాడ్‌కాస్ట్‌ ‘పరుచూరి పలుకులు’లో భాగంగా ఆయన శ్రీశ్రీతో తన సినిమా ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

‘‘పద్యాలు.. ఛందస్సు ఛందోబద్ధంగా ఉండాలని అలా వెళ్లిపోతున్న సమయంలో ఒక చిన్న నడకనే ఛందస్సులాగా మార్చి ‘మరో ప్రపంచం.. మరో ప్రపంచం.. మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు.. పదండి తోసుకు.. పదండి పోదాం పైపైకి’ అంటూ దానికి ఒక రిథమ్‌ ఇచ్చారు శ్రీశ్రీ. అలాగే దేనికైనా ‘కుక్కపిల్ల.. అగ్గిపుల్ల.. సబ్బుబిల్లా కాదేదీ కవితకనర్హం’ అన్నారు. ఆయనది సామాన్యుడు మెచ్చే కవిత్వం.. విద్యావంతుడు మెచ్చే కవిత్వం. శ్రీశ్రీ వాడిన కొన్ని మాటలు చాలామందికి అర్థం కావు. వెళ్లి డిక్షనరీలో చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆయన ‘కలియుగ మహాభారతం’ సినిమాకు పాట రాశారు. ఆ సినిమాలో క్లైమాక్స్‌లో ‘ఇది కలియుగ భారత సమరం’ అంటూ ఒక పాట వస్తుంది. ఆ అద్భుతమైన పాట వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. నిజంగా కురుక్షేత్ర సంగ్రామాన్ని చూపించినంత గొప్పగా రాశారు. ఆయనతో నాకు ఉన్న ఒక జ్ఞాపకం మీతో పంచుకోవాలి.

కృష్ణగారి జీవితంలో పద్మాలయ చరిత్రలో మా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని సినిమా ‘ఈనాడు’. ఆ  సినిమాలో క్లైమాక్స్‌లో వచ్చే పాట మామూలుగా ఉండదు. థియేటర్లో ప్రేక్షకులు భయంకరమైన ఈలలు, కేకలు వేశారు. ఈ పాట కూడా శ్రీశ్రీ గారు రాసిందే. అయితే.. ఆ పాట వినేందుకు రావాలని నాకు ఫోన్‌ చేసి స్టూడియో నుంచి పిలుపు వచ్చింది. నేను వెళ్లే సరికి శ్రీశ్రీ గారు అక్కడే ఉన్నారు. వెంటనే ఆయనకు నమస్కారం పెట్టి.. ‘సార్‌.. నాకు ఆదర్శవంతమైన రచయిత మీరు.. గొప్ప విప్లవ కవి’ అన్నాను. వెంటనే ఆయన స్పందిస్తూ.. ‘నేను విప్లవ కవిని కాను.. అభ్యుదయ కవిని’ అన్నారు. ఆ విషయాన్ని ఆయన పుస్తకాల్లో కూడా రాసుకున్నారు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మేము 9 సినిమాలకు దర్శకత్వం వహిస్తే అందులో రెండు సినిమాలకు శ్రీశ్రీగారే రచనలు చేశారు. మేం దర్శకత్వం వహించిన ‘భలే తమ్ముడు’ చిత్రం తర్వాత బాగా ఆడిన సినిమాలు ‘ప్రజాస్వామ్యం’, ‘సర్పయాగం’. ఈ రెండు సినిమాలకు జూన్‌ 15న శ్రీశ్రీగారి వర్ధంతి రోజునే క్లాప్‌ కొట్టాం. ఆయన జ్ఞాపకార్థం ఆ రెండు సినిమాలను కావాలనే ఆ తేదీన  ప్రారంభించాం. మేం రాసే మాటల్లోకి మీరు ఆవహించండి. మీలాంటి అద్భుతమైన రచయితలు ద్వారా మేం ప్రజల్లోకి వెళ్లాలని’ ఆయన్ను తలచుకుంటూ సినిమాలు ప్రారంభించాం. ఆయన గురించి ఎంత పొగిడినా చంద్రుడికి నూలు పోగులాంటిదే’ అని పరుచూరి గోపాలకృష్ణ ముగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని