vijayalalitha: ‘సాహసవీరుడు..’లో ఆమె పాత్ర గెటప్‌ చూస్తుంటే భయమేస్తుంది!

vijayalalitha: ప్రముఖ నటి విజయలలిత గురించి పరుచూరి గోపాలకృష్ణ పంచుకున్న ఆనాటి విశేషాలు...

Updated : 30 Aug 2021 16:44 IST

పరుచూరి బ్రదర్స్‌ ఒకరైన గోపాలకృష్ణ రచయితగానే కాకుండా సినిమాల్లోనూ నటించి రాణించారు. ఆయన ‘పరుచూరి పలుకులు’ పేరుతో సినిమా విశేషాలతో పాటు, అప్పట్లో జరిగిన ఆసక్తికర సంఘటనలను, ప్రముఖ నటీనటుల సంగతులను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా అలనాటి ‘లేడీ జేమ్స్‌బాండ్‌’‌ విజయలలిత గురించి గోపాలకృష్ణ చెప్పిన సంగతులు.. ఆయన మాటల్లోనే..

‘‘ఆమెను విజయలలిత ‘గారు’ అని ఎందుకు అంటున్నానంటే.. నేను విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే, సినిమాల గురించి నాకేమీ తెలియనప్పుడే ఆమె సినిమాలు చాలా చూశాను. ఆమె నటించిన ‘రౌడీరాణి’ ఎన్నిసార్లు చూశానో తెలియదు. అప్పట్లో విజయలలితని దక్షిణాది ‘జేమ్స్‌బాండ్‌’ అనేవాళ్లు. ఎందుకంటే ఫైట్లు బాగా చేసేవారు. అలాంటిది డ్యాన్సుల్లో అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఎల్‌.విజయలక్ష్మి, విజయలలితలే. జ్యోతిలక్ష్మి, జయమాలిని రాకముందు వీళ్లే డ్యాన్స్‌లు చేసేవారు. వీరందరి కంటే ముందు డ్యాన్సులంటే అలనాటి రాగిణి, పద్మిని ఉండేవాళ్లు. అప్పట్లో సినిమాల్లో విజయలలిత డ్యాన్స్ ఉందంటే చాలు.. ఈలలు, కేకలే. అంత అద్భుతంగా నాట్యం చేసేవారు. అంతే అద్భుతంగా, ఎమోషనల్‌గా ఫైట్స్ చేసి ‘లేడీ జేమ్స్‌బాండ్‌’గా పేరు తెచ్చుకున్నారు.  ‘గూఢచారి 116’లో జేమ్స్‌బాండ్‌గా కృష్ణకు ఎంత పేరుందో.. అలా లేడీ జేమ్స్‌బాండ్‌గా ఈమెకూ అంత పేరుండేది. విజయలలితతో ‘మదర్‌ ఇండియా’, ‘చినరాయుడు’, ‘జైలర్‌ గారి అబ్బాయి’, ‘సాహసవీరుడు సాగరకన్య’ చిత్రాలు చేశారు. ఇవే నాకు గుర్తున్నాయి. మేం రాసిన వాటిల్లో.. ఈ నాలుగు చిత్రాల్లో ఆమెవి నాలుగు విభిన్నమైన గెటప్‌లు. ‘మదర్‌ ఇండియా’ చిత్రం షూటింగ్‌ రాజమండ్రి దగ్గరలోని కడియంలోని ఓ తోటలో జరిగింది. మేం రోజూ ఆ షూటింగ్‌లో పాల్గొనేవాళ్లం. ఆ చిత్రంలో నేను భీముడి పాత్ర పోషించా. అందులో నాకో డైలాగ్‌ ఉంటుంది. అదేమంటే  ‘తెలిసో.. తెలియకో.. మా నాన్న నాకు భీముడు అని పేరు పెట్టారు..  తెలిసో తెలియకో మీ నాన్న నీకు దుర్యోధనుడు అని పేరు పెట్టారు. పేరు పెట్టిన రోజునే నా చేతిలో నీ చావు రాసిపెట్టాడు’. ఈ డైలాగ్‌ని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అప్పచెబుతుండేవాడు. ఎందుకు సార్‌ ఇలా చెప్తున్నారంటే ‘ఈ డైలాగ్‌ని ఎన్నిసార్లు బట్టీ పట్టానో, సినిమాని అన్ని సార్లు చూశాను’ అని చెప్పారు. ఈ చిత్రంతో ఎస్వీ కృష్ణారెడ్డి నాకు అభిమాని అయ్యాడు. ‘మదర్‌ ఇండియా’ చిత్రంలో మా నాన్న విజయలలితవాళ్ల ఇంట్లో పాలేరుగా పనిచేస్తుంటాడు. దుర్యోధనుడు (విజయలలిత భర్త) మా నాన్నను చంపుతాడు. ఆయన స్థానంలో నేను ‘పాలేరుగా మా నాన్న చేసిన అప్పు తీర్చుకోవాలి కదా’ అని వారింట్లో  చేరుతా. 

ఈ చిత్రంలో ఆమెతో కలిసి చేసిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. ఇందులో శారద కూతురిపై అపనింద వేస్తారు. ఆ అపనిందని ఎలాగైనా బయటపెట్టాలనే ఉద్దేశంతో నేను విజయలలిత స్నానం గదిలోకి వెళ్తాను. ‘చచ్చినోడా.. ఆడవాళ్లు స్నానం చేస్తుంటే లోపలికి వస్తావా..’ అని అంటుంది. మరో సన్నివేశంలో ఆమెకు నేను కొబ్బరి నీళ్లల్లో మత్తు కలిపి ఇస్తాను. దాంతో ఆమె మంచం మీద పడిపోతుంది. ఆ పక్కనే  నేను ఉంటాను. అప్పుడే ఊరంతా వచ్చి చూస్తుంది. ‘ఇదంతా ఈ చచ్చినోడు చేశాడు. నాకేం తెలియదని చెబుతూ భోరుమని ఏడుస్తుంది. ఇదంతా అబద్ధం అని చెబుతుంది’. ఆమె నోటితోనే ‘ఇదంతా ఎంత అబద్ధమో శారద కూతురిపై వేసిన నింద కూడా అంతే అబద్ధం’ అని చెప్పిస్తాం. ఆ తర్వాత ఆమె నాపై కోపంతో రగిలిపోయి మంచంపై పడుకొని పాము లేచినట్లు లేస్తుంది. ఆ సన్నివేశం చూస్తే.. విజయలలిత ఎంత అద్భుతంగా చేసిందో అనిపిస్తుంది.

ఆ తర్వాత మళ్లీ మేం ‘చినరాయుడు’ సినిమా షూటింగ్‌  కోసం రాజమండ్రి వెళ్లాం. ఆమె ఎవరితోనూ పెద్దగా మాట్లాడరు. మనం పలకరిస్తే పలుకుతారు. లేకపోతే లేదు. షూటింగ్‌లో తన సీన్‌కు సంబంధించిన పేపర్ చదువుకుంటూ ఉండేవారు. అప్పట్లో అన్నగారు (ఎన్టీఆర్‌) అలా చేసేవారు. ఆ తర్వాత విజయలలితే. ఎక్కువగా నటీనటులు ఆ కాలంలో అలాగే ఉండేవారు. తమిళంలో విజయ్‌కాంత్‌తో కలిసి ఓ డబ్బింగ్‌ సినిమా చేశారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత మాతో ‘ప్రయత్నం’ అనే చిత్రంలో కోడలిని ఇబ్బందులకు గురిచేసే అత్తగారి పాత్ర చేశారు. అలా ఆమె లేడీ జేమ్స్‌బాండ్‌ పాత్ర నుంచి సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ప్రతినాయకురాలిగా నటించి అలరించారు. ఇక తర్వాత ఆమె ఎక్కువగా నెగెటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రల్లోనే నటించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘సాహసవీరుడు సాగరకన్య’లో ఆమె పాత్ర గెటప్‌ చూస్తుంటే భయమేస్తుంది. కానీ నిజజీవితంలో ఆమె చాలా సౌమ్యురాలు. అలాంటి విజయలలిత మరోసారి సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నాను’’ అని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని