Paruchuri: ‘మసూద’.. నాకెంతో భయం వేసింది : పరుచూరి

‘మసూద’(Masooda) సినిమాపై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు ప్రముఖ రచయిత గోపాలకృష్ణ. సినిమాని తెరకెక్కించిన విధానం బాగుందని ఆయన అన్నారు. సరదా కోసం దీనిని చూడొచ్చని చెప్పారు.

Published : 07 Jan 2023 11:26 IST

హైదరాబాద్‌: సంగీత(Sangeetha), బాంధవి శ్రీధర్‌‌, తిరువీర్ (ThiruVeer) ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘మసూద’ (Masooda). చేతబడి, ఆత్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna). ఈ సినిమా అద్భుతంగా ఉందన్నారు. చాలా చిన్న కథను దర్శకుడు సాయి కిరణ్ ఎంతో నేర్పుతో తెరకెక్కించారని మెచ్చుకున్నారు. మొదటి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి ప్రతిభ కనబర్చాడని ప్రశంసించారు.

‘‘నవంబర్‌ 18, 2022లో విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఘోస్ట్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఆత్మలు ఉన్నాయా? దెయ్యాలను నమ్మొచ్చా? ఇలాంటి కథాంశంతో గతంలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. మధ్యలో తగ్గినప్పటికీ.. ఈ మధ్యకాలంలో ఇవి మళ్లీ ఎక్కువగా వస్తున్నాయి. ఈ సినిమా చూస్తే ఆత్మలు ఉన్నాయి అనే నమ్మకం సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. ఇది తల్లీకూతుళ్ల కథ. తన కుమార్తె నజియా (బాంధవి శ్రీధర్‌)ను మసూద అనే ఆత్మ ఆవహించినప్పుడు దానిని బయటకు పంపి తన కుమార్తెను కాపాడుకునేందుకు నీలం (సంగీత), వాళ్లింటి పక్కన ఉండే గోపీ(తిరువీర్‌) ఏం చేశారు? ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? అనేదే ఈ సినిమా కథ’’

‘‘దర్శకుడు సాయికిరణ్‌ ఈచిత్రాన్ని ఒక ప్రేమకథగా మొదలుపెట్టారు. ప్రేమలో విఫలమై ఎవరో ఏదో చేసి ఉంటారు? అని మొదట అనుకున్నాను. కొంతసేపటికే కథ మారిపోయింది. ప్రధాన కథలోకి ఆయన తీసుకువెళ్లిన విధానం అద్భుతంగా ఉంది. ఇలాంటి కథలకు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఎంతో ముఖ్యం. ప్రశాంత్‌.ఆర్‌.విహారి.. సంగీతం మామూలుగా లేదు. టీవీలో చూస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌ సౌండ్స్‌కు నాకెంతో భయంగా అనిపించింది. ‘కాంతార’ మాదిరిగానే ఈ సినిమా కూడా థియేటర్‌లో ప్రేక్షకులను వణికించి ఉంటుంది’’

‘‘అయితే ఈ సినిమా విషయంలో నాకు రెండు సందేహాలు ఉన్నాయి. మసూద బ్యాక్‌గ్రౌండ్‌ స్టోరీ సినిమా ఆరంభంలో.. సినిమా మధ్యలోనూ చూపించారు. అలా రెండు సార్లుగా కాకుండా ఒకేసారి సినిమా మధ్యలో ఆ కథ చెప్పి ఉంటే బాగుండేదనిపించింది. సినిమా క్లైమాక్స్‌లోనూ.. మసూద బాడీని బయటకు తీస్తున్నప్పుడు ఆమె ఆత్మ హీరోపై ఎటాక్‌ చేస్తున్నట్లు చూపించారు. అదే సమయంలో నజియా బాడీలో ఉన్న మసూద ఆత్మ.. ఆమె చుట్టూ ఉన్న వాళ్లపై దాడి చేసినట్లు చూపించారు. ఒకే ఆత్మ ఒకే సమయంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటుందా అనిపించింది. అయితే, సినిమా అంటేనే ఒక కల్పన కాబట్టి ఇలాంటి విషయాలను పట్టించుకోకపోవచ్చు. ఈ అద్భుతమైన చిత్రాన్ని సరదా కోసం చూడండి. ఎందుకంటే, విజ్ఞానమో, వికాసమో కలిగించే చిత్రాలను పదే పదే చూడొచ్చు ఇలాంటి చిత్రాలను ఎంటర్‌టైనమెంట్‌ కోసం చూస్తే సరిపోతుంది’’ అని పరుచూరి వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని