Acharya: ‘ఆచార్య’ టైటిల్‌ కరెక్ట్‌ కాదు.. రామ్‌చరణ్‌ ఆ రోల్‌ చేయకపోతే బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi), రామ్‌చరణ్‌ (RamCharan) ప్రధాన పాత్రల్లో నటించిన సరికొత్త చిత్రానికి ‘ఆచార్య’ (Acharya) అనే టైటిల్‌ పెట్టకుండా ఉండుంటే బాగుండేదని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ....

Published : 02 Jul 2022 13:21 IST

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi), రామ్‌చరణ్‌ (RamCharan) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రానికి ‘ఆచార్య’ (Acharya) అనే టైటిల్‌ పెట్టకుండా ఉండుంటే బాగుండేదని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopalakrishna) అన్నారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన ఆయన సోషల్‌మీడియా వేదికగా సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘ఆచార్య’ సాగిన తీరు తాను రచించిన ‘మరో మలుపు’ (Maro Malupu) కోవలో ఉందన్నారు.

‘‘ఆచార్య’  చూస్తున్నప్పుడు ‘మరో మలుపు’ గుర్తుకు వచ్చింది. ‘మరో మలుపు’ వెళ్లిన దారిలోనే ఈ సినిమా సాగిందనిపించింది. 1980లో ఎన్నో ఎర్ర సినిమాలు వచ్చాయి. ఎంతగానో ఆడాయి. ఒక దశకు వచ్చాక ఎర్ర సినిమాలు రాయడం రచయితలు మానేశారు. తీయడం దర్శకులూ మానేశారు. ఇలాంటి ఈ సమయంలో ఒక ఎర్ర సినిమాని తీయాలని, మంచి పాయింట్‌ని ప్రేక్షకులకు అందించాలని కొరటాల శివకు కోరిక పుట్టడం, దానికి చిరు అంగీకరించడంతో ‘ఆచార్య’ రూపుదిద్దుకుంది’’

‘‘సినిమాగా చూస్తే ఇందులో తప్పు ఏమీ లేదు. కానీ, కథలో ముఖ్యమైన సంఘటన.. ఎందుకు జరిగింది?ఏం జరిగింది?అనేది చెప్పకుండా కథను నడిపించిన తీరు ప్రేక్షకుడిని అయోమయంలో పడేసింది. సస్పెన్స్‌, సెంటిమెంట్‌ ఒకే చోట ఇమడవు. రామ్‌చరణ్‌ పోషించిన సిద్ధ పాత్ర ఫస్టాప్‌లోనే వచ్చుంటే బాగుండేది. ఆ పాత్రను మొత్తంగా కాకపోయినా కొంతైనా అక్కడ చూపించి ఉండుంటే ఇంకోలా ఉండేది. డైలాగ్‌లు, కథాంశం, పెర్ఫార్మెన్స్‌లు బాగున్నాయి. ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో కమ్యూనిజం భావజాలం ఉన్న సినిమాలు ప్రేక్షకులకు అంతగా నప్పడం లేదు’’

‘‘చివరిగా.. రామ్‌చరణ్‌ చేత ‘సిద్ధ’ పాత్ర చేయించకుండా ఉంటేనే బాగుండేదేమో. ఫ్లాష్‌బ్యాక్‌ కేవలం 10 శాతం ఉంచి, చిరు స్టోరీ 90 శాతం ఉండుంటే ఈ కథ రిజల్ట్‌ మరోలా ఉండేది. సంగీతం సరిగ్గా కుదరలేదు. కమ్యూనిస్ట్‌ భావజాలం ఉన్న పాత్రలో చిరు స్టెప్పులు వేయకుండా ఉంటే బాగుండేది. ఈ చిత్రానికి ‘ఆచార్య’ టైటిల్‌ కరెక్ట్‌ కాదు అనిపించింది’’ అని పరిచూరి గోపాలకృష్ణ వివరించారు.

నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో సిద్ధమైన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. ఇందులో చిరంజీవి ‘ఆచార్య’గా, రామ్‌చరణ్‌.. ‘సిద్ధ’గా నటించారు. పూజాహెగ్డే కథానాయిక. సోనూసూద్‌ కీలకపాత్ర పోషించారు. వేసవి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయాన్ని అందుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని