Paruchuri Gopala Krishna: ‘ధమాకా’.. ఆ సీన్‌ చీటింగ్‌ షాట్‌లా అనిపించింది..!

‘ధమాకా’ (Dhamaka) గతేడాది డిసెంబర్‌లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రమిది. రవితేజ (Raviteja), శ్రీలీల (SreLeela) జంటగా నటించిన ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna).

Updated : 28 Jan 2023 15:34 IST

హైదరాబాద్‌: రవితేజ (Raviteja), శ్రీలీల (SreeLeela) జంటగా నటించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ధమాకా’ (Dhamaka). నక్కిన త్రినాథరావు దర్శకుడు. డిసెంబర్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో ‘ధమాకా’పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri GopalaKrishna). రవితేజ నటన, దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కించిన తీరును ఆయన మెచ్చుకున్నారు.

‘‘తన తండ్రి కాని తండ్రి ఆస్తిని లాక్కోవాలని చూసే విలన్‌ పని పట్టిన ఓ హీరో కథ ఈ చిత్రం. ఈ సినిమాలో రావు రమేశ్‌, శ్రీలీల పాత్రలు చూస్తే పర్‌ఫెక్ట్‌ క్యారెక్టరైజేషన్‌ అనేది అవసరం లేదని చెప్పడానికి సరైన ఉదాహరణలుగా అనిపించాయి. రచయిత ఎలాంటి కష్టం లేకుండా ఈ పాత్రలను సృష్టించాడు. రావురమేశ్‌ పక్కన హైపర్‌ ఆదిని పెట్టారు. వాళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అలా సరదాగా సాగిపోతూ ఉంటాయి.

హీరోని ఓ వ్యక్తి తలపై కొడితే అతడు కిందపడిపోవడంతో కథ మొదలవుతుంది. సాధారణంగా ఒక మాస్‌ హీరోకి ఇలాంటి ప్రారంభ సన్నివేశాలు ఉండవు. కానీ, దర్శకుడు సాహసోపేతంగా ఓపెనింగ్ షార్ట్‌ తెరకెక్కించాడు. ఎక్కడ సస్పెన్స్‌ ఉంటుందో.. అక్కడ సెంటిమెంట్‌ పండదనే సూక్తిని దర్శకుడు బాగా నమ్మాడు. అందుకే సినిమాలో ఉన్నది ఇద్దరు రవితేజ(Raviteja)లు కాదు ఒక్కరే అనే విషయాన్ని ఆయన ఇంటర్వెల్‌కు ముందే తోటి ఆర్టిస్టులకు తప్ప ఆడియన్స్‌కు అర్థమయ్యేలా నిజం చెప్పేశాడు. ఇది చేయబట్టే ఈ సినిమా రూ.40 కోట్ల బడ్జెట్‌తో తీస్తే రూ.110 కోట్ల వసూళ్లు రాబట్టిందని సినీ విశ్లేషకుల అంచనా. అంటే రూపాయికి రూపాయిన్నర లాభం వచ్చినట్టే.

సినిమాని తెరకెక్కించిన విధానం చూస్తే ప్రేక్షకులతో ఆ దర్శకుడు, రచయితలు ఆడుకున్నారనిపించింది. ఒక్క క్షణం అలా కంటిచూపు తిప్పితే కథను మిస్‌ అయిపోతామనే భయాన్ని స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుల్లో క్రియేట్‌ చేశారు. దర్శకుడి ప్రతిభకు రవితేజ నటన తోడు కావడంతో సినిమా అద్భుతంగా వచ్చింది. అందుకు రవితేజకు హ్యాట్సాఫ్‌ చెప్పాలి. అయితే ఈ చిత్రాన్ని మనం ఇంట్లో సోలోగా చూస్తే ఇదేం పెద్ద గొప్ప సినిమాగా అనిపించదు. థియేటర్‌లో నలుగురితో కలిసి చూస్తే ఈ సినిమా మరింత ఎక్కువ  సంపాదించి ఉండాల్సింది కదా అనిపిస్తుంది. ఇందులోని ఓ సన్నివేశంలో రావు రమేశ్‌.. రవితేజను చూసి దండం పెడతాడు. ఆ సీన్‌ చూస్తే మేము రాసిన ‘సమర సింహారెడ్డి’, ‘ఇంద్ర’ సినిమాలు గుర్తుకు వచ్చాయి. అది నాకు చీటింగ్‌ షాట్‌లా అనిపించింది (నవ్వులు). అంతేకాకుండా రావు రమేశ్‌ పాత్ర తీరు కాస్త అయోమయంగా అనిపించింది. మిగతా పాత్రలు బాగున్నాయి. క్లైమాక్స్‌ మనసుని హత్తుకునేలా ఉంది. అన్యాయంగా ఇంకొకరి సొమ్మును కాజేయవద్దనే సందేశాన్ని ఈ సినిమాతో దర్శకుడు ప్రపంచానికి అందించారు’’ అని పరుచూరి (Paruchuri) తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని