Paruchuri Gopala Krishna: ఆ సినిమా టైటిల్‌ ఇలా పెట్టుంటే ఇంకాస్త ఆసక్తి పెరిగేది: పరుచూరి

‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా ఫలితంతో దర్శకుడు మోహన్‌కృష్ణ ఇంద్రగంటి నిరాశకు గురయ్యాడని సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని బయటపెట్టిన ఆయన ఇటీవల దర్శకుడితో మాట్లాడినట్లు చెప్పారు. 

Updated : 05 Nov 2022 12:40 IST

హైదరాబాద్‌: సుధీర్‌బాబు (Sudheerbabu) - కృతిశెట్టి (Krithi Shetty) జంటగా నటించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ (Aa Ammayi Gurinchi Meeku Cheppali). మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. సెప్టెంబర్‌ 15న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయాన్ని అందుకుంది. ఈ సినిమాపై తాజాగా తన అభిప్రాయాన్ని బయటపెట్టారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ‘పరుచూరి పలుకులు’ వేదికగా ఈ సినిమాపై రివ్యూ చెబుతూ వీడియో షేర్‌ చేశారు.

‘‘ఇంద్రగంటి మోహన్‌కృష్ణ తెరకెక్కించిన ‘గ్రహణం’తో నేను ఆయనకు అభిమానిని అయ్యా. ఇటీవల ఆయన తెరకెక్కించిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ చిత్రాన్ని రివ్యూ చేయాలని నిర్ణయించుకున్నాక ఆయనకు ఫోన్‌ చేశా. సినిమా ఫలితంతో తాను నిరాశకు గురయ్యానని ఆయన చెప్పారు’’

‘‘ఈ సినిమాలో ప్రధానంగా మూడు ఆశయాలు ఉన్నాయి. ఒక సంప్రదాయ కుటుంబానికి చెందిన ఇద్దరు కవల సోదరీమణులు, వాళ్ల తల్లిదండ్రుల ఆశయాలను చూపిస్తూ దీన్ని తెరకెక్కించారు. ఇందులో కృతిశెట్టి.. అఖిల, అలేఖ్యగా ద్విపాత్రాభినయంలో నటించారు. పెద్దమ్మాయి అఖిలకు సినిమా అంటే ఇష్టం. ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనేది ఆమె ఆశయం. పిల్లలు కేవలం చదువుకోవాలి, సినిమాల్లోకి వెళ్లకూడదు అనేది తల్లిదండ్రుల ఆశయం. ఎలాగైనా అక్క కోరిక తీర్చాలి అనేది అలేఖ్య లక్ష్యం. ఇలా మూడు లక్ష్యాలు ఒక్కదానికొకటి మిళితమై పరిగెడుతూ ఇందులో కనిపిస్తాయి 

లెవన్త్‌ అవర్‌ విషయానికి వస్తే.. టైటిల్‌ తప్పుతో కూడా ప్రేక్షకులకు సినిమా దూరమైపోతుంది. సినిమా విషయంలో టైటిల్‌ ప్రధాన పాత్ర వహిస్తుంది. ఈచిత్రానికి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే టైటిల్‌ కంటే కూడా ‘ఆ అమ్మాయి ప్రేమ గురించి మీకు చెప్పాలి’ అని పెట్టుంటే ఇది చాలామందిని ఆకర్షించేదని నా భావన. సెకండాఫ్‌లో ఎలిమెంట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌పై మరింత పట్టు బిగించి ఉంటే బాగుండేదనిపించింది. ఇది 10 లేదా 14రోజులు ఆడాల్సిన సినిమా కాదు.. ఎందుకంటే కథ చాలా బాగుంది. అలాగే దర్శకుడు కథలో  ఇంకాస్త వేగం పెంచి, నవ్వులు పండించే విధంగా సీన్స్‌ పెట్టి ఉంటే సినిమా హిట్‌ అయ్యేదని అనుకుంటున్నా’’ అని వివరించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని