Vikram: కమల్‌ బాడీలాంగ్వేజ్‌కు సరిపోయే కథ ఇది కాదు కానీ..

‘విక్రమ్‌’ (Vikram).. ఇటీవల సినీ, యాక్షన్‌ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకున్న చిత్రం. కమల్‌ హాసన్‌ (Kamal Haasan), ఫహద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil), విజయ్‌ సేతుపతి...

Published : 25 Sep 2022 01:31 IST

‘విక్రమ్‌’పై పరుచూరి అభిప్రాయమిది

హైదరాబాద్‌: ‘విక్రమ్‌’ (Vikram).. ఇటీవల సినీ, యాక్షన్‌ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకున్న చిత్రం. కమల్‌ హాసన్‌ (Kamal Haasan), ఫహద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil), విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించారు. రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమాపై ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. లోకేశ్‌ కనగరాజ్‌ స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. కమల్‌హాసన్‌ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే కథ ఇది కాదని.. అయినప్పటికీ విక్రమ్‌గా ఆయన పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారని అన్నారు.

‘‘త్రిమూర్తులు ప్రపంచానికి ఎలాగో. ఈ చిత్రానికి కమల్‌హాసన్‌, ఫహద్‌ ఫాజిల్‌, విజయ్‌ సేతుపతి.. ముగ్గురూ మూడు స్తంభాలు. నాలుగో స్తంభం దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌. ముగ్గురు హీరోలను ప్రధాన పాత్రలుగా చేసుకొని ఈ చిత్రాన్ని రూపొందించినప్పటికీ ఈ సినిమా మొత్తం ఎన్నో పాత్రలు ఉన్నాయి.  ఈ మధ్యకాలంలో స్క్రీన్‌ప్లేలో కొత్త ఒరవడి వచ్చింది. కనురెప్ప వేయకుండా చూస్తేనే సినిమా అర్థమయ్యేలా దర్శకులు స్క్రీన్‌ప్లేని తీర్చిదిద్దుతున్నారు. అలాంటి చిత్రాల్లో ‘విక్రమ్‌’ ఒకటి.

మాదకద్రవ్య రహిత దేశంగా భారత్‌ను చూడాలనుకోవడమే లక్ష్యంగా కమల్‌హాసన్‌ పాత్ర తీర్చిదిద్దారు. ఈ కథలో అంతర్గతంగా మూడు కథలు చూపించారు. సాధారణంగా సినిమా కథలో ఎప్పుడూ రెండు భాగాలుంటాయి. సాంఘిక, సామాజిక అవగాహన నేపథ్యం ఒకటి. మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించడం అలాంటిదే. కొంతమంది తెలివి తేటలతో వ్యక్తిగతమైన కథలను కూడా ప్రధాన కథలోనే మిళితం చేసి చూపిస్తారు. ఉదాహరణకు ఎన్టీఆర్‌ నటించిన ‘కొండవీటి సింహం’ చూస్తే ఆయన పోలీస్‌ ఆఫీసర్‌గా ఉండి అన్యాయంపై పోరాటం చేస్తే ప్రేక్షకులకు అంతగా నచ్చదు. ఆయన కొడుకు ఎలాంటి నేరం చేశాడు? అనే కోణంలో కథను తీర్చిదిద్దితేనే చూసే ప్రేక్షకుడిలో ఆసక్తి పెరుగుతుంది.

 

‘విక్రమ్‌’లో అందుకు విభిన్నంగా చూపించారు. అండర్‌గ్రౌండ్‌లో ఉండి 130 పైచిలుకు కేసుల్ని పరిష్కరించిన బ్లాక్‌ స్క్వాడ్‌ బృందాన్ని ఒక కేసులో ఫెయిల్‌ కావడంతో చంపేసినట్లు చూపిస్తారు. వారిలో నలుగురు బతుకుతారు. అందులో కమల్‌హాసన్‌ ముఖ్యుడు. ఆ నలుగురు బతికే ఉన్నారని ఎవరికీ తెలియదు. కమల్‌ హాసన్‌ పాత్రని ఫస్టాఫ్‌ మొత్తం మత్తు పదార్థాలకు బానిస, మద్యం సేవించే వ్యక్తిగా చూపించారు. చూసే ప్రేక్షకులు కూడా మోసపోతారు. అయితే, ఫస్టాఫ్‌ మొత్తం ఫహద్‌ కథలానే కనిపిస్తుంది తప్ప.. కమల్‌హాసన్‌ కథలా అనిపించదు.

సామాజిక నేపథ్యంలోని కథ  మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలనుకోవడమైతే.. వ్యక్తిగత నేపథ్యంలోని కథ ప్రభంజన్‌ పాత్రది. విక్రమ్‌ కుమారుడే ప్రభంజన్‌. ప్రభంజన్‌ మరణం తర్వాత విక్రమ్‌.. డ్రగ్స్‌కు సంబంధించిన వారందర్నీ చంపుకొంటూ వెళ్తాడు. విక్రమ్‌ లక్ష్యం తెలుసుకున్న అమర్‌ (ఫహద్‌ ఫాజిల్‌) తన మనసు మార్చుకుని ఆయనకు సాయం చేస్తాడు. అందులో ఒకటి విజయ్‌ సేతుపతి నడిపిస్తోన్న డ్రగ్స్‌ దందాను బాంబులతో పేల్చేయడం.

కమల్‌హాసన్‌ అంటే అద్భుతమైన పాత్రలు గుర్తుకువస్తాయి. ఒక మహానటుడు అంటే ఆయనే అనుకున్నాం. కానీ ఈ సినిమాలో కమల్‌ని చూస్తే రజనీకాంత్‌ బాడీ లాంగ్వేజ్‌ని చూసినట్లు అనిపిస్తుంది. ఇది కమల్‌ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే కథ కాదు. కానీ, ఆ భావన ప్రేక్షకుడిలో కలగకుండా అద్భుతంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా సినిమా చివర్లో సెంటిమెంట్‌ సీన్స్‌ వచ్చినప్పుడు పిల్లాడిని నవ్వించడానికి కమల్‌ చేసే నటన చూస్తే ఆయన నిజంగానే మహానటుడు అనిపిస్తుంది. ఆయనకు మాత్రమే ఇది చెల్లుతుంది. ఇక, సినిమాలోని ప్రతి చిన్న పాత్రను చక్కగా రూపొందించారు. విజయ్‌ సేతుపతిని నేను ఇప్పటివరకూ హీరోగానే చూశా. ఇందులో సంతానం పాత్రలో ఆయన ఒదిగిపోయారు. సూర్య నటించిన రోలెక్స్‌ పాత్ర చూసి ఉలిక్కిపడ్డాను. ఒకవేళ పార్ట్‌ - 2 తీస్తే కమల్‌హాసన్‌ - సూర్య మధ్య చూపిస్తారా? అని భయమేసింది. ముఖ్యంగా, కమల్‌ ఈ సినిమాతో మహానటుడని మరోసారి నిరూపించుకున్నారు’’ అని పరిచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని